మీకు తెలుసా? 'వాల్మీకి'లో ఒక్క డ్యూయెట్టూ లేదు, ఒక్క భారీ ఫైటూ లేదు!
on Aug 28, 2019
'వాల్మీకి' మూవీలో వరుణ్ తేజ్ రూపం చూసీ, టీజర్లో అతడు ఆవేశంగా కొడుతున్న తీరు, వయొలెంట్‌గా అతడి కేరెక్టర్ కనిపించిన విధానం చూసి చాలామంది ఇది యాక్షన్ సినిమా అని భావిస్తున్నారు. అయితే వాళ్లంతా తప్పులో కాలేస్తున్నారన్న మాటే. ఎందుకంటే 'వాల్మీకి'లో ఫైట్లు ఉంటాయి కానీ, అది యాక్షన్ మూవీ కాదు. నిజం చెప్పాలంటే 'వాల్మీకి'లో మనుషుల్ని బెదిరించడాలు, వార్నింగ్ ఇవ్వడాలు, మర్డర్ సీన్లు కూడా ఉంటాయి. కానీ.. ఒక్కటంటే ఒక్కటి ఫుల్ లెంగ్త్ ఫైట్ అనేది లేదు. ఒక్క భారీ ఫైట్ కూడా ఉండదు.
ఇక ఈ సినిమాకి సంబంధించిన ఇంకో నిజం ఏమంటే.. నాలుగు పాటలున్నా, వాటిలో ఒక్కటి కూడా డ్యూయెట్ లేకపోవడం. అవును. ఈ మూవీలో గద్దలకొండ గణేశ్ అనే పెద్ద రౌడీ కేరెక్టర్లో వరుణ్ కనిపించనున్నాడు. అందుకని అతడిపై డ్యూయెట్ పెట్టలేదు. ఇక హీరోగా తమిళ నటుడు అధర్వ, హీరోయిన్గా మాళవికా రవి నటించినా.. వాళ్లకీ డ్యూయెట్ లేదు. వరుణ్‌కు జోడీగా పూజా హెగ్డే కనిపిస్తుంది. మొత్తానికి తమిళ హిట్ ఫిల్మ్ 'జిగర్తాండ'కు రీమేక్ అయిన 'వాల్మీకి'ని యాక్షన్ మూవీగా కాకుండా కంప్లీట్ ఎంటర్టైనర్గా డైరెక్టర్ హరీశ్ శంకర్ ప్రెజెంట్ చేస్తున్నాడు.
'వాల్మీకి' అనేది ఒక సినిమా బ్యాక్‌డ్రాప్‌లో నడిచే కథ. సినిమా అనేది ఎంత గొప్పదో ఈ మూవీలో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సినిమాలో ఒక మెసేజ్ కూడా ఉంది. "మనిషి సుఖంగా ఉండటం కంటే సంతోషంగా ఉండటం ముఖ్యం" అనేదే ఈ మెసేజ్. సెప్టెంబర్ 20న 'వాల్మీకి' రిలీజవుతోంది.