
స్టార్ హీరోయిన్ సమంత (Samantha) లేటెస్ట్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘మా ఇంటి బంగారం’ (Maa Inti Bangaaram) బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో ఘన విజయం సాధించింది. రిలీజైన మొదటి వారంలోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 50 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించింది. ఈ గ్రాండ్ సక్సెస్‌తో చిత్ర యూనిట్ ఎంతో సంతోషంలో మునిగిపోయింది. తాజాగా వైజాగ్ లో నిర్వహించిన ఈ సినిమా సక్సెస్ మీట్‌లో మూవీ టీమ్ అంతా సందడి చేసింది. ఈ వేడుకలో సమంత భర్త, ప్రముఖ దర్శకుడు, నిర్మాత రాజ్ నిడిమోరు ‘మా ఇంటి బంగారం’ సీక్వెల్‌పై అఫీషియల్ క్లారిటీ ఇచ్చి అభిమానులకు పెద్ద సర్ప్రైజ్ ఇచ్చారు.
వైజాగ్ సక్సెస్ మీట్ వేదికగా రాజ్ నిడిమోరు మాట్లాడుతూ ‘మా ఇంటి బంగారం’ సినిమాకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిందని, అందుకే ఈ కథకు సీక్వెల్ చేయాలని నిర్ణయించుకున్నామని ప్రకటించారు. తాను, డీకే తెలుగులో ఎప్పటి నుంచో సినిమా చేయాలని హైదరాబాద్ వచ్చామని, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయని గుర్తు చేసుకున్నారు. ఫైనల్‌గా తెలుగులో సినిమా చేసే ఛాన్స్ వచ్చిందని, మొదటి సినిమాకే తెలుగు ప్రేక్షకులు ఇంతటి భారీ విజయాన్ని అందిస్తారని అసలు ఊహించలేదని ఆనందం వ్యక్తం చేశారు. ‘మా ఇంటి బంగారం 2’కి సంబంధించిన మెయిన్ ఐడియా ఇప్పటికే లాక్ అయిందని, రాబోయే రెండేళ్లలో ఈ క్రేజీ సీక్వెల్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని స్పష్టం చేశారు. అంతేకాకుండా ఈ సెకండ్ పార్ట్‌ను కూడా సేమ్ టీమ్‌తోనే ప్లాన్ చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
ఇదే వేదికపై సమంత మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయ్యారు. ప్రేక్షకులు ఈ సక్సెస్‌తో తనకు జీవితంలో మర్చిపోలేని ఒక పెద్ద గిఫ్ట్ ఇచ్చారని అన్నారు. సినిమా రిలీజ్‌కు ముందు థియేటర్లలో కనీసం ఒక్క టికెట్ అయినా తెగుతుందా అనే తీవ్రమైన భయం తనను వెంటాడిందని ఓపెన్ అయ్యారు. ఎందుకంటే వెండితెరపై తన సినిమా వచ్చి దాదాపు మూడేళ్లు కావడంతో, ప్రేక్షకులు తనను గుర్తు పెట్టుకుంటారా లేదా అనే సందేహం కలిగిందని చెప్పారు. అసలు ఈ ప్రాజెక్ట్ చేయడం తన వల్ల కాదని రాజ్ నిడిమోరుతో అన్నానని, కానీ ఆయన ‘నువ్వు ఒక్క సినిమా చెయ్’ అంటూ తనను ఎంతగానో కన్విన్స్ చేసి, వెన్నుతట్టి ప్రోత్సహించారని సమంత చెప్పుకొచ్చారు. ఇంతటి భారీ విజయాన్ని అందించిన ప్రతి ఒక్కరికీ ఆమె హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ, ‘మా ఇంటి బంగారం’ ప్రేక్షకులందరి సినిమా అని కొనియాడారు.
దర్శకురాలు నందిని రెడ్డి మాట్లాడుతూ ఈ సినిమా కేవలం రివ్యూస్ వల్ల కాకుండా, థియేటర్లకు వచ్చిన ప్రేక్షకులు చూసి సోషల్ మీడియాలో పెట్టిన పాజిటివ్ పోస్టులు, మౌత్ టాక్ వల్లే ఇంతలా నిలబడిందని సంతోషాన్ని పంచుకున్నారు.
‘మా ఇంటి బంగారం’ చిత్రంలో సమంత నటనకు ఆడియన్స్ ఫిదా అవ్వడమే కాకుండా విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు దక్కాయి. ముఖ్యంగా ఈ చిత్రంలోని ఎమోషనల్ సీన్లు, హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్సులు సినిమాకు ప్రధాన హైలైట్‌గా నిలిచాయి. ఈ చిత్రంలో సమంతతో పాటు దిగంత్, మంజుషా, గుల్షన్ దేవయ్య, గౌతమి, శ్రీముఖి, సీనియర్ నటి లక్ష్మి కీలక పాత్రలు పోషించగా, ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ అందించిన మ్యూజిక్ సినిమా సక్సెస్‌లో కీలక పాత్ర పోషించింది.






