ఓ మై గాడ్.. హిమజ కల నిజమైన వేళ!
on Feb 25, 2021
టీవీ తార, బిగ్ బాస్ బ్యూటీ హిమజ క్లౌడ్ నైన్లో తేలియాడుతోంది. కారణం.. తన ఫేవరేట్ స్టార్ పవన్ కల్యాణ్‌ను కలుసుకోవడంతో పాటు, ఆయనతో ఫొటోలు దిగే అవకాశం రావడం! అంతేనా.. ఏకంగా ఆయనతో కలిసి నటించే ఛాన్స్ కూడా కొట్టేసింది ఈ అమ్మడు. ఆ విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా తెలియజేసి, తన అంబరాన్నంటిన సంబరాన్ని అభిమానులతో పంచుకుంది.
మొదట పవర్‌స్టార్‌తో తీసుకున్న సెల్ఫీ పిక్చర్‌ను షేర్ చేసిన ఆమె, "ఓ మై గాడ్.. ఈరోజు నా కల నిజమైంది. పవన్ కల్యాణ్ గారిని తొలిప్రేమ మూవీలో చూసినప్పుడు ఆయన్ని కనీసం డైరెక్ట్‌గా చూస్తానా అనుకున్నా. ఈరోజు పీఎస్పీకే 27లో పనిచేసే అవకాశం దక్కించుకున్నా.. థాంక్యూ సో మచ్ డైరెక్టర్ క్రిష్ గారూ.. మీతో కలిసి పనిచేయడం నాకెంతో ఆనందం, గౌరవం.. #pawankalyan" అంటూ రాసుకొచ్చింది.
అంతటితో హిమజలోని ఎగ్జయిట్మెంట్ ఆగలేదు. కొన్ని గంటల తర్వాత పవన్ కల్యాణ్ సరసన నిల్చొని దిగిన మరో ఫొటోను షేర్ చేసి, "That smile.. #pawankalyanfans #telugumovies #pspk" అనే క్యాప్షన్ జోడించింది. ఈ ఫొటోల్లో బ్లాక్ కలర్ లాల్చీ, వైట్ పైజమాతో పీకే ఆకట్టుకుంటుండగా, మల్టీకలర్ ఫ్లవర్ డిజైన్ హాఫ్ గౌన్‌లో మెరిసిపోతోంది హిమజ.
బిగ్ బాస్ మూడో సీజన్లో తన బిహేవియర్‌తో అనేకమంది అభిమానుల్ని సంపాదించుకున్న హిమజ ప్రస్తుతం పీఎస్పీకే 27 మూవీతో పాటు, నాగశౌర్య సినిమా 'వరుడు కావలెను'లోనూ ఓ కీలక పాత్ర చేస్తోంది.