లుక్ లీకైంది.. విజయ్ మళ్లీ కెలికాడట!
on Jan 29, 2018
లీకుల పర్వం టాలీవుడ్ లోనే కాదు... కోలీవుడ్ లో కూడా మొదలైది. ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో విజయ్ ఓ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన స్టిల్ ఒకటి ఉన్నట్టుండి... సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
ఈ సినిమా పాట కోసం చేసిన ఫొటో షూట్ కు సంబంధించిన ఫొటో అది. దాన్ని యూనిట్ సభ్యుల్లో ఎవరో లీక్ చేసినట్లు చెప్పుకుంటున్నారు. ఈ విషయంలో విజయ్ కూడా చాలా సీరియస్ గా ఉన్నట్టు తెలిసింది.
ఇదిలావుంటే... విజయ్, మురుగదాస్ కాంబినేషన్లో రానున్న ఈ సినిమాపై తమిళనాట భారీ అంచనాలే ఉన్నాయ్. కారణం... ‘తుపాకీ’ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న సినిమా కావడం కూడా ఈ హైప్ కు ఓ కారణం అని చెప్పాలి. అంతేకాదు... ‘మెర్సల్’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత విజయ్ చేస్తున్న సినిమా కూడా ఇదే. కీర్తి సురేశ్ ఇందులో కథానాయికగా నటిస్తోంది.
ఇక ఈ సినిమా వివరాల్లోకెళ్తే... ఈ దఫా కూడా ‘మెర్సల్’ దారిలోనే సామాజిక రుగ్మతలపై విజయ్ శంఖం పూరించనున్నట్లు తెలుస్తోంది. ‘మెర్సల్’ లో జీఎస్టీపై విజయ్ చేసిన కామెట్లు తమిళనాట పెద్ద వివాదానికే దారి తీసింది. ఈ సినిమాలో కూడా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే విధంగానే కథ, కథనాలు సాగుతాయని, రాజకీయ నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతోందని విశ్వసనీయ సమాచారం.
దీనికి బలాన్నిస్తూ.. ఈ చిత్ర ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్... ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఈ సినిమా గురించి మాట్లాడాడు. ‘మురుగదాస్ లేటెస్ట్ ఫిలిం..చాలా స్ట్రాంగ్ పాయింట్ తో రూపొందుతోంది. ప్రతి ఒక్కరూ ఆలోచించే స్థాయిలో ఈ చిత్ర కథ, కథనాలు సాగుతాయ్. దేశంలోనే ఈ సినిమా పెద్ద సంచలనం అయ్యే అవకాశం ఉంది‘ అని ఇంటర్ వ్యూలో చెప్పారు శ్రీకర్ ప్రసాద్.
దాంతో విజయ్ నెక్ట్స్ సినిమా కోసం అభిమానులందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇది విజయ్ నటించిన 62వ చిత్రం కావడం విశేషం.