1541 సినిమాలకు మ్యూజిక్ చేసినా.. ఇప్పటికీ సంగీతం తెలీదు!
on Jan 30, 2026
సినిమా సంగీతానికి కొత్త హంగులు, కొత్త సొబగులు అద్దిన సంగీత దర్శకులు ఎంతో మంది ఉన్నారు. మారుతున్న సంగీత ప్రియుల అభిరుచి మేరకు సినిమా సంగీతం కూడా మారుతూ వచ్చింది. ఒక దశలో కమర్షియల్ పాటలకే పరిమితమైపోయిన సినీ సంగీత ప్రపంచంలో ఇళయరాజా అనే సంగీత దర్శకుడు ప్రవేశించి ఒక కొత్త తరహా సంగీతానికి శ్రీకారం చుట్టారు. అప్పటివరకు ప్రముఖ సంగీత దర్శకులుగా కొనసాగుతున్న కొందరిని పక్కకు నెట్టి తన సంగీతంతో శ్రోతలకు కొత్త అనుభూతిని కలిగించారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ, ఇంగీష్ భాషల సినిమాల ద్వారా ఎవరూ చేయని ప్రయోగాలు చేసి అందరికీ ఆరాధ్య సంగీత దర్శకుడయ్యారు.
1976లో అన్నక్కలి అనే తమిళ సినిమాకి సంగీతం అందించడం ద్వారా సంగీత దర్శకుడుగా పరిచయమయ్యారు ఇళయరాజా. అప్ప్పుడు మొదలుకొని దాదాపు 50 సంవత్సరాలుగా అన్ని భాషల్లోనూ తన సంగీతంతో అందర్నీ అలరిస్తున్నారు. ఇప్పటికి 1541 సినిమాలకు సంగీతాన్ని అందించి ఒక కొత్త రికార్డును క్రియేట్ చేశారు ఇళయరాజా. ఎన్నో వేల పాటలు కంపోజ్ చేసిన ఆయన్ని ప్రతిష్ఠాత్మక పద్మపాణి అవార్డు వరించింది. మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో జరుగుతున్న 11వ అజంతా ఎల్లోరా అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ఈ పురస్కారాన్ని స్వీకరించారు ఇళయరాజా.
పురస్కారాన్ని అందుకున్న తర్వాత ఇళయరాజా ప్రస్తావించిన కొన్ని అంశాలు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఎంత ఎత్తుకు ఎదిగినా తను నిమిత్త మాత్రుడ్ని అని చెప్ప్పుకోవడం అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు. అది ఇళయరాజా మాటల్లో ధ్వనించింది. ఆయన ఏమన్నారంటే.. ‘నా 1541వ సినిమాకి సంబంధించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పూర్తి చేసి ఇక్కడికి వచ్చాను. నేను ఒక పాటను ఎలా స్వరపరుస్తాను అనే విషయాన్ని ఎంతో మంది, ఎన్నోసార్లు నన్ను అడిగారు. వారికి నేను చెప్పే సమాధానం ఒక్కటే.. నాకు సంగీతం తెలియదు అని. ఇది అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. కానీ, ఇది నిజం. అందుకే నేను ఇంకా పనిచేయగలుగుతున్నాను. నాకు సంగీతం గురించి పూర్తిగా తెలిసిపోయి ఉంటే.. ఇంకా తెలుసుకోవడానికి ఏమీ ఉండదు కాబట్టి నేను ఇంట్లోనే ఉండిపోయేవాడ్ని. తెలియదు కాబట్టే తెలుసుకునేందుకు సినిమాలు చేస్తూ వెళ్లిపోతున్నాను’ అన్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



