ENGLISH | TELUGU  

పాత బంగారం: నవ్వుల నజరానా ‘చక్రపాణి’

on Mar 30, 2015



పిసినారి తాతయ్య చక్రపాణికి గడసరి మనవరాలు మాలతి. చక్రపాణి మహా పిసినారి. పండగరోజున పాత బట్టలు కుట్టుకొని వేసుకున్నా వూరుకుంటాడు కానీ కొత్తబట్టలు కొనియ్యడు. మరి గడుసరి మనవరాలు ఊరుకుంటుందా తనే కొనేసి తాతయ్య దగ్గర గుమాస్తాతో డబ్బులు ఇప్పిస్తుంది.చదువు చెప్పించని తాతయ్య మీద అలిగి జగన్నాధం ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు. జగన్నాధం మీద దిగులుతో మంచానబడ్డ అమ్మకు వైద్యం కూడా చేయించకపోవటంతో చనిపోతుంది. తాతయ్య అక్క శాంతకు రెండో పెళ్ళివాడిని , మాలతికి మూగవాడిని నిశ్చయిస్తాడు.ఆ పెళ్ళి ఇష్టం లేని మాలతి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. రైల్లో పరిచయమైన భార్యా భర్తలతో వారింటికి వెళుతుంది. అక్క వెంట వచ్చిన మాలతిని ఇష్టపడతాడు చలం. మాలతి కూడా సరేననటంతో వారి వివాహం జరిగిపోతుంది.మొదటిరాత్రే భర్తకు, తన కోపం భరించాలని, సంసారంలో స్వతంత్రం కావాలని, అందరిలా కాకుండా హాయిగా సంసారం గడపాలని షరతులు విధిస్తుంది. ఇల్లు నడిపేందుకు ఇంట్లో కొంత భాగం మనోరమకు అద్దెకు ఇస్తుంది. తాతయ్య తను సంపాదించిన లక్షరూపాయలు మొదటి మనవడికి ఇస్తానంటంతో  మనోరమ సలహా మీద ఎదురింటి వాళ్ళ బాబును తన కొడుకుగా తాతయ్యకు చూపిస్తుంది. అసలు విషయం తెలిసి తాతయ్య నిలదీస్తే అన్నయ్యకు అన్యాయం చేసిన తాతయ్యకు బుద్ధిచెప్పాలని ఇలా చేసానని ధైర్యంగా చెబుతుంది. దైవికంగా ఆ బాబు జగన్నాధం కొడుకే కావటం, ఆడపిల్లలకు కూడా ఆస్తిలో సమభాగం ఇచ్చేందుకు చక్రపాణి వొప్పుకోవటం, అందరూ మాలతి ఇంట్లో కలవటం జరుగుతుంది.

తాతయ్యకు ఢీ అంటే ఢీ అంటూవుంటుంది మాలతి. ఎక్కడా రాజీపడదు. తాతయ్య దగ్గర డబ్బులు వసూలు చేయటంలో గడుసుగా, ఇష్టం లేని పెళ్ళిని తప్పించుకోవటంలో ధైర్యంగా ఉన్న మాలతి, తోడులేక నీడలేని తీగలా వాడిపోతానేమోనని బేలైపోతుంది. అంతలోనే నచ్చిన వాడిని పెళ్ళాడి, మొదటిరాత్రే షరతులు విధించి తన స్వాతంత్ర్యాన్ని చూపించుకుంటుంది. ఇంటిని నడిపేందుకు చొరవతీసుకుంటుంది.అన్నయ్యకు అన్యాయం చేసిన తాతయ్యకు బుద్ధి చెప్పేందుకు ప్రయత్నం చేస్తుంది. ఇలా అన్ని రకాలుగా  ధీరగా, గడుసుగా, బేలగా మాలతి కనిపిస్తుంది భరణివారి పిక్చర్స్ వారి "చక్రపాణి"లో! ఈ పాత్ర భానుమతి మాత్రమే చేయగలదు అన్నట్లుగా పాత్రలో ఇమిడిపోయింది భానుమతి. మాలతి భర్త చలంగా నాగేశ్వరరావు నటించారు.ఇందులో బద్ధకస్తుడిగా ఆయన వేసే పాత్రలకు భిన్నంగా వేసారు. హాయిగా నవ్వించారు. ఆ దుబ్బు జుట్టు, లూజు పైజామాలు చాలా గమ్మత్తుగా వున్నాయి.

1954లో రామకృష్ణ డైరక్షన్లో నిర్మించిన ఈ సినిమా "చక్రపాణి"ఆధ్యంతమూ నవ్వుల జల్లు కురిపిస్తుంది.  ఆ నవ్వుల జల్లులోనే స్త్రీ స్వాతంత్ర్యం గురించి, ఆడపిల్లకు ఆస్తిలో సమానభాగం రావాలని సందేశాన్ని వినిపినిపించారు. ఈ సినిమా వచ్చిన దాదాపు ముప్పయి సంవత్సరాల తరువాత యన్.టి.ఆర్. ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ఆడపిల్లకు ఆస్తిలో సగభాగము రావాలని చట్టం చేశారు.

-శ్రీమతి మాలాకుమార

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.