Home

»

Latest News

నాకు అలాంటి ‘ఆశ’ లేదు.. ‘మాస్ ఇమేజ్‌’ గురించి ఇప్పటికి అర్థమైందన్నమాట.! 

Oct 7, 2026 2:40PM

సినిమా హీరోగా స్టార్‌డమ్ వచ్చిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవడం అంత ఈజీ కాదు. ముఖ్యంగా ఒకసారి మాస్ హీరో అనే ఇమేజ్ వచ్చిందంటే ఆ తర్వాత చేసే ప్రతి సినిమాపై అంచనాలు భారీగా ఉంటాయి. అంతకుముందు సినిమా కంటే ఇంకా పెద్ద సినిమా చేయాలి, ఇంకా ఎక్కువ యాక్షన్ ఉండాలి, అభిమానులను మెప్పించే ఎలివేషన్స్ ఉండాలి అనే లెక్కలు మొదలవుతాయి. అయితే తన కెరీర్ విషయంలో మాత్రం అలాంటి లెక్కలు వేసుకోవడం తనకు ఇష్టం లేదని నేచురల్ స్టార్ నాని చెబుతున్నాడు. తాజాగా ‘ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సినిమా ఎంపికలు, మాస్ హీరో ఇమేజ్ గురించి నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

తాను ‘మాస్ హీరో’గా గుర్తింపు తెచ్చుకోవాలని ఎప్పుడూ ప్రయత్నించలేదని నాని స్పష్టం చేశాడు. తన సినిమా ఎంపికలను చూస్తే ఈ విషయం అర్థమవుతుందని చెప్పాడు. ‘దసరా’ లాంటి మాస్ మూవీ తర్వాత ‘హాయ్ నాన్న’ వంటి ఫీల్‌గుడ్ సినిమా చేశానని గుర్తు చేశాడు. అలాగే ‘బ్లడీ రోమియో’ తర్వాత కూడా చాలా సున్నితమైన ప్రేమకథ చేయబోతున్నానని తెలిపాడు. కేవలం ఒకే తరహా సినిమాలు చేస్తూ ఒక ఇమేజ్‌లో ఇరుక్కుపోవడం తనకు ఇష్టం లేదని నాని చెప్పాడు.

మాస్ హీరో అనే ట్యాగ్‌ను కోరుకునే హీరోలు ఆ ఇమేజ్‌ను నిలబెట్టుకోవడం కోసం వరుసగా భారీ సినిమాలు చేయాల్సి వస్తుందని నాని అభిప్రాయపడ్డాడు. అలా చేస్తూ పోతే తమకు నచ్చిన కథలను ఎంచుకునే స్వేచ్ఛ తగ్గిపోతుందని, ప్రతిదానికీ ఎన్నో లెక్కలు వేసుకోవాల్సి వస్తుందని అన్నాడు. అలాంటి భారాన్ని మోయాల్సిన అవసరం తనకు లేదని, ఆ స్థితిలో ఉన్న నటులను చూస్తే తనకు జాలేస్తుందని చెప్పాడు. అయితే భవిష్యత్తులో ‘ది ప్యారడైజ్’ కంటే భారీ స్థాయిలో, మరింత మాస్‌గా ఉండే సినిమాలు చేయడానికి కూడా తాను సిద్ధమేనని నాని స్పష్టం చేశాడు. కాకపోతే అది ఒక ఇమేజ్‌ను కాపాడుకోవడం కోసం మాత్రం కాదని చెప్పాడు.

ఇప్పటికే తెలుగు సినిమాల్లో 18 ఏళ్లుగా కొనసాగుతున్న తన కెరీర్‌పై నాని పూర్తి సంతృప్తితో ఉన్నాడు. ఇంతకంటే పెద్ద స్టార్ అవ్వాలనే ప్రత్యేకమైన ఆశ తనకు లేదని, తాను ఉన్న స్థానం కూడా తనకు ఒక కల లాంటిదేనని చెప్పాడు. సినిమా ఎంత కలెక్ట్ చేసింది, తనను మాస్ హీరో అని పిలిచారా లేదా అనే దానికంటే చివరికి తన ఫిల్మోగ్రఫీ ఎలా ఉందన్నదే ముఖ్యమని నాని అభిప్రాయపడ్డాడు. అందుకే ఒక సినిమా తర్వాత మరో సినిమా అదే తరహాలో చేయకుండా, ప్రతిసారీ కొత్తగా కనిపించే ప్రయత్నం చేస్తానని చెప్పాడు.


Nani, Nani Latest News, Nani Mass Hero Comments, Nani The Paradise, The Paradise Nani, Nani Movies, Nani Interview, Natural Star Nani, Nani Mass Image, Telugu Cinema

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com