అల్లు అర్జున్ వెనుక మెగా ఆర్మీ లేదా?
on Jan 7, 2020
సోమవారం సాయంత్రం జరిగిన 'అల వైకుంఠపురములో' సినిమా సంగీత విభావరిలో అల్లు అర్జున్ మాట్లాడిన మాటలు మెగా అభిమానుల మనసుకు బాధ కలిగించాయా? అవును అనే సమాధానమే ఎక్కువగా వినిపిస్తోంది. అల్లు అర్జున్ వ్యవహార శైలి మరోసారి చర్చకు దారితీసింది.
"ఈ కట్టె కాలే వరకు నేను చిరంజీవి అభిమానినే. చిరంజీవి గారి తర్వాత నాకు ఇష్టమైన హీరో రజనీకాంత్ గారు. ఆయన నా రోల్ మోడల్. నాకు ఇన్స్పిరేషన్. ఆయన నటించిన 'దర్బార్' సంక్రాంతికి విడుదలవుతుంది. ఆ సినిమాను స్వాగతిస్తున్నా" అని అల్లు అర్జున్ అన్నారు. తనకు ఇష్టమైన హీరో చిరంజీవి అన్నారు గానీ... అంతకు ముందు మాటల్లో "ఎవరికైనా అభిమానులు ఉంటారు. నాకు ఆర్మీ ఉంది. రెండేళ్లు సినిమా చేయకపోయినా... అభిమానులు ఎంతో అండగా ఉన్నారు. రెండేళ్ల గ్యాప్ వచ్చినా... నా అభిమానులు కారణంగా గ్యాప్ వచ్చినట్లుగా అనిపించడం లేదు" అని అల్లు అర్జున్ అన్నారు. ఈ మాటలే మెగా అభిమానులను బాధించాయి.
మెగా ముద్ర నుంచి బయటపడడానికి అల్లు అర్జున్ కొన్ని రోజులుగా చేస్తున్న ప్రయత్నాలను ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. తనకంటూ సొంత అభిమాన గణం ఏర్పరచుకునే పనుల్లో ఉన్నారు. ఇటువంటి సమయంలో సంక్రాంతికి తన 'అల వైకుంఠపురములో'కి పోటీగా వస్తున్న 'సరిలేరు నీకెవ్వరు' ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి మెగాస్టార్ అతిథిగా వెళ్లారు. అందువల్ల, ఆ సినిమాకు మంచి బజ్ వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి కి దీటైన వ్యక్తిని తీసుకురావడంలో అల్లు అర్జున్ టీమ్ విఫలమైంది. ఈ కారణం చేతనో... మరొకటో... లేక మనసులో మరేదైనా ఉందో... అల్లు అర్జున్ పాటలు ఎక్కడ మెగా అభిమానులు అనే మాట రాలేదు. అల్లు అర్జున్ కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు అతడికి అండగా నిలిచింది ఎవరు? అని సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ డిస్కస్ చేస్తున్నారు.