'బాహుబలి'కి మమ్ముట్టీ థాంక్స్ చెప్పుకోవాలి
on Oct 4, 2019
'బాహుబలి' విడుదల తరవాత దక్షిణాది సినీ ప్రముఖుల ఆలోచనా విధానం మారింది. భారీ నిర్మాణ వ్యయంతో తెరకెక్కిస్తున్న సినిమాలను దేశవ్యాప్తంగా విడుదల చేయడానికి మొగ్గు చూపుతున్నారు. చేస్తున్నారు కూడా. భారీ నిర్మాణ వ్యయంతో 'సైరా నరసింహారెడ్డి' నిర్మించడానికి 'బాహుబలి' ఫలితం ధైర్యాన్నిచ్చిందని చిరంజీవి చెప్పారు. 'బాహుబలి' తరవాత 'సాహో', 'సైరా' సినిమాలను తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేశారు. విజయ్ దేవరకొండ 'డియర్ కామ్రేడ్'ను దక్షిణాది భాషల్లో విడుదల చేశారు. ఈ రూటును ఫాలో అవుతూ 'మామాంగం' సినిమాను తెలుగు, హిందీ, తమిళ భాషల్లో విడుదల చేస్తున్నారు మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి.
తమిళ హీరోలు ఎప్పటి నుండో తమ సినిమాలను తెలుగులో విడుదల చేస్తున్నారు. 'జనతా గ్యారేజ్' తర్వాత మోహన్ లాల్ మలయాళ సినిమాలు తెలుగులోకి అనువాదం అవుతున్నాయి. 'యాత్ర' తరవాత తెలుగులోకి మమ్ముట్టి సినిమాలు రావడం పెద్ద విశేషం ఏమీ కాదు. కానీ, హిందీలోనూ విడుదల చేస్తున్నారంటే 'బాహుబలి' పుణ్యమే. జమోరిన్ పాలనలో చావెరుక్కళ్ యుద్ధ వీరుల చరిత్ర ఆధారంగా, అతి ప్రాచీనమైన కలరి విద్యలోని విశిష్టతను చాటి చెప్పేలా రూపొందిన 'మామాంగం' నవంబర్ 21న మలయాళం, తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదల చేయనున్నట్టు నిర్మాత తెలిపారు.
Also Read