ఊపిరి బిగబట్టేలా చేసిన 'లక్ష్య' టీజర్ రివ్యూ
on Jan 22, 2021
నాగశౌర్య హీరోగా సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘లక్ష్య’. కేతిక శర్మ హీరోయిన్గా నటిస్తోన్న ఈ చిత్రంలో ఒక కీలక పాత్రలో విలక్షణ నటుడు జగపతి బాబు నటిస్తున్నారు. సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, నార్త్‌స్టార్ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై నారయణదాస్ కె. నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
నాగశౌర్య 20వ చిత్రంగా ప్రాచీన విలువిద్య నేపథ్యంలో స్పోర్ట్స్ బేస్డ్ ఫిలింగా ఈ మూవీ తెరకెక్కుతోంది. అందుకోసం తన శరీరాన్ని మరింత దృఢంగా మార్చుకున్నాడు నాగశౌర్య. ఇప్పటికే సూపర్ ఫిట్ బాడీతో, సిక్స్ ప్యాక్‌తో ఉన్న నాగశౌర్య ఫస్ట్‌లుక్ ఆకట్టుకుంది. జనవరి 22 నాగశౌర్య బర్త్‌డే సందర్భంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఒక నిమిషం నిడివి కలిగిన 'లక్ష్య' టీజర్‌ని చిత్ర బృందం విడుదల చేసింది. ప్రస్తుతం ట్విట్టర్లో, యూట్యూబ్‌లో ఈ టీజర్ ట్రెండింగ్‌లో ఉంది.
"చాలామందికి ఆటతో గుర్తింపు వస్తుంది. కానీ ఎవడో ఒకడు పుడతాడు.. ఆటకే గుర్తింపు తెచ్చేవాడు” అంటూ విలక్షణ నటుడు జగపతిబాబు వాయిస్ ఓవర్‌తో ప్రారంభమైన ఈ టీజర్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. ఈ సినిమాలో ఆర్చరీలో అత్యున్నత శిఖరాలను అధిరోహించిన వ్యక్తిగా నాగశౌర్య కనిపించనున్నాడని తెలుస్తోంది. రెండు విభిన్నమైన గెటప్‌లలో దర్శనమివ్వడంతో నాగశౌర్య పాత్రలో రకరకాల షేడ్స్ ఉన్నాయన్న విషయం అర్థమవుతోంది.
చివరలో "పడిలేచిన వాడితో పందెం చాలా ప్రమాదకరం".. అంటూ జగపతి బాబు చెప్పిన డైలాగ్‌తో పార్ధుగా నాగశౌర్య క్యారెక్టర్ ఎలా సాగుతుందో ఊహించవచ్చు. కురుక్షేత్ర ఆర్చరీ అకాడమీలో ట్రైనింగ్ తీసుకున్న ఆర్చర్ పార్ధుగా శౌర్య ఈ మూవీలో కనిపించబోతున్నాడు. మొదట తన లక్ష్యసాధనలో దెబ్బతిన్న అతను తర్వాత ఎలా తన గోల్‌ను రీచ్ అయ్యాడనేది 'లక్ష్య'లోని ప్రధానాంశం. పార్ధుగా సరికొత్త షేడ్‌లో శౌర్య కనిపించనున్నాడు. కాలబైరవ బ్యాగ్రౌండ్ స్కోర్, రామ్ సినిమాటోగ్రఫీ ఈ టీజర్‌కు మరింత బలాన్నిచ్చాయి. డైరెక్టర్ ధీరేంద్ర సంతోష్ జాగర్లపూడి టేకింగ్ హైలైట్ కానున్నది. ఈ టీజర్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది.