ENGLISH | TELUGU  

'సైరా'లో కీలక కేరెక్టర్ల సంగతేమిటి?

on Sep 17, 2019

 

'సైరా.. నరసింహారెడ్డి' రిలీజ్ డేట్ దగ్గరవుతున్న కొద్దీ మెగా ఫ్యాన్స్‌లోనే కాకుండా దేశవ్యాప్తంగా సినిమా లవర్స్ అందరిలోనూ క్యూరియాసిటీ అంతకంతకూ పెరిగిపోతోంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా చిరంజీవి పర్ఫార్మెన్స్‌ను చూడాలని వాళ్లంతా ఉవ్విళ్లూరుతున్నారు. ఈ సినిమా మొదలయ్యే వరకూ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎవరో తెలీని వాళ్లకు ఇప్పుడు ఆయనెవరో తెలిసింది. 1857లో జరిగిందని హిస్టరీలో మనం చదువుకున్న ప్రథమ స్వాతంత్ర్య సమరానికంటే ఒక దశాబ్ద కాలం ముందుగానే బ్రిటిష్ వాళ్లపై తిరుగుబాటు బావుటా ఎగరేసిన ధీరుడిగా, వారి ఉరితీతకు గురైన సమరయోధుడిగా ఇవాళ చాలామందికి నరసింహారెడ్డి గురించి తెలుసు. ఆ పాత్రనే 'సైరా'లో మెగాస్టార్ పోషించారు. నరసింహారెడ్డి సరే.. ఈ సినిమాలో మహామహులైన కొందరు నటులు చేసిన పాత్రల గురించి కూడా తెలుసుకోవాలనే ఆసక్తి ప్రేక్షకుల్లో వ్యక్తమవుతోంది. ఆ పాత్రల్ని పరిచయం చేసుకుందాం.

బ్రిటిష్ దొరల పెత్తనంపై తిరుగుబాటు చేసిన నరసింహారెడ్డికి అండగా నిలిచిన గిరిజన నాయకుడు రాజా పాండి. తమిళ ప్రాంతానికి చెందిన ఆయన కూడా బ్రిటిషర్లను ధిక్కరించి పోరాడాడు. ఆ పాత్రను తమిళ హీరో, 'మక్కల్ సెల్వన్'గా ఫ్యాన్స్ పిలుచుకొనే విజయ్ సేతుపతి చేశాడు. పొడవాటి జుట్టు, నుదుటున విభూతి, మధ్యలో నిలువెత్తు తిలకంతో అతని ఆహార్యం ఆకట్టుకుంటోంది.

పాలెగాడు అయిన నరసింహారెడ్డి గురువు గోసాయి వెంకన్న. ఆయన ప్రభావం నరసింహారెడ్డిపై ఎక్కువ. గురువు మాటను నరసింహారెడ్డి శిరసా వహిస్తాడని ఆయన కథ చెబుతోంది. అలాంటి వెంకన్న పాత్రను బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ చేశారు. తెల్లగా నెరిసిన పొడవాటి జుట్టు, పెంచిన మీసాలు, గడ్డం, నుదుటున నిలువెత్తు కుంకుమ తిలకంతో గంభీరంగా కనిపిస్తోన్న అమితాబ్ రూపం ఆకట్టుకుంటోంది.

గిద్దలూరు తిరుగుబాటు ఘటనలో నరసింహారెడ్డితో చేయి కలిపిన యోధుడు అవుకు రాజు. అవుకు రాజ్యానికి చెందిన అతను బ్రిటిష్ పాలకులు తెచ్చిన చట్టాలపై నిరసనలు వ్యక్తం చేశాడు. ఆ పాత్రను 'అభినయ చక్రవర్తి'గా పేరుపొందిన కన్నడ స్టార్ యాక్టర్ కిచ్చా సుదీప్ పోషించాడు. నలుపు దుస్తులు, నల్లగా నిగనిగలాడే పొడవాటి జుట్టు, గుబురు గడ్డం, మెలి తిప్పిన మీసంతో అవుకు రాజుగా సుదీప్ రూపానికి అందరూ ఫిదా అవుతున్నారు.

నరసింహారెడ్డి భార్య సిద్ధమ్మ అయినా, ఆయన మనసిచ్చిన ప్రేయసి లక్ష్మి. నరసింహారెడ్డి కోసం ఏమైనా చెయ్యడానికి వెనుకాడని యువతి లక్ష్మి. ఆ పాత్రలో మిల్కీ బ్యూటీగా అందరూ పిలిచే తమన్నా భాటియా నటించింది. తన సహజ శరీర వర్ణానికి భిన్నమైన మేకప్‌తో ఆమె కనిపించనున్నది. ఆనాటి సంప్రదాయ వస్త్రాలంకరణ, ఆభరణాలతో తమన్నా రూపం కొత్తగా కనిపిస్తూ ఆకట్టుకుంటోంది.

ఝాన్సీ లక్ష్మీబాయ్ గురించి తెలియని వాళ్లెవరు? చిన్నప్పటి నుంచీ చరిత్ర పుస్తకాల్లోనూ, ఆ తర్వాత సందర్భం వచ్చినప్పుడల్లా లక్ష్మీబాయ్ గురించి చదువుకుంటూ వస్తూనే ఉన్నాం. నరసింహారెడ్డికి సమకాలీనురాలు. ఇక్కడ రేనాడులో బ్రిటిషర్లపై నరసింహారెడ్డి యుద్ధం ప్రకటిస్తే, అక్కడ ఉత్తర భారతంలోని ఝాన్సీ రాజ్యానికి రాణిగా పాలన చేస్తూ, బ్రిటిషర్లపై తిరగబడిన వీర వనిత. కొద్దిసేపు కనిపించే ఆ పాత్రను అనుష్క చేసింది. ఇప్పటికే 'రుద్రమదేవి' వంటి మహా యోధురాలైన చారిత్రక స్త్రీ పాత్ర చేసిన ఆమెకు ఇది రెండో హిస్టారికల్ రోల్. ఆమె ఆహార్యం ఎలా ఉంటుందనేది వెల్లడించకపోయినా, లక్ష్మీబాయ్ రూపం ఎలా ఉంటుందో మనకు తెలుసు. కాబట్టి ఆ పాత్రలో అనుష్క చెలరేగుతుంటే చూడాలని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.

నరసింహారెడ్డి భార్య సిద్ధమ్మ. భర్తకు అన్ని విషయాల్లో చేదోడు వాదోడుగా నిలిచిన సహధర్మచారిణి. నరసింహారెడ్డి మనసెరిగి నడచుకోవడమే కాకుండా, సదర్భం వచ్చినప్పుడు సలహాలిచ్చిన మేధావి. అలాంటి పాత్రలో దక్షిణ భారతావనిలోనే హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న నయనతార నటించింది. సిద్ధమ్మగా తెలుగు సంప్రదాయ స్త్రీ మూర్తికి నిలువెత్తు అద్దంలా కనిపిస్తోన్న నయనతార ఆహార్యం అమితంగా ఆకట్టుకుంటోంది.

నరసింహారెడ్డికి శత్రువులు బ్రిటిషర్లు మాత్రమే కాదు, వీరారెడ్డి కూడా శత్రువే. బ్రిటిషర్ల చేతికి నరసింహారెడ్డి దొరికిపోవడంలో వీరారెడ్డి పాత్ర ఉందని ఈ సినిమాలో మనం చూడబోతున్నాం. అతనొక స్థానిక రాజు. ఆ పాత్రలో విలక్షణ నటుడు జగపతిబాబు కనిపించబోతున్నారు. సాఫ్ట్ హీరో నుంచి హార్డ్‌కోర్ విలన్‌గా మారి, ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ వస్తోన్న ఆయన వీరారెడ్డిగా దుష్టత్వాన్ని ఏ రీతిలో ప్రదర్సించి ఉంటారో ఊహించుకోవచ్చు. సగం నెరిసిన గడ్డం, పొడవాటి జుట్టు, తలపాగా, నుదుటున గుండ్రటి తిలకంతో నడివయసులో ఉన్న రెడ్డి రాజులా కనిపిస్తోన్న ఆయన ముఖంలో ప్రతినాయక హావభావాలు స్పష్టమవుతున్నాయి.

ఇలా.. ఈ పాత్రలన్నింటి సమాహారమే 'సైరా.. నరసింహారెడ్డి' మూవీ. ఈ కేరెక్టర్ల సపోర్టుతో నరసింహారెడ్డి కేరెక్టర్ ఏ రీతిలో ఎలివేట్ అవుతుందో, ఆ కేరెక్టర్‌లో మెగాస్టార్ చిరంజీవి ఏ స్థాయిలో చెలరేగిపోయారో.. అక్టోబర్ 2న మనం చూడబోతున్నాం.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.