English | Telugu  
English | Telugu

'మా నాన్న న‌క్స‌లైట్' మూవీ రివ్యూ

on Jul 7, 2022

 

సినిమా పేరు: మా నాన్న న‌క్స‌లైట్‌
తారాగ‌ణం: ర‌ఘు కుంచే, ఎల్బీ శ్రీ‌రామ్‌, సుబ్బ‌రాజు, అజ‌య్‌, జీవ, కృష్ణ బూరుగుల, రేఖ నిరోషా, వినయ్ మహాదేవ్, అనిల్, ఎఫ్.ఎమ్. బాబాయ్, సముద్రం వెంకటేష్, బుగత సత్యనారాయణ , అంకోజీరావు , కాశీ విశ్వనాథ్, కనకారావు, ప్రసన్న కుమార్, పద్మజ లంక, డ్రాగన్ ప్రకాశ్‌, బాబ్జీ
సాహిత్యం: యక్కలి రవీంద్ర బాబు, గమన్ శ్రీ, పెద్దాడ మూర్తి
సంగీతం: ప్ర‌వీణ్ ఇమ్మ‌డి
సినిమాటోగ్ర‌ఫీ: ఎస్వీ శివ‌రామ్‌
ఫైట్స్: డ్రాగ‌న్ ప్ర‌కాశ్‌
నిర్మాత: చ‌ద‌ల‌వాడ శ్రీ‌నివాస‌రావు
ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వం: పి. సునీల్‌కుమార్ రెడ్డి
బ్యాన‌ర్: అనూరాధ ఫిలిమ్స్ డివిజ‌న్‌
విడుద‌ల తేదీ: 8 జూలై 2022 (థియేట‌ర్ల‌లో)

ప్ర‌జోప‌యోగ‌క‌ర‌మైన ఇతివృత్తాల‌తో చిత్రాలు రూపొందించే అభిరుచి క‌లిగిన ద‌ర్శ‌కుడిగా పి. సునీల్‌కుమార్ రెడ్డి పేరు తెచ్చుకున్నారు. న‌టునిగా మారిన సంగీత ద‌ర్శ‌కుడు, గాయ‌కుడు ర‌ఘు కుంచేను టైటిల్ రోల్‌లో చూపిస్తూ ఆయ‌న డైరెక్ట్ చేసిన ఫిల్మ్ 'మా నాన్న న‌క్స‌లైట్‌'. సీనియ‌ర్ ప్రొడ్యూస‌ర్ చ‌ద‌ల‌వాడ శ్రీ‌నివాస‌రావు నిర్మించిన ఈ సినిమా థియేట‌ర్ల‌లో జూలై 8న విడుద‌ల‌వుతోంది. రెండు రోజుల ముందుగానే జూలై 6 రాత్రి ఫిల్మ్ జ‌ర్న‌లిస్టుల‌కు ప్ర‌ద‌ర్శించారు. దాన్ని బ‌ట్టే ఈ సినిమాపై ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు ఉన్న న‌మ్మ‌కం తెలుస్తోంది. 

క‌థ‌
కొండ‌రుద్ర సీతారామ‌య్య (ర‌ఘు కుంచే) విశాఖ మ‌న్యం ప్రాంతానికి చెందిన న‌క్స‌లైట్‌. త‌న కొడుక్కి గ‌నుల త‌వ్వ‌కానికి అనుమ‌తులిచ్చిన మినిస్ట‌ర్ మాణిక్య‌రావును చంపేస్తుంది అత‌ని ద‌ళం. అత‌ని వార‌సుడిగా కొడుకు మాధ‌వ‌రావు (సుబ్బ‌రాజు) హోమ్ మినిస్ట‌ర్ అయ్యి, సీతారామ‌య్య‌ను టార్గెట్ చేసుకుంటాడు. ఏసీపీ భ‌ర‌త్ వ్యాస్ (అజ‌య్‌)కు ఆ బాధ్య‌త‌లు అప్ప‌గిస్తాడు. వృద్ధాప్యం మీద ప‌డుతుండ‌టంతో మునుప‌టిలా చురుగ్గా క‌ద‌ల‌లేక‌పోతున్నాన‌ని గ్ర‌హించిన సీతారామ‌య్య చివ‌ర‌గా త‌న కొడుకును క‌లుసుకోవాల‌నుకుంటాడు. మ‌రోవైపు త‌ల్లిని చిన్న‌త‌నంలోనే కోల్పోయి, తండ్రి ఎలా ఉంటాడో కూడా తెలీక‌పోయినా, ఆయ‌న‌ను అభిమానిస్తూ కాలేజీలో చ‌దువుకుంటూ ఉంటాడు సీతారామ‌య్య కొడుకు స‌త్య (కృష్ణ బూరుగుల‌). పోలీసుల క‌ళ్లుగ‌ప్పి కొడుకును సీతారామ‌య్య క‌లుసుకోగ‌లిగాడా? లేదా? అనేది మిగ‌తా క‌థ‌.

విశ్లేష‌ణ‌
కొండరుద్ర సీతారామ‌య్య అనే పేరు ఒక‌ప్ప‌టి పేరుపొందిన న‌క్స‌లైట్‌ కొండ‌ప‌ల్లి సీతారామ‌య్య పేరును స్ఫురింప‌జేస్తుంది. ఓచోట 'శివ' సినిమా విడుద‌లైన ప్ర‌స్తావ‌న వ‌స్తుంది కాబ‌ట్టి, ఈ సినిమా క‌థాకాలం 1989, 90ల కాలం నాటిద‌ని చెప్పొచ్చు. టైటిల్ ప్ర‌కారం ఇది ఒక న‌క్స‌లైట్‌, ఆయ‌న కొడుకు క‌థ‌. సినిమాలో అత్య‌ధిక భాగం 'నాన్న' అనే ఎమోష‌న్ చుట్టూ న‌డుస్తుంది. 20 ఏళ్ల వ‌య‌సొచ్చినా ఎలా ఉంటాడో తెలీని తండ్రి కోసం ఓ కొడుకు ఎలా అల్లాడిపోతుంటాడో చాలా ప్ర‌భావ‌వంతంగా ఈ సినిమాలో చూపించాడు ద‌ర్శ‌కుడు. ఆ కొడుకును ప్ర‌స‌వించే స‌మ‌యంలో పోలీసులు చుట్టుముట్ట‌డంతో భార్య‌ను వ‌దిలేసి, అడ‌వుల్లోకి వెళ్లిపోయి అజ్ఞాత‌వాసం గ‌డుపుతూ వ‌చ్చిన సీతారామ‌య్య‌.. వ‌య‌సు మ‌ళ్లుతున్న కాలంలో శ‌రీరం స‌రిగా స‌హ‌క‌రించ‌క‌, త‌న ద‌ళానికి త‌ను భారంగా మారుతున్నాన‌ని అర్థ‌మై, ఒంట‌రివాడైన కొడుకును ఎలాగైనా క‌లుసుకోవాల‌ని చేసిన ప్ర‌యాణాన్ని అంతే ఆస‌క్తిక‌రంగా చిత్రించాడు. పీడిత ప్ర‌జ‌ల కోసం తుపాకీ ప‌ట్టి, రాజ్యంపై తిరుగుబాటు ప్ర‌క‌టించిన ఒక విప్ల‌వ‌నాయ‌కుడిలోనూ త‌న కుటుంబం అంటే ఆపేక్ష ఉంటుంద‌నీ, 20 ఏళ్లుగా చూడ‌ని కొడుకు కోసం ఆ హృద‌యం త‌ల్ల‌డిల్లుతుంటుంద‌నీ ఈ సినిమాలో మ‌నం చూస్తాం.

ఏసీపీ భ‌ర‌త్ వ్యాస్ ఆధ్వ‌ర్యంలో పోలీసులు ఓ ఆర్టీసీ బ‌స్సెక్కి సీతారామ‌య్య కోసం వెతుకుతుంటారు. కానీ ఆయ‌న ఎలా ఉంటాడో వారికి తెలీదు. ఆ బ‌స్సులోనే తెల్ల‌టి బ‌ట్ట‌ల్లో కూర్చొని ఉంటాడు సీతారామ‌య్య‌. అత‌ని ప‌క్క‌నే జ‌ర్న‌లిస్ట్ సూర్య‌ప్ర‌కాశ‌రావు ఉంటాడు. ఆ ఇద్ద‌రికీ మంచి ప‌రిచ‌యం. అప్ప‌టికే సూర్య‌ప్ర‌కాశ‌రావుకు అడ‌విలో ఓసారి ఇంట‌ర్వ్యూ ఇచ్చి ఉన్నాడు సీతారామ‌య్య‌. భ‌ర‌త్ వ్యాస్‌కు ఆ జ‌ర్న‌లిస్ట్ ప‌రిచ‌య‌మే. అత‌ని దృష్టి సూర్య‌ప్ర‌కాశ‌రావు, సీతారామ‌య్య మీద ప‌డుతుంది. ఆ ఇద్ద‌రూ అత‌నివైపే చూస్తుంటారు. అరే.. సీతారామ‌య్య పోలీసుల‌కు దొరికిపోయాడా అని మ‌నం ఊపిరి బిగ‌ప‌ట్టి చూస్తుండ‌గా.. ఇంట‌ర్వెల్ ప‌డుతుంది. సినిమాకు ఎలాగైతే రెండు భాగాలుంటాయో, కొండ‌రుద్ర సీతారామ‌య్య క‌థ‌లోనూ రెండు భాగాలుంటాయి. ఒక‌టి - న‌క్స‌లైట్‌గా అడ‌వుల్లో తిరుగుతూ, పోలీసుల దాడుల నుంచి త‌ప్పించుకుంటూ ఉండ‌ట‌మైతే, ఇంకోటి - కొడుకు కోసం అడ‌వి నుంచి ఊరికి సాగించే ప్ర‌యాణం. స్క్రీన్‌ప్లేలో ప్రాథ‌మిక అంశ‌మైన ఓపెనింగ్‌, మిడిల్‌, ఎండింగ్ అనే భాగాల్ని చాలా బాగా ఈ క‌థ‌లో ఇమిడ్చాడు ద‌ర్శ‌కుడు. 

సీతారామ‌య్య‌ను ప‌ట్టుకొనే బాధ్య‌త తీసుకున్న ఏసీపీ భ‌ర‌త్ వ్యాస్ పాత్ర‌ను ద‌ర్శ‌కుడు విల‌న్‌గా చూపించ‌క‌పోవ‌డం ఇక్క‌డ ప్ర‌స్తావ‌నార్హం. ఆయ‌నే కాదు, పోలీసుల్ని ఎవ‌రినీ ఆయ‌న నీచులుగా చూపించ‌లేదు. త‌మ డ్యూటీలో భాగంగా న‌క్స‌లైట్ల‌ను ప‌ట్టుకోవ‌డానికి ప్ర‌య‌త్నించేవారిగా పోలీసుల‌ను ప్రెజెంట్ చేశాడు సునీల్‌కుమార్ రెడ్డి. ఇక డ‌బ్బు కోసం కానీ, మ‌రేదైనా ప్ర‌లోభం కోసం కానీ ఏమాత్రం లొంగ‌ని, చ‌లించ‌ని విలువ‌ల్ని అంటిపెట్టుకొని ఉండే జ‌ర్న‌లిస్టుగా సూర్య‌ప్ర‌కాశ‌రావు పాత్ర‌ను ఆయ‌న మ‌లిచిన తీరు ఆక‌ట్టుకుంటుంది. సీతారామ‌య్య‌ను ప‌ట్టిస్తే ల‌క్ష‌ల డ‌బ్బు వ‌స్తుంద‌ని తెలిసినా, ఆయ‌న ఆచూకీని బ‌య‌ట‌పెట్ట‌ని నిజాయితీకి నిలువెత్తు నిద‌ర్శ‌నంగా సూర్య‌ప్ర‌కాశ‌రావు క‌నిపిస్తాడు. పురిటిలోనే త‌న‌ను వ‌దిలేసి వెళ్లిపోయిన తండ్రి అంటే సాధార‌ణంగా కొడుకు అత‌డిని అస‌హ్యించుకోవాలి. కానీ అందుకు భిన్నంగా అత‌డిని ఆరాధించే కొడుకుగా స‌త్య పాత్ర‌ను మ‌లిచాడు సునీల్‌కుమార్ రెడ్డి. తండ్రిని ఎవ‌రైనా ప‌ల్లెత్తు మాట‌న్నా ప‌డ‌ని స‌త్య పాత్ర మ‌న సానుభూతి పొందుతుంది.

టెక్నిక‌ల్‌గా మంచి స‌పోర్ట్ ల‌భించిన‌ట్ల‌యితే ఈ సినిమా ఇంకో స్థాయిలో ఉండేది. ప్ర‌వీణ్ ఇమ్మ‌డి బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా చోట్ల బాగానే ఉన్నా, అక్క‌డ‌క్క‌డా పాత్ర‌ల సంభాష‌ణ‌ల్ని మింగేసింది. శివ‌రామ్ సినిమాటోగ్ర‌ఫీ ఫ‌ర్వాలేద‌నిపించే స్థాయిలో ఉంది. ద్వితీయార్ధంలో సీతారామ‌య్య కొడుకు కోసం చేసే ప్ర‌యాణాన్ని ఇంకొంత బిగువుగా చూపించిన‌ట్ల‌యితే మ‌రింత ఆస‌క్తిక‌రంగా మారి ఉండేది. క్లైమాక్స్ చిత్రీక‌ర‌ణ హృద‌యాల్ని ద్ర‌వింప‌జేస్తుంది. సునీల్‌కుమార్ రెడ్డి సంభాష‌ణ‌లు సంద‌ర్భానుసారం ఒక‌వైపు ప‌దునుగానూ, ఇంకోవైపు హృద్యంగానూ ఉన్నాయి. పాట‌లు సంద‌ర్భానుసారం వ‌స్తాయి కాబట్టి ఇబ్బంది పెట్ట‌వు. నిర్మాణ విలువ‌లు ఓ మోస్త‌రుగా ఉన్నాయి.

న‌టీన‌టుల ప‌నితీరు
న‌క్స‌లైట్ కొండ‌రుద్ర సీతారామ‌య్య‌గా ర‌ఘు కుంచే మ‌న అంచ‌నాల‌కు మించి రాణించాడు. రెండు పార్శ్వాల పాత్ర‌ను సెటిల్డ్‌గా ప‌ర్ఫామ్ చేశాడు. డైలాగ్ డిక్ష‌న్ ఆక‌ట్టుకుంటుంది. ఆయ‌న‌కిది లైఫ్‌టైమ్ క్యారెక్ట‌ర్‌. జ‌ర్న‌లిస్ట్ సూర్య‌ప్ర‌కాశ‌రావుగా ఎల్బీ శ్రీ‌రామ్ జీవించేశారు. అతి సునాయాసంగా ఆ పాత్ర‌లో ఇమిడిపోయారు. చాలా కాలం త‌ర్వాత ఆయ‌న‌ను ఇలాంటి పాత్ర‌లో చూడ్డం బాగుంది. ఏసీపీ భ‌ర‌త్ వ్యాస్‌గా అజ‌య్‌, హోమ్ మినిస్ట‌ర్ మాధ‌వ‌రావుగా సుబ్బ‌రాజు పాత్ర‌ల ప‌రిధి మేర‌కు న‌టించారు. కొండ‌రుద్ర స‌త్య‌గా కృష్ణ బూరుగుల ఇంప్రెస్ చేశాడు. కొత్త‌వాడైనా ఆ ఛాయ‌లేమీ క‌నిపించ‌కుండా, ప‌రిణ‌తి చెందిన న‌ట‌న చూపించాడు. ఈ సినిమా క్లైమాక్స్ అత‌నిదే. అత‌ని ప్రియురాలు మాలినిగా కొత్త‌మ్మాయి రేఖ నిరోషా కూడా బాగానే చేసింది. ఆమె తండ్రిగా కాశీ విశ్వ‌నాథ్‌, సూర్య‌ప్ర‌కాశ‌రావు కొడుకు ధ‌నుంజ‌య్‌గా విన‌య్ మ‌హాదేవ్, మినిస్ట‌ర్ మాణిక్య‌రావుగా జీవా క‌నిపించారు.

తెలుగువ‌న్ ప‌ర్‌స్పెక్టివ్‌
పీడిత జ‌నం కోసం తుపాకీ ప‌ట్టి విప్ల‌వ‌బాట‌లో న‌డిచిన ఓ న‌క్స‌లైట్, వ‌య‌సుమ‌ళ్లాక కొడుకును క‌లుసుకోవ‌డానికి చేసిన ప్ర‌యాణం మ‌న‌సుల్ని క‌దిలిస్తుంది. అభిరుచి క‌లిగిన ప్రేక్ష‌కులకు ఈ సినిమా న‌చ్చుతుంది. మాస్ మ‌సాలా సినిమాలు కోరుకొనేవారికి మాత్రం 'మా నాన్న న‌క్స‌లైట్' మూవీ మింగుడుప‌డ‌దు.

రేటింగ్: 3/5

- బుధ్ది య‌జ్ఞ‌మూర్తి


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.