- చిన్న సినిమాను బ్రతికించుకునేందుకు కొత్త స్ట్రాటజీ
- టికెట్ రేట్లు తగ్గించడం వల్ల ఎవరికి లాభం?
- తగ్గించిన టికెట్ రేట్లపై నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ఏమంటున్నారు?
గత కొన్ని సంవత్సరాలుగా ప్రేక్షకులు థియేటర్లకు రావాలంటే ఎంతో ఆలోచిస్తున్నారు. హాయిగా ఇంట్లోనే కూర్చొని ఓటీటీలో సినిమాలు చూసేందుకు ఇష్టపడుతున్నారు. ఇది నిర్మాతలకు, ఎగ్జిబిటర్లకు పెద్ద తలనొప్పిగా మారింది. ఎంత మంచి సినిమా తీసినా థియేటర్లకు ప్రేక్షకుల్ని రప్పించడం వారి వల్ల కావడం లేదు. అయినా అప్ప్పుడప్ప్పుడు కొన్ని చిన్న సినిమాలు మెరుపులు మెరిపిస్తున్నాయి. థియేటర్లను ప్రేక్షకులతో నింపేస్తున్నాయి. ఒక విధంగా మిగతా మేకర్స్‌కి ఈ చిన్న సినిమాలు ఇన్‌స్పిరేషన్ అనే చెప్పాలి.
అయితే ప్రతి వారం ఎన్నో చిన్న సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. కానీ, వాటిలో కొన్ని రిలీజ్ అయిన విషయం కూడా చాలా మందికి తెలీదు. ఇక ఒకటి, రెండు సినిమాలు కాస్తో, కూస్తో ప్రభావం చూపిస్తున్నాయి. ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించడం కష్టతరంగా మారిన ప్రస్తుత తరుణంలో ఇటీవల విడుదలైన ‘నిలవే’ టీమ్ ఒక కొత్త స్ట్రాటజీని ఫాలో అవుతోంది.
హైదరాబాద్‌లోని ఒక సింగిల్ స్క్రీన్‌లో సాయంత్రం, నైట్ షోలకు కేవలం 11 రూపాయలుగా టికెట్ ధర నిర్ణయించింది. ఇది అందర్నీ షాక్‌కి గురి చేస్తోంది. మామూలుగా సోషల్ మీడియాలో ఉచితంగా టికెట్స్ డిస్ట్రిబ్యూట్ చేసే ట్రెండ్ చాలా కాలంగా నడుస్తోంది. అయితే అవి బుక్ మై షోలో అందుబాటులో ఉండవు. ఇన్ ఫ్లూయెన్సర్లు పెట్టే కండీషన్లు ఫాలో అయిపోయి వాళ్లకు సంతృప్తి అనిపించే లక్కీ విన్నర్స్ కు మాత్రమే వాటిని అందజేస్తారు.
అయితే ఇప్ప్పుడు 11 రూపాయలకే టికెట్ అనే స్కీమ్‌లో అలాంటి ఇబ్బంది లేదు. బుక్ మై షోలో టికెట్ బుక్ చేసుకొని థియేటర్‌కి వెళ్లిపోవచ్చు. ఎన్ని టికెట్స్ కావాలన్నా ఇస్తారు. అయితే ఇక్కడ మరో సమస్య కూడా ఉంది. గత ఏడాది రాజు వెడ్స్ రాంబాయి చిత్రానికి 99 రూపాయలకు టికెట్ పెట్టారు. దాన్ని కొందరు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు వ్యతిరేకించారు. ఇప్ప్పుడు మరీ 11 రూపాయలకే సినిమా చూపిస్తున్నారు. దీనిపై వారు ఎలా స్పందిస్తారో చూడాలి.
టికెట్ ధరలు తగ్గించి సినిమా చూపించే విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చిన్న సినిమాలను ప్రేక్షకుల దగ్గరకు తీసుకెళ్లేందుకు అంత తక్కువ ధర కాకపోయినా 50 నుంచి 100 రూపాయల రేటుకు టికెట్స్ అందిస్తే మంచి రిజల్ట్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. దీనిపై చిత్ర పరిశ్రమ దృష్టి సారిస్తే చిన్న సినిమాలు బ్రతికే ఛాన్స్ ఉంది. మరో పక్క స్టార్ హీరోల సినిమాలకు సాధారణ రేట్ల కంటే ఎక్కువ రేటుకి టికెట్స్ అమ్ముతున్నారు. దానికి ప్రభుత్వాలు కూడా ఆమోద ముద్ర వేస్తున్నాయి. అదే విధంగా చిన్న సినిమాలను తక్కువ ధరలో చూపిస్తే ఆక్యుపెన్సీ పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.








