
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సన ల ‘పెద్ది' (peddi)బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డుల వేట కొనసాగిస్తోంది. జూన్ 4న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం కేవలం 14 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 400 కోట్ల క్లబ్‌లో చేరి టాలీవుడ్‌లో సరికొత్త చరిత్ర సృష్టించిందని చెప్పవచ్చు . దాదాపు 250 కోట్ల నుండి 350 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ క్రీడా నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అయితే, గత కొన్ని రోజులుగా ఈ సినిమా వసూళ్లు తగ్గాయంటూ సోషల్ మీడియా వేదికగా కొన్ని నెగిటివ్ రూమర్స్, దుష్ప్రచారం ప్రచారంలోకి వచ్చాయి.
ఈ బాక్సాఫీస్ నెగిటివ్ రూమర్లపై టాలీవుడ్ ప్రముఖ సీనియర్ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ నట్టి కుమార్ తీవ్రంగా స్పందించారు. ‘పెద్ది’ చిత్రం కలెక్షన్లపై వస్తున్న వార్తలన్నీ ముమ్మాటికీ అబద్ధాలు. పరిశ్రమలో కొంతమంది కావాలనే పెద్దిపై విషప్రచారం చేస్తున్నారు. కొంతకాలంగా టాలీవుడ్‌లో సరైన పెద్ద సినిమాలు లేక, థియేటర్ల రన్నింగ్ సరిగా సాగక ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు పడి, థియేటర్లన్నీ వెలవెలబోయిన తరుణంలో ‘పెద్ది’ ఊపిరి పోసింది. ఈ చిత్రం సాధిస్తున్న అసాధారణ విజయాలు ఎగ్జిబిటర్లలో సరికొత్త జోష్ నింపాయి
రామ్ చరణ్ తన రెజ్లర్ రోల్ కోసం ఎంతో కష్టపడటమే కాదు, క్యారక్టర్ కి పూర్తి స్థాయిలో జీవం పోశారని ఆయన కొనియాడారు. ఇదే ఇంటర్వ్యూలో రామ్ చరణ్ మునుపటి చిత్రం ‘గేమ్ ఛేంజర్’ పరాజయంపై కూడా నట్టి కుమార్ నిజాయతీగా మాట్లాడారు. ఆ సినిమా ఫ్లాప్ అవ్వడానికి తప్పుడు రిలీజ్ డేట్, పబ్లిసిటీ లోపమే కారణం. గేమ్ ఛేంజర్’ కోసం కూడా రామ్ చరణ్ తన ప్రాణం పెట్టాడు. కానీ మేకర్స్ సరైన పబ్లిసిటీ చేయకుండా అన్యాయం చేసారు. అలాంటి తప్పులు ‘పెద్ది’ విషయంలో జరగలేదని, అందుకే జనాలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు.
దర్శకుడు బుచ్చిబాబు సన మేకింగ్ స్టైల్, ఏఆర్ రెహమాన్ అద్భుతమైన సంగీతం ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. జాన్వీ కపూర్ గ్లామర్, శివ రాజ్‌కుమార్, జగపతి బాబు కూడా తమ పెర్ఫార్మ్ తో ప్రధాన ఆకర్షణగా నిలిచారు. 400 కోట్ల మార్కుని దాటి దూసుకుపోతున్న పెద్ది కలెక్షన్లని తక్కువ చేసి చూపించడానికి చిత్ర పరిశ్రమలోని కొందరు ఇండస్ట్రీ పెద్దలు ఇండైరెక్ట్‌గా కుట్రలు చేస్తున్నారని నట్టి కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బాక్సాఫీస్ వద్ద నిజమైన వసూళ్లు అద్భుతంగా ఉన్నాయని, థియేటర్ల యాజమాన్యాలు ఈ సినిమా తెచ్చిన లాభాలతో సంతోషంగా ఉన్నాయని చెబుతూ, మెగా అభిమానులు ఇలాంటి ఫేక్ రూమర్లని నమ్మవద్దని ఆయన పిలుపునిచ్చారు.





