
సంతోష్ కల్వచెర్ల, శ్రేయాసి సేన్ జంటగా ఏబీఎస్ ప్రొడక్షన్ బ్యానర్ మీద అఫ్రోజ్ షేక్ నిర్మిస్తున్న నూతన చిత్రం ‘మొహబ్బత్’ (Mohabbat). ఈ చిత్రానికి స్క్రీన్ ప్లేని అందిస్తూ మ్యాక్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ ప్రారంభోత్సవం శుక్రవారం నాడు ఘనంగా జరిగింది. ఈ చిత్ర పూజా కార్యక్రమాలకు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముహూర్తపు సన్నివేశానికి నవీన్ యాదవ్ క్లాప్ కొట్టగా చిత్ర నిర్మాత అఫ్రోజ్ షేక్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. అనంతరం నవీన్ యాదవ్ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ని కూడా లాంచ్ చేశారు.
చిత్రయూనిట్ నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే నవీన్ యాదవ్ మాట్లాడుతూ .. "మొహబ్బత్ సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు ధన్యవాదాలు. అఫ్రోజ్ అన్న నిర్మాతగా కొత్త వారికి ప్రోత్సాహం అందిస్తున్నారు. సినీ కార్మికుల కష్టాలు నాకు తెలుసు. ఎన్ని కష్టాలు వచ్చినా సినిమాల్ని నిర్మిస్తూనే ఉంటారు. ఈ చిత్రానికి పని చేస్తున్న ప్రతీ ఒక్కరికీ ఆల్ ది బెస్ట్. ఇది పాన్ ఇండియాగా రిలీజ్ కాబోతోంది. దర్శకుడు మ్యాక్‌కి మంచి సక్సెస్ రావాలి. ఈ సినిమా మంచి విజయం దక్కాలని కోరుకుంటున్నాను" అన్నారు.

దర్శకుడు సలీమ్ మాలిక్ (మ్యాక్) మాట్లాడుతూ .. "నిర్మాత అఫ్రోజ్ గారు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ‘మొహబ్బత్’ను నిర్మించేందుకు ముందుకు వచ్చారు. నాకు ఈ జర్నీలో సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. ఎమోషనల్ యూత్ ఫుల్ జెన్ జీ చిత్రంగా ‘మొహబ్బత్’ రానుంది. త్వరలోనే మా సినిమా పాన్ ఇండియా వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది" అన్నారు.
నిర్మాత అఫ్రోజ్ షేక్ మాట్లాడుతూ .. "నా ఏబీఎస్ ప్రొడక్షన్ బ్యానర్ మీద మొదటి ప్రాజెక్ట్‌గా ‘మొహబ్బత్’ను నిర్మిస్తున్నాను. ఈ మూవీ మంచి విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది. మ్యాక్ మంచి దర్శకుడు. సంతోష్, శ్రేయాసిలకు ఈ సినిమాతో మంచి సక్సెస్ వస్తుందని ఆశిస్తున్నాను. మా కోసం వచ్చిన నవీన్ యాదవ్ గారికి, శ్రీశైలం యాదవ్ గారికి ధన్యవాదాలు" అన్నారు.
హీరోయిన్ శ్రేయాసి సేన్ మాట్లాడుతూ .. "మొహబ్బత్ చిత్రంలో అన్ని రకాల అంశాలుంటాయి. ఈ కథ నాకు చాలా నచ్చింది. ఇది నాకు రెండో చిత్రం. నాకు ఈ అవకాశం ఇచ్చిన మ్యాక్ గారు, అఫ్రోజ్ గారికి థాంక్స్" అన్నారు.
హీరో సంతోష్ కల్వచెర్ల మాట్లాడుతూ .. "అఫ్రోజ్ గారికి సినిమా పట్ల ఎంతో ప్యాషన్ ఉంది. మా డైరెక్టర్ మ్యాక్ అద్భుతమైన టాలెంటెడ్. ఇలాంటి ఓ ప్రేమ కథకు సంగీతం ప్రధానం. సునీల్ కశ్యప్ గారితో పని చేస్తుండటం ఆనందంగా ఉంది" అన్నారు.
స్టోరీ, డైలాగ్ రైటర్ కలాం మాట్లాడుతూ .. "మొహబ్బత్’ కథ అద్భుతంగా వచ్చింది. కథ, మాటలను నేను అందించాను. ఎమోషనల్ వాల్యూస్ ఎక్కువగా ఉంటాయి" అన్నారు.






