పవర్‌స్టార్ లేకుండా గంటన్నర సినిమా చూడాలా?
on Apr 6, 2021

పవన్ కల్యాణ్ టైటిల్ రోల్ చేసిన 'వకీల్ సాబ్' మూవీ కోసం ఫ్యాన్స్ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ వ్యూస్, లైక్స్ పరంగా సరికొత్త రికార్డులు సృష్టించడం ఫ్యాన్స్‌లో ఆ సినిమాకు వచ్చిన క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో ఊహించవచ్చు. బాలీవుడ్ హిట్ ఫిల్మ్ 'పింక్'కు రీమేక్‌గా శ్రీరామ్ వేణు డైరెక్ట్ చేసిన 'వకీల్ సాబ్'లో కోర్టు సీన్లు హైలైట్ అవనున్నాయని ట్రైలర్ తెలియజేసింది. లేటెస్ట్‌గా ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ నుంచి యు/ఎ సర్టిఫికెట్ లభించింది.
ఇంతవరకు బాగానే ఉంది కానీ, సెన్సార్ నుంచి బయటకొచ్చిన ఓ విషయం ఇప్పుడు ఫ్యాన్స్‌ను కలవరపెడుతోంది. అది పవర్‌స్టార్ తెరమీద కనిపించేది 50 నిమిషాల సేపే అనేది! సినిమా మొత్తం రన్ టైమ్ 2:35 గంటలు. అంటే గంటన్నర పైగా సినిమాని పవన్ లేకుండానే చూడాలా అనే బాధ వారిలో వ్యక్తమవుతోంది. ఈ సినిమా కథ ముగ్గురు వర్కింగ్ విమెన్ చుట్టూ నడుస్తుంది. ఆ క్యారెక్టర్స్‌ను నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ల పోషించారు. సరదాగా గడపడానికి ఓ రిసార్ట్‌కు వెళ్లిన ఆ ముగ్గురూ లైంగిక వేధింపులకు గురవుతారు. తమను తాము కాపాడుకొనే యత్నంలో తమపై దాడి వేసిన ఓ వ్యక్తిని గాయపరుస్తారు. దీన్ని భరించలేని వారు కోర్టులో కేసు వేస్తారు. ముగ్గురు యువతులూ నిందితులవగా, వారి తరపున కేసు వాదించడానికి వకీల్ సాబ్ వస్తాడు. అప్పటి దాకా కథ ఆ ముగ్గురు యువతుల మీదే నడుస్తుంది.
కాబట్టి, పవన్ కల్యాణ్ లేకుండా ఇంతసేపు సినిమాని చూడాలా అని సోషల్ మీడియా ద్వారా తమ బాధను అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. అయితే స్క్రీన్ మీద కనిపించినంత సేపూ పవర్‌స్టార్ అదరగొట్టేస్తాడనేది సెన్సార్ రిపోర్ట్. దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 9న విడుదలవుతోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



