తమన్‌పై వచ్చినన్ని జోకులు ఏ సంగీత దర్శకుడిపైనా రావేమో?? తమన్‌ని తిడుతున్నారో, పొగుడుతున్నారో.. రెంటికీ మధ్యంగా మోసేస్తున్నారో కూడా అర్థం కాకుండా తమన్ పేరు ప్రస్తావిస్తుంటారు హీరోలు. ఈ విషయంలో మెగా హీరోల తీరే వేరు. మెగా హీరోల సినిమాలకు బాగానే వర్క్ చేశాడు తమన్. మంచి పాటలు కూడా అందించాడు. అయినా వాళ్ల చేతిలో తబలా వాయింపుడు తప్పలేదు తమన్‌కి. రేసుగుర్రం టైమ్‌లో తమన్‌పై బన్నీ ఓ పంచ్ వేశాడు. ఎక్కడ ఏ సౌండ్ నచ్చినా ఎత్తుకొచ్చేస్తాడు అంటూ తమన్ ని పొగుడుతూనే చురక వేశాడు. తిక్క ఆడియో ఫంక్షన్‌లో సాయిధరమ్ తేజ్ కూడా అంతే. ఓసారి తమన్ తనకు పాట వినిపిస్తే... ఇది కాపీ ట్యూన్ అని మొహం మీదే చెప్పేశాడట.
దాన్ని తమన్ చాలా స్పోర్టివ్‌గా తీసుకొన్నాడని చెప్పుకొచ్చాడు. తమన్ ఎంత స్పోర్టివ్ అయినా ఆ విషయాన్ని సభాముఖంగా చెబుతారా ఎవరైనా?? శ్రీరస్తు శుభమస్తు ఫంక్షన్‌లో చిరు కూడా అంతే! తమన్ పాటల్లో సౌండ్ తప్ప... లిరిక్ వినిపించదు అంటూ తమన్ పాటని రాచి రంపాలు పెట్టే విధానాన్ని గుర్తు చేశాడు. అంతలోనే ఏమనుకొన్నాడో ఏంటో.. తమన్ పాట ఓ వ్యసనంలా తయారైందని కాంప్లిమెంట్ లాంటిది పడేశాడు.. ఎప్పటికైనా పడుంటుందని. అలా మొత్తానికి మెగా హీరోలంతా తమన్‌ని పట్టుకొని తమ కామెంట్లతో వాయించేస్తున్నారు. ఎవరేమన్నా.. క్యాప్ మాటున మొహం దాచుకొని ముసి ముసిగా నవ్వుతున్నాడు తమన్. బహుశా తమన్ విజయ రహస్యం అదేనేమో?






