పవన్ కల్యాణ్‌లో గొప్ప రాజకీయ నాయకుడి లక్షణాలున్నాయ్!
on Apr 12, 2021
పవన్ కల్యాణ్ ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చారు. ఓడిపోయినా ప్రజల కోసం నిలబడ్డారు. అదీ గొప్ప రాజకీయ నాయకుడి లక్షణం. పవన్ గారిలో ఆ నాయకత్వ లక్షణాలున్నాయి. అని చెప్పారు విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్. పవన్ కల్యాణ్ టైటిల్ రోల్ చేసిన వకీల్ సాబ్‌లో పబ్లిక్ ప్రాసిక్యూటర్ నందగోపాల్ అలియాస్ నందాజీ క్యారెక్టర్‌లో ప్రకాశ్ రాజ్ రాణించారు. సెకండాఫ్‌లో నడిచే కోర్ట్ డ్రామా పవన్ కల్యాణ్ వర్సెస్ ప్రకాశ్ రాజ్ అన్నట్లు నడిచి, సినిమాకు అది హైలైట్‌గా నిలిచింది.
వకీల్ సాబ్ సినిమా భారీ వసూళ్లతో సక్సెస్‌ఫుల్‌గా థియేటర్లలో రన్ అవుతోంది. ఈ సందర్భంగా సోమవారం మీడియా ప్రతినిధులతో సంభాషించారు ప్రకాశ్ రాజ్. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్‌తో తన అనుబంధం గురించీ, రాజకీయంగా తానెలా ఆయనను విభేదిస్తాననే అంశం గురించీ మాట్లాడారు. వకీల్ సాబ్ మూవీ కథ పవన్ కల్యాణ్ ఆలోచనలకు బాగా దగ్గరైన కథ అని ఆయన అన్నారు. ఆయనకు చాలా రిలవెంట్ సబ్జెక్ట్. ఆయన కొన్ని సంభాషణలు చెబుతున్నప్పుడు అవి మనసులో నుంచే వచ్చాయి అనిపిస్తుంది. మహిళల గురించి సినిమా చేసినా మనకు సాంగ్స్, ఫైట్స్ కావాలి. పవన్ గారి ఇమేజ్ కు అనుగుణంగా సినిమా చేస్తూనే... అవన్నీ చేర్చారు. దర్శకుడు శ్రీరామ్ వేణు, నిర్మాత దిల్ రాజు ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకున్నారు. అని ప్రకాశ్ రాజ్ చెప్పారు.
ఒరిజినల్ పింక్ సినిమాలో లాయర్ క్యారెక్టర్‌ను తెలుగు రీమేక్‌లో మార్చడాన్ని ఆయన సమర్ధించారు. పింక్ లో అమితాబ్ బచ్చన్ నటించినప్పుడు దాని మీదున్న అంచనాలు వేరు, అజిత్ గారు తమిళంలో చేసినప్పుడు ఆయన ఇమేజ్ కు తగినట్లు చేశారు. అలాగే ఇక్కడ పవన్ గారు మూడేళ్ల తర్వాత సినిమా చేస్తున్నారంటే, ఆయన ఇమేజ్ కు తగిన సినిమా చేయాలి. పవన్ గారి ఆలోచనా విధానానికి తగిన కథే ఇది. అన్నారు ప్రకాశ్ రాజ్.
పవన్ కల్యాణ్‌ను రాజకీయంగా విమర్శించడం గురించి మాట్లాడుతూ, పవన్ గారిని చాలా ప్రేమిస్తాను కాబట్టే విమర్శించాను. ఆయనతో రాజకీయంగా నాకు భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. పవన్ గారు మాట్లాడుతూ.. ప్రకాష్ రాజ్ గారితో భిన్నాభిప్రాయాలు ఉన్నా ఆయన అభిప్రాయాలను గౌరవిస్తాను అన్నారు. పవన్ గారు ఒక లీడర్. ఆయన్ను ప్రేమిస్తాను కాబట్టే పవన్ గారు అలా ఉండాలి అని కోరుకుంటాను. అని చెప్పారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



