నన్ను వాడుకున్నాడు, మరో హీరోయిన్‌ని పెళ్లి చేసుకున్నాడు : అజిత్‌పై హీరా ఆరోపణ!
on Apr 29, 2025
తమిళ హీరోల్లో అజిత్‌కి ఒక డిఫరెంట్ ఇమేజ్ ఉంది. అతనికి సినిమాలు, కుటుంబం, కార్ రేసింగ్ తప్ప మరో వ్యాపకం లేదు. టైమ్ టు టైమ్ షూటింగ్ పూర్తి చేసుకొని ఇంటికి వెళ్లిపోతాడు. ఎవరినీ కలవడు. తన సినిమా ప్రమోషన్స్‌కి కూడా దూరంగా ఉంటాడు. అందరు హీరోలకు భిన్నంగా ఉండే అతనికి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. అతని కెరీర్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు ఎలాంటి వివాదాల్లో చిక్కుకోలేదు. ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేయలేదు. సినిమా రంగానికే కాదు, స్పోర్ట్స్ విభాగంలో కూడా భారత్‌కు మంచి పేరు తెస్తున్న అజిత్‌ను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం అతనికి పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది. ఏప్రిల్ 28న ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు అజిత్.
ఇదిలా ఉంటే.. ఒకప్పటి హీరోయిన్ హీరా రాజగోపాల్.. అజిత్‌పై చేస్తున్న ఆరోపణలు అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. హృదయం, ప్రేమలేఖ, సతీ లీలావతి వంటి అనువాద చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు హీరా సుపరిచితం. అయితే ఆమె కొన్ని తెలుగు సినిమాల్లోనూ నటించింది. 2000 సంవత్సరం తర్వాత సినిమాలకు గుడ్‌బై చెప్పిన హీరా దాదాపు పాతిక సంవత్సరాల తర్వాత అజిత్‌పై ఆరోపణలు చేస్తూ సడన్‌గా వార్తల్లోకి వచ్చింది. అది కూడా అజిత్ పద్మభూషణ్ అవార్డు అందుకున్న రోజే అతనిపై విరుచుకుపడడం అతని అభిమానులను షాక్‌కి గురి చేసింది. ఇంతకీ విషయం ఏమిటంటే.. ప్రేమలేఖ చిత్రంలో హీరోయిన్ దేవయాని కాగా, మరో హీరోయిన్‌గా హీరా నటించింది. ఆ సమయంలో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించడంతో ఐదేళ్ళపాటు ఇద్దరూ సహజీవనం చేశారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలీదుగానీ, 2000 సంవత్సరంలో హీరోయిన్ షాలినిని వివాహం చేసుకున్నాడు అజిత్. ఆ తర్వాత రెండేళ్ళకు హీరా కూడా పుష్కర్ మాధవ్ అనే వ్యాపార వేత్తను పెళ్లి చేసుకుంది. అయితే వారి వైవాహిక బంధం ఎక్కువ కాలం నిలబడలేదు. 2006లో అతని నుంచి విడాకులు తీసుకుంది హీరా. అజిత్, షాలిని మాత్రం అన్యోన్యమైన జంటగా పేరు తెచ్చుకుంది. ఆరోజు నుంచి ఈరోజు వరకు అజిత్‌తో తనకు ఉన్న సంబంధం గురించి ఏనాడూ ప్రస్తావించని హీరా తాజాగా అన్ని విషయాలను తన బ్లాగ్‌లో రాసుకొచ్చింది.
‘నేను 1984లోనే ఇండస్ట్రీకి వచ్చాను. అపరాధి అనే తెలుగు సినిమాతో నటిగా పరిచయమయ్యాను. తెలుగు, తమిళ భాషల్లో కొన్ని సినిమాలు చేసిన తర్వాత 1996లో కాదల్ కొట్టయ్ చిత్రంలో అజిత్‌తో కలిసి నటించాను. ఆ సమయంలోనే అతనితో లాంగ్ టర్మ్ రిలేషన్‌లో ఉన్నాను. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఆ తర్వాత కొన్నాళ్ళకు అతను నన్ను అవాయిడ్ చేయడం మొదలుపెట్టాడు. నేను డ్రగ్స్‌కి బానిసననీ, మోసగత్తెనని ప్రచారం చేయడం ద్వారా నా క్యారెక్టర్‌ని దిగజార్చే ప్రయత్నం చేశాడు. నేను అతన్ని పూర్తిగా నమ్మాను. అతనికి అండగా ఉన్నాను. కానీ, ఒక్క రాత్రిలో నన్ను అందరికీ విలన్‌గా చూపించాడు. అతనికి వెన్నెముక సర్జరీ జరిగినప్పుడు రాత్రి, పగలు అనే తేడా లేకుండా అతనికి సేవలు చేశాను. అయినా నన్ను పట్టించుకోవడం మానేశాడు. నాతో కలవకుండా, నేను ఫోన్ చేయడానికి కూడా వీలు లేకుండా చేశాడు. అంతేకాదు, అతని ఫ్యాన్స్‌తో నాపై దాడులు చేయించి నా పరువు తీశాడు. అతని వల్లే నేను సినిమాలకు దూరం కావాల్సి వచ్చింది. మా ఇద్దరి మధ్య జరుగుతున్న గొడవలు తారాస్థాయికి చేరడంతో ఓ మధ్యవర్తి ద్వారా మీటింగ్ ఏర్పాటు చేశాడు. ఆ సమయంలో నన్ను వదిలేస్తున్నట్టు చెప్పాడు’ అంటూ తన బ్లాగ్‌లో రాసుకొచ్చింది హీరా రాజగోపాల్.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
