ENGLISH | TELUGU  

'ఓ కల' మూవీ రివ్యూ

on Apr 16, 2023

సినిమా పేరు: ఓ కల
తారాగణం: గౌరీశ్ యేలేటి, రోషిణి, ప్రాచీ ఠక్కర్, కేశవ్ దీపక్ బళ్ళారి, అలీ, 'వైవా' రాఘవ్, దేవీ ప్రసాద్, శక్తి, యూట్యూబర్ రవితేజ తదితరులు
సినిమాటోగ్రఫీ: అఖిల్ వల్లూరి
ఎడిటింగ్: సత్య గిడుతూరి
సంగీతం: నీలేష్ మందలపు
నిర్మాతలు: లక్ష్మీ నవ్య మోటూరు, రంజిత్ కుమార్ కొడాలి
దర్శకత్వం: దీపక్ కొలిపాక
ఓటీటీ: డిస్నీ ప్లస్ హాట్ స్టార్

సినిమాలో కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఎక్కడున్నా వీక్షిస్తారు. ఓటీటీలో వచ్చే చిన్న సినిమాలు సైతం కంటెంట్ బాగుంటే మంచి వీక్షకాదరణ పొందుతున్నాయి. అలాంటి ఓటీటీలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వచ్చిందే ఈ 'ఓ కల'. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లోని ఈ సినిమా కథేంటో‌ ఒకసారి చూసేద్దాం.

కథ: 
చదువు పూర్తి చేసాక, జాబ్ చేయకుండా.. తన కాళ్ళ మీద నిలబడి, సొంతంగా ఒక కంపెనీ పెట్టాలనే హారిక(రోషిణి) ఆలోచనకి ఆమె తండ్రి(దేవీ ప్రసాద్) సహకరిస్తాడు. తన ఫ్రెండ్ చరణ్ తో కలిసి ఒక కొత్త కంపెనీని మొదలుపెడుతుంది హారిక. అయితే  ఒకరోజు చరణ్ తో హారిక మాట్లాడినప్పుడు.. తనకి అసలు నిజం తెలుస్తుంది. తనని అతను మోసం చేసాడని అర్థమవుతుంది. దాంతో అతడిని చెంపమీద కొట్టి మళ్ళీ కనిపించొద్దని చెప్పి పంపించేస్తుంది హారిక. ఇక సొంత కంపెనీలోని ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేక కంపెనీని వేరేవాళ్ళకు అమ్మేసి, డిప్రెషన్ లోకి వెళ్ళిపోతుంది హారిక. అయితే డిప్రెషన్ లో తను చనిపోవాలనుకుంటుంది. చనిపోయే ముందు మోటివేషనల్ స్పీకర్ ది ఒక పేపర్ పాంప్లెట్ చూసి అందులోని నెంబర్ కి కాల్ చేసి తన బాధలని చెప్పుకోగా.. అతను తాగితే మర్చిపోవచ్చని చెప్తాడు. దాంతో బార్ కి తాగడానికి వెళ్తుంది. అక్కడ హారికకి హర్ష(గౌరీష్ యేలేటి) పరిచయమవుతాడు. దాని తర్వాత హారిక జీవితం ఎలా మారింది? సూసైడ్ ఆలోచన విరమించుకుందా? హర్ష పరిచయం ఎలా సాగిందనేది మిగతా కథ.

విశ్లేషణ: 
ప్రపంచంలో డిప్రెషన్ తో‌ సూసైడ్ చేసుకునే వారి సంఖ్య రోజు రోజుకి గణనీయంగా పెరుగుతుంది. ఈ సీరియస్ ఇష్యూని తీసుకొని దానికి ఒక చక్కని పరిష్కారం చూపించాడు డైరెక్టర్. ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగి పొందే వర్క్ టెన్షన్, డిప్రెషన్ ఎలా ఉంటుందో తెలిసిందే. వారి చేతుల్లో లేని జీవితం గురించి ఆలోచిస్తూ, కొందరు వారికొచ్చిన సమస్యలను ఎదుర్కొనలేక చావే పరిష్కారమనుకుంటారు. అలాంటి వారికి కొందరు మోటివేషనల్ స్పీకర్స్ ఇచ్చే సలహాలు కాస్త డిప్రెషన్ ని తగ్గిస్తాయి. అలా డిప్రెషన్ లో ఉన్న హారికతో.. ప్రతీ సమస్యకి చావే పరిష్కారం కాదని చెప్తూ.. హర్ష(గౌరీష్ యేలేటి) పరిచయమవుతాడు. అతని మాటలు హారికకి.. జీవితం మీద ఒక కొత్త హోప్ ని క్రియేట్ చేస్తుంది. ఈ సినిమాలోని క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ కోసం కూడా ఎక్కువ టైం తీసుకోలేదు డైరెక్టర్. తనేం చెప్పాలనుకున్నాడో అది సూటిగా చాలా సున్నితంగా తీర్చిదిద్దాడు డైరెక్టర్.

ఇవాళ రాత్రి మనం కళ్ళు మూసుకొని, మళ్ళీ పొద్దున్నే కళ్ళు తెరిస్తేనే కదా మనం బ్రతికున్నట్టు..లేకపోతే చచ్చిపోయినట్టే కదా. మనం కంట్రోల్ చేయలేని లైఫ్ ని మన కంట్రోల్ లోకి తీసుకోవద్దు అనే ఒక్క లైన్ తో‌ సినిమాని మొదలు పెట్టి మళ్ళీ అదే పాయింట్ లో ముగించిన తీరు బాగుంటుంది. కథలో సస్పెన్స్ ఏమీ లేదు.. కామెడీ ట్రాక్ కి పెద్దగా స్కోప్ లేకుండా పోయింది. కథ సింపుల్ గా ఉంటుంది. ఏ సమస్యకైనా ఆత్మహత్య ఒక్కటే పరిష్కారం కాదని వివరిస్తూ.. ఆ వివరించే విధానంలో కూడా పేజీల పేజీల ఉపన్యాసాలు లాంటివి కాకుండా సింపుల్ గా ఫినిష్ చేసాడు డైరెక్టర్ దీపక్. అసలు అంచనాలేమీ లేకుండా అలా సినిమా స్టార్ట్ చేసి చివరిదాకా ఏకాంతంగా చూస్తే ఒక నిదురలోని కలలా ఈ సినిమా నిలుస్తుంది.

డిప్రెషన్ గురించి డైరెక్టర్ దీపక్ చెప్పాలనుకున్నదంతా చక్కగా తీర్చిదిద్దాడు. రొమాన్స్ కంటే డ్రామాకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. అయితే కథనం నెమ్మదిగా సాగుతుంది. డైలాగ్స్ సినిమాకి ఆయువుపట్టుగా నిలిచాయనే చెప్పాలి. ఏ సంభాషణలు అతిగా అనిపించవు. మధ్యలో అలీ ట్రాక్ కాస్త నిరాశని కలిగిస్తుంది. కామెడీ ట్రాక్ కుదర్లేదు. సత్య గిడుతూరి ఎడిటింగ్ బాగుంది. అఖిల్ వల్లూరి సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. నీలేష్ అందించిన సంగీతం పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

నటీనటుల పనితీరు: 
రోషిణికి ఇదే తొలిసినిమా అయినా కూడా ఎక్కడా కూడా తడబడినట్టుగా అనిపించలేదు. హారికగా రోషిణి చక్కగా చేసింది. గౌరీష్ యేలేటికి తొలి సినిమా అయినప్పటికి తన స్క్రీన్ ప్రెజెన్స్ తో ఆకట్టున్నాడు. హర్షగా సినిమాకి అదనపు బలంగా మారాడు. వైవా రాఘవ హర్షకి స్నేహితుడి పాత్రలో ఆకట్టుకున్నాడు. మిగిలిన వారు ఉన్నంతలో బాగా చేసారు.

తెలుగు వన్ పర్ స్పెక్టివ్: 
ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన 'ఓ కల' సినిమా.. డిప్రెషన్ లో ఉన్నవారికి ఒక చక్కని చేయూతగా నిలుస్తుంది. ‌కామన్ అడియన్స్ ఒకసారి చూడొచ్చు.

రేటింగ్: 2.5 /5

- దాసరి మల్లేశ్

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.