ఒకేరోజు ఒకే టైటిల్ తో రెండు సినిమాలు!
on Dec 6, 2022
ఒకేరోజు ఒకే టైటిల్ తో రెండు సినిమాలు విడుదల కావడం ఎప్పుడైనా చూశారా. ఈ శుక్రవారం(డిసెంబర్ 9న) ఆ వింత చూడబోతున్నాం. త్రిగుణ్, మేఘా ఆకాష్ జంటగా శ్రీకాంత్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'ప్రేమదేశం'. మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్రంలో మధుబాల కీలక పాత్రలో నటించడం విశేషం. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ డిసెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే తమ క్లాసిక్ ఫిల్మ్ టైటిల్ ని వాడుకున్నారని చేస్తున్నారో లేక ఈమధ్య రీరిలీజ్ ల ట్రెండ్ నడుస్తోందని చేస్తున్నారో తెలీదు గానీ 26 ఏళ్ళ క్రితం నాటి 'ప్రేమ దేశం' చిత్రాన్ని కూడా అదే రోజు రీరిలీజ్ చేస్తుండటం ఆసక్తికరంగా మారింది.
టబు, వినీత్, అబ్బాస్ నటించిన 'ప్రేమ దేశం' అప్పట్లో ఓ సంచలనం. కదిర్ దర్శకత్వం వచ్చిన ఆ చిత్రంలోని కథ కథనాలు, పాటలు ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకున్నాయి. స్నేహం, ప్రేమ సన్నివేశాలు యువతని కట్టిపడేశాయి. రెహమాన్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటల గురించి ఎంత చెప్పినా తక్కువే. 'ముస్తఫా ముస్తఫా', 'హలో డాక్టర్', 'నను నేనే మరచిన నీతోడు' ఇలా అన్ని సాంగ్స్ పెద్ద హిట్ అయ్యాయి. ఈ మ్యూజికల్ బ్లాక్ బస్టర్ ప్రేమదేశం మళ్లీ థియేటర్స్ లో సందడి చేయబోతోంది. డిసెంబర్ 9న రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా విడుదల కాబోతోంది. శ్రీ మాతా క్రియేషన్స్ బ్యానర్ పై రఘురాం రెడ్డి, రవికాంత్ రెడ్డి, నాగరాజు ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ప్రేమదేశం సినిమా స్పెషల్ షో హైదరాబాద్ లో వేశారు. నటి దివి, నటి శ్రేయ ప్రియ, అర్జున్ కళ్యాణ్ ఈ స్పెషల్ షో కు హాజరయ్యారు. అలాగే 'ప్రేమ దేశం'తో పాటు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను అందించిన నిర్మాత కెటి.కుంజుమొన్ కూడా హాజరయ్యి ప్రేమదేశం సినిమా విశేషాలను మీడియాతో పంచుకోవడం విశేషం.
మరి ఒకే రోజు విడుదలవుతున్న పాత, కొత్త 'ప్రేమదేశం' సినిమాలలో ఏ సినిమా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తుందో చూడాలి.
Also Read