అమెరికాలో తొలిసారిగా ఎన్టీఆర్ విగ్రహం
on Dec 19, 2022

మహానటుడు, మహానాయకుడు నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా అమెరికాలో తొలిసారిగా ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి నార్త్ అమెరికా సీమ ఆంధ్రా అసోసియేషన్ సన్నాహాలు చేస్తోంది. 2023 మే 28తో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు ముగియనున్నాయి. ఈ సందర్భంగా న్యూజెర్సీలోని ఎడిసన్ సిటీలో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. విగ్రహ ప్రతిష్ఠాపన కోసం ఎడిసన్ సిటీ మేయర్ సమ్మతి తెలియజేసినట్లు అసోసియేషన్ ఒక ప్రకటనలో వెల్లడించింది.
ఎక్కువగా తెలుగువారు ఎడిసన్ సిటీ నుంచే యు.ఎస్. ప్రయాణాన్ని మొదలుపెట్టారని అంటారు. న్యూయార్క్ నగరంలో చాలామంది తెలుగువారు పనిచేస్తున్నారు. ఎన్టీఆర్ అంటే అక్కడి తెలుగువారికి విపరీతమైన ఆదరాభిమానాలు ఉన్నాయి. టాలీవుడ్ ప్రొడ్యూసర్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టి.జి. విశ్వప్రసాద్ న్యూజెర్సీలోని ఎడిసన్ సిటీలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన చేశారు. దీనికి అమెరికాలోని తెలుగువారంతా మద్దతు తెలిపారు. ఎడిసర్ సిటీ మేయర్ సామ్ జోషి ఈ ప్రతిపాదనను సమీక్షించి, దానికి అంగీకారం తెలిపారు. సామ్ జోషి ఎడిసన్ సిటీకి మేయర్ అయిన తొలి భారతీయుడు.
యు.ఎస్.లోని ఒక బహిరంగ ప్రదేశంలో ఎన్టీఆర్ తొలి విగ్రహం ఇదే కానున్నది. ఇది తెలుగువారందరికీ గర్వకారణం. ఈ విగ్రహ ప్రతిష్టాపనకు నార్త్ అమెరికన్ సీమ ఆంధ్రా అసోసియేషన్ నిధులు సమకూరుస్తోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



