చరణ్, ఎన్టీఆర్‌లను అల్లాడిస్తున్న రాజమౌళి!
on Mar 27, 2018
రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్‌లు కథానాయకులుగా ఓ సినిమా వస్తోందని తెలియగానే ఇండ్రస్ట్రీ మొత్తం షాక్ తిన్నది. నందమూరి, కొణిదెల హీరోల్ని కలిపి సినిమా తీయగల దమ్ము కేవలం రాజమౌళికే ఉందని కితాబులు ఇచ్చింది. ఈ సినిమాపై చిత్రసీమ యావత్తూ ఆసక్తిగా ఎదురు చూస్తోంది. అయితే మరోవైపు ముగ్గురు స్టార్లు కలసి చేస్తున్న ఈసినిమాలో డామినేషన్ పార్ట్ ఎవరిది? అనే ఆసక్తికరమైన చర్చ మొదలైంది. బాహుబలి లాంటి చారిత్రక విజయాన్ని అందుకున్న రాజమౌళిని ఎవ్వరూ తక్కువ అంచనా వేయరు. తన సినిమాలో ఎంత పెద్ద హీరో ఉన్నా... అది 'రాజమౌళి సినిమా'గానే ప్రచారం అందుకుంటుంది. ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లు వచ్చినంత మాత్రాన అందుకు మినహాయింపు ఉండదు. కాకపోతే ఇద్దరు స్టార్ హీరోల్ని డీల్ చేయాలి కాబట్టి రాజమౌళి కాస్త తగ్గుతాడనుకుంటారంతా. కానీ అదే జరగడం లేదు. సినిమా మొదలవ్వకముందే రాంచరణ్, ఎన్టీఆర్‌లను ఓ ఆట ఆడించేస్తున్నాడు. ఇప్పటి నుంచే తన ఆధిపత్యం చూపించేస్తున్నాడు.
ఈ ప్రాజెక్టుకు ఆర్.ఆర్.ఆర్ అంటూ నామకరణం చేశాడు రాజమౌళి. ఇందులో తొలి ఆర్... రాజమౌళిదే. అంటే ఇప్పటి నుంచే 'ఇది నా సినిమా' అనే ముద్ర వేయడానికి రాజమౌళి ప్రయత్నాలు మొదలెట్టేశాడన్నమాట. అంతేకాదు.... ఇప్పటి వరకూ ఎన్టీఆర్, చరణ్‌లకు రాజమౌళి కథ చెప్పలేదట. కథ పూర్తిగా సిద్ధమైన తరవాతే... చెబుతా అన్నాడట రాజమౌళి. కథ వినకుండా ఓ సినిమా ఒప్పుకోవడం, అందునా మరో హీరోతో కలసి నటించేటప్పుడు పాత్ర గురించి తెలుసుకోకుండా దిగిపోవడమంటే చరణ్, ఎన్టీఆర్లకు ఇది విషమ పరీక్షే. ఇది రాజమౌళి సినిమా కాబట్టి సరిపోయింది... వేరే ఏ దర్శకుడైనా 'కథ తరవాత చెబుతా.. ముందు ఈసినిమా చేయడానికి ఒప్పుకో' అంటాడా? రాజమౌళి కాబట్టే అతని పప్పులు ఉడికాయి. కథ లేకుండానే ఓ మల్టీస్టారర్ కి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేయడం బహుశా ఇదే తొలిసారేమో. కొబ్బరికాయ కొట్టక ముందే ఇద్దరు స్టార్ హీరోల్ని తన చెప్పుచేతల్లో ఉంచుకున్నాడంటే.. సినిమా మొదలయ్యేటప్పటికి రాజమౌళి ఆధిపత్యం ఏ రేంజులో ఉంటుందో??