Home

»

Latest News

న‌రుడా - డోన‌రుడా మూవీ రివ్యూ

Nov 4, 2016 12:03PM

తెలుగు సినిమాలో కాన్సెప్టు క‌థ‌ల జోరు ఎక్కువైంది.  ప్ర‌యోగాలు స్వీక‌రించ‌డానికీ, వాటిని ఆశీర్వ‌దించ‌డానికీ తెలుగు ప్రేక్ష‌కులు సిద్ద‌మ‌వుతున్న వేళ‌...  బోల్డ్‌గా ఉన్న క‌థ‌ల్ని తెర‌పైచూపించేందుకు ద‌ర్శ‌క నిర్మాత‌లు సాహ‌సం చేస్తున్నారు. న‌రుడా డోన‌రుడా క‌థ కూడా ఒక విధంగా బోల్డ్ ఎటెమ్టే. వీర్య‌దానం చేసే ఓ హీరో క‌థ ఇది. సెక్స్‌కి సంబంధించిన విష‌యాలు మాట్లాడ‌డం, వినడం కాస్త ఇబ్బందిగా అనుకొనే మ‌న వాతావ‌ర‌ణంలో ఇలాంటి క‌థ‌ని డిస్క‌ర్స్ చేయ‌డం క‌త్తిమీద సామే. అయితే... న‌రుడా - డోన‌రుడా టీమ్ ఆ సాహ‌సం చేసింది. మ‌రి ఈ సినిమా ఎలా ఉంది??  తెలుగు ప్రేక్ష‌కుల‌కు న‌చ్చుతుందా?  లేదా?   ఇంత‌కీ రెండేళ్ల విరామం త‌ర‌వాత సినిమా చేసిన సుమంత్ కి హిట్టు కొట్టే దాఖ‌లాలు క‌నిపిస్తున్నాయా?  ఇవ‌న్నీ తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే. 

* క‌థ‌

సంతాన సాఫ‌ల్య కేంద్రాన్ని నిర్వ‌హిస్తుంటాడు డాక్ట‌ర్ ఆంజ‌నేయులు (త‌నికెళ్ల భ‌ర‌ణి).  పిల్ల‌లు లేని దంప‌తుల కోసం వీర్య‌దాత‌ల్ని వెదికి... సంతానం క‌లిగేలా చేస్తుంటాడు. ఎంత‌మంది దాత‌ల వీర్యాన్ని ప‌రీక్షించినా.. అవి సంతానానికి ప‌నికి రావ‌నేది తేలిపోతుంది. స‌రైన వీర్య‌దాత కోసం అన్వేషిస్తుంటాడు. త‌న‌కు విక్కీ (సుమంత్‌) క‌నిపిస్తాడు. దాంతో విక్కీ వింట ప‌డ‌తాడు ఆంజ‌నేయులు. ముందు వీర్య‌దానానికి అంగీక‌రించ‌క‌పోయినా.. మెల్ల‌మెల్ల‌గా డ‌బ్బుల కోసం తాను స్పెర్మ్ డోన‌ర్ గా మార‌తాడు. దాంతో డ‌బ్బులూ బాగా వ‌స్తాయి. త‌న ఆర్థిక జీవితం కుదుట ప‌డుతుంది. బ్యాంకులో ప‌నిచేసే ఆషిమా రాయ్ (ప‌ల్ల‌వి సుభాష్‌)ని ప్రేమిస్తాడు. ఇద్ద‌రూ పెళ్లి చేసుకొంటారు. పెళ్ల‌య్యి ఎంత‌కాల‌మైనా ఆషిమాకు సంతానం క‌ల‌గ‌దు. దానికి కార‌ణం ఏమిటి? స‌ంతాన లేమి... విక్కీ, ఆషిమాల జీవితాన్ని ఎలాంటి ఇబ్బందుల్లోకి నెట్టింది?  చివ‌రికి ఏమైంది అనేది తెరపై చూడాలి.


* విశ్లేష‌ణ‌

బాలీవుడ్‌లో విమ‌ర్శ‌కుల ప్ర‌సంశ‌ల‌తో పాటు,  మంచి వ‌సూళ్ల‌నీ ద‌క్కించుకొన్న విక్కీ డోన‌ర్‌కి రీమేక్ ఇది. సాధార‌ణంగా రీమేక్‌లు చేస్తున్న‌ప్పుడు ద‌ర్శ‌కుడు త‌న సొంత తెలివితేట‌ల్ని జోడించ‌డానికి ప్ర‌య‌త్నిస్తుంటాడు. అయితే... ఇక్క‌డ మాత్రం యాడింగులు క‌నిపించ‌లేదు. విక్కీ డోన‌ర్ సీడీ చూసి.. న‌రుడా డోన‌రుడా సినిమాని య‌థాత‌థంగా తెర‌కెక్కించారేమో అనిపిస్తుంది. తెర‌పై క‌నిపించే ప్ర‌తీ పాత్ర‌, ప్ర‌తీ స‌న్నివేశం విక్కీ డోన‌ర్‌కి ట్రూ కాపీ అనుకోవొచ్చు. మాతృక క‌థ‌ని, అందులో స‌న్నివేశాల్ని అంత గాఢంగా న‌మ్మ‌డం వ‌ల్లే... ఉన్న‌ది ఉన్న‌ట్టుగా తీశారేమో..?  తొలి భాగం అంతా స్పెర్మ్ డొనేష‌న్‌పైనే సాగుతుంది. ఆ కాన్సెప్ట్‌ని అర్థం చేసుకొనే వాళ్లు, ఒప్పుకొనే వాళ్లు మాత్రమే ఆయా స‌న్నివేశాల్ని ఎంజాయ్ చేయొచ్చు. మిగిలిన వాళ్ల‌కు భారంగానే అనిపిస్తుంది.

 భ‌ర‌ణి - సుమంత్ మ‌ధ్య సాగే స‌న్నివేశాలు కామెడీ పండిస్తాయి. విక్కీని స్పెర్మ్ డొనేట‌ర్‌గా మార్చ‌డానికి ఆంజ‌నేయులు ప‌డే పాట్లు స‌ర‌దాగానే ఉంటాయి. క‌థానాయిక‌తో ప్రేమ స‌న్నివేశాలు మాత్రం బోర్ కొట్టిస్తాయి. పెళ్లి చూపుల సీన్ అయితే... న‌స పెట్ట‌డం ఖాయం. ద్వితీయార్థం ఎమోష‌న‌ల్ జ‌ర్నీ సాగుతుంది. హీరో హీరోయిన్లు విడిపోవ‌డం, వాళ్ల‌ని క‌ల‌ప‌డానికి ఆంజ‌నేయులు చేసే ప్ర‌య‌త్నం.. ఇవ‌న్నీ భారంగా సాగే స‌న్నివేశాలే. ప‌తాక స‌న్నివేశాల్లో మాత్రం గుండె బ‌రువెక్కిస్తాడు. అక్క‌డ ప్ర‌ధాన పాత్ర‌ల న‌ట‌న ఆక‌ట్టుకొంటుంది.  ప్ర‌ధ‌మార్థం కామెడీ .. ద్వితీయార్థం ఎమోష‌న్‌.. వీటి చుట్టూ స్పెర్మ్ డోన‌ర్ అనే కొత్త విష‌యం.. ఇవే న‌రుడా డోన‌రుడాని బ‌లోపేతం చేసే విష‌యాలు. అయితే.. ఇందులో కొన్ని బోల్డ్ సీన్లు ఉంటాయి అని ముందే ప్రిపేర్ అయిపోయి.. సీట్లో కూర్చుంటే కాల‌క్షేపం అయిపోతుంది. లేదంటే... మాత్రం తొలిభాగం పూర్త‌య్యేంత వ‌ర‌కూ ఇబ్బంది పడ‌డం ఖాయం.  నాగ‌చైత‌న్య క్లైమాక్స్ లో చ‌టుక్కున మెరుస్తాడు. అది అక్కినేని అభిమానుల్ని ఆక‌ట్టుకొంటుంది. ప్ర‌ధ‌మార్థంలో బోల్డ్ స‌న్నివేశాల్ని ఇంకాస్త సున్నితంగా తెర‌కెక్కిస్తే బాగుండేది.  స‌న్నివేశాల్ని ఉన్న‌ది ఉన్న‌ట్టుగా తీయ‌కుండా.. మ‌న‌దైన శైలిలో మార్చుకొనే అవ‌కాశం ఉన్నా.. ద‌ర్శ‌కుడు ప‌ట్టించుకోలేదు.


* న‌టీన‌టుల ప్ర‌తిభ‌

రెండేళ్ల త‌ర‌వాత సుమంత్ చేసిన సినిమా ఇది. త‌న వ‌ర‌కూ డీసెంట్ గానే న‌టించాడు. స్పెర్మ్ డోన‌ర్‌గా ఎంత అల్లరి చేశాడో... భార్య‌కు దూరం అయిన భ‌ర్త‌గా అంత వేద‌న ప‌డుతూ న‌టించాడు. అయితే.. తొలిభాగంలో సుమంత్ న‌ట‌న‌.. కాస్త ఓవ‌ర్ అయిన‌ట్టు అనిపిస్తుంది. ఈ త‌ర‌హా పాత్ర‌లు అత‌నికి కొత్త కాబ‌ట్టి.. స్కేల్ స‌రిగా అర్థ‌మ‌యి ఉండ‌దు. హీరో త‌ర‌వాత హీరో అంత‌టి పాత్ర‌. త‌న అనుభ‌వాన్ని రంగ‌రించి న‌టించాడు త‌నికెళ్ల భ‌ర‌ణి.  అయితే ఆయ‌న‌ కూడా ప్రారంభ స‌న్నివేశాల్లో కావ‌ల్సిన‌దానికంటే లౌడ్‌గా న‌టించిన‌ట్టు అర్థ‌మ‌వుతోంది. ప‌ల్ల‌వి సుభాష్ ది హీరోయిన్ ఫేస్ క‌ట్ కాదు. గ్లామ‌రూ, న‌ట‌న అంతంత మాత్ర‌మే. కొన్ని స‌న్నివేశాల్లో బాగానేక‌నిపించినా.. చాలా చోట్ల‌.. తేలిపోయింది. చాలా కాలం త‌ర‌వాత శ్రీ‌ల‌క్ష్మి తెర‌పై క‌నిపించింది. మోడ్ర‌న్ అమ్మ‌గా మెప్పిస్తుంది. అయితే ఈ పాత్ర కూడా విక్కీ డోన‌ర్‌లో అమ్మ పాత్ర‌కి ట్రూ కాపీనే. సుమంత్ శెట్టి చేసిందేం లేదు. గుడ్లు ఉరిమి చూడ‌డం త‌ప్ప‌. ఈ పాత్ర నుంచి మ‌రింత వినోదం సృష్టించే అవ‌కాశం ఉంది. అయితే ద‌ర్శ‌కుడు.. ర‌చ‌యిత స‌ద్వినియోగం చేసుకోలేదు. 

* సాంకేతిక వ‌ర్గం

శ్రీ‌చ‌ర‌ణ్ పాకాల పాటలు ఈ సినిమాలో బిట్లు బిట్లుగా వినిపిస్తాయి. పాట‌లు అంత‌గా ఆక‌ట్టుకోలేద‌నే చెప్పాలి. నేప‌థ్య సంగీతం మాత్రం స‌న్నివేశాల‌కు అనుగుణంగా సాగింది. త‌క్కువ బ‌డ్జెట్‌లో, లిమిటెడ్ లొకేష‌న్ల‌లో తీసిన సినిమా ఇది. అయితే.. అదేం క‌నిపించ‌కుండా.. త‌న కెమెరా ట్రిక్‌తో క‌వ‌ర్ చేశాడు.. ష‌నియ‌ల్ డియో. తొలిభాగం ఎక్కువ‌గా సంభాష‌ణా చ‌మ‌త్కారాలు క‌నిపిస్తాయి. మాట‌లు అక్క‌డ‌క్క‌డ న‌వ్వించినా.. చాలా చోట్ల వీర్యం గురించిన డైలాగులే వినిపిస్తాయి. 

* ఫైన‌ల్ ట‌చ్ :  

విక్కీ డోన‌ర్ సినిమా చూసి... ఇందులో బోల్డ్‌నెస్ భ‌రించ‌డానికి సిద్ద‌ప‌డిన‌వాళ్ల‌కు.. ఈ సినిమా న‌చ్చుతుంది.  ప‌క్కాగా చెప్పాలంటే మ‌ల్టీప్లెక్స్ సినిమా మాత్ర‌మే. అక్క‌డ ఆడితే స‌రిపోతుంది అనుకొంటే... నిర్మాత‌లూ సేఫ్ అయిపోతారు.

రేటింగ్‌: 2.0

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com