పవన్ ఫ్యాన్స్ Vs మహేష్ ఫ్యాన్స్
on May 22, 2016
పవన్, మహేష్... ఇద్దరూ ఇద్దరే. ఎవరి స్టార్ డమ్ వాళ్లది, ఎవరి ఇమేజ్ వాళ్లది. టాలీవుడ్లో నెంబర్ వన్ స్థానానికి ఇద్దరూ అర్హులే! అయితే ఇప్పుడు వాళ్లిద్దరి మద్య గ్యాప్ పెరుగుతోంది. దానికి కారణం.. స్వయంగా వాళ్ల అభిమానులే. ఇద్దరు అగ్ర హీరోల మధ్య పోటీ ఉండడం సహజం. ఆ పోటీని హీరోలిద్దరూ సీరియస్‌గా తీసుకోకపోయినా వాళ్ల ఫ్యాన్స్ మాత్రం యమ సీరియస్‌గా తీసుకొన్నారు. మా హీరో ఎక్కువ రికార్డులు బద్దలు కొట్టాడు అంటే.. మా హీరో ఎక్కువ రికార్డులు బద్దలు కొట్టాడంటూ ఇద్దరి ఫ్యాన్స్ ఫేస్‌బుక్‌లలో ట్విట్టర్లలో కొట్టుకొంటున్నారు. ఒక హీరో సినిమా ఫ్లాప్ అయ్యిందంటే.. మరో హీరో ఫ్యాన్ దాన్ని అట్టర్ ఫ్లాప్ చేసేంత వరకూ వదలడం లేదు. ఆమధ్య సర్దార్ గబ్బర్ సింగ్ విడుదలైంది. ఆ సినిమా ఫ్లాప్ అయ్యిందని పవన్ ఫ్యాన్స్ ఎంత బాధపడ్డారో, మహేష్ ఫ్యాన్స్ అంత సంతోషపడ్డారు. ''ఈ సినిమా రాడ్డు.. ఇక పవన్ పని అయిపోయింది'' అంటూ ఫేస్‌బుక్‌లలో, ట్విట్టర్లలో అరచి గోల పెట్టారు.
ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ వంతు వచ్చింది. బ్రహ్మోత్సవం చూసి వాళ్లు ఆగలేకపోతున్నారు. సర్దార్కి ఎంత నెగిటీవ్ ప్రచారం చేశారో.. దానికి డబుల్ నెగిటీవ్ టాక్ బ్రహ్మోత్సవంపై నడుస్తోంది. దానికి కారణం అక్షరాలా పవన్ ఫ్యాన్సే. బ్రహ్మోత్సవం సినిమాకు వచ్చినన్ని విమర్శలు, ఫేస్ బుక్‌లో కౌంటర్లు మరే సినిమాకీ రాలేదేమో? ఈ సినిమాని టీవీ సీరియళ్లతో పోలుస్తూ పేరడీలు తయారు చేస్తున్నారు. ఈ సినిమాకి ఎంత డామేజీ రావాలో అంతకంటే ఎక్కువే వచ్చింది. ఇదంతా సినిమా వసూళ్లపై ప్రభావం చూపడం ఖాయం. దీనికి కారణం ఎవరు?? సినిమా బాగోలేకపోవడం ఒక ఎత్తయితే... ఫ్యాన్స్ మధ్య ఏర్పడిన పోటీ మరో ఎత్తు. అందుకే ఒకరి సినిమాని మరొకరు కావాలనే చంపేస్తున్నారు. రేపు మళ్లీ పవన్ సినిమా వస్తుంది. అది కాస్త అటూ ఇటూ అయితే పరిస్థితి ఏమిటి? ఫ్యాన్స్ మధ్య పోటీ ఎలా ఉన్నా... ఆ సినిమా తీసినవాళ్లు,కొన్నవాళ్లు ఆ సినిమానే నమ్ముకొన్నవాళ్లూ అడ్డంగా బలైపోతున్నారు. మరి విష సంస్ర్కృతి ఆగేదెలా? సినిమా బతికి బట్టకట్టేదెలా? నా హీరో హీరో.. నీ హీరో జీరో.. అనే భ్రమల నుంచి, వెర్రి అభిమానం నుంచి ఫ్యాన్స్ బయటకు రావాలి. అప్పటి వరకూ ఇలాంటి ప్రచ్ఛన్న యుద్దాలు కొనసాగుతూనే ఉంటాయి. సినిమాలు బలైపోతూనే ఉంటాయి.
Also Read