ఫ్లాష్‌బ్యాక్: వేటూరికి మహదేవన్ క్లాస్
on Aug 1, 2020

ఎన్టీఆర్, జయప్రద, జయసుధ నటించిన 'అడవిరాముడు ' (1976) సినిమా చరిత్రను సృష్టించి బాక్సాఫీస్ బద్దలు కొట్టింది. సత్య చిత్ర సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి కె. రాఘవేంద్రరావు దర్శకుడు. కె.వి. మహదేవన్ సంగీతం సమకూర్చగా వేటూరి రాసిన ప్రతి పాటా సూపర్ హిట్టే. వాటిలో 'ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరీ' పాట ఆ రోజుల్లో కోటి రూపాయల పాటగా పేరు తెచ్చుకుంది. వాడవాడలా మోగిపోయింది.
ఆరింటిలో ఐదు పాటల్ని ఒకే తాళం.. త్రిశ్రంలో రాశారు వేటూరి. అందుకని ఆరో పాటనైనా చతురస్రంలో రాయమని ఆయనకు సూచించారు మహదేవన్. ఆరవది క్లైమాక్స్ పాట. వేటూరి రాసిన పాటను రాఘవేంద్రరావు ఓకే చేసి మహదేవన్ కు ఇచ్చారు. అది మారు వేషాలతో సాగే పాట. మహదేవన్ కు సన్నివేశం చెప్పి పనిమీద వెళ్లిపోయారు రాఘవేంద్రరావు. పాట చూడగానే మహదేవన్ కోపంగా వేటూరిని చూస్తూ 'ఏం రాశావ్? చదువు' అన్నారు. 'చూడరా చూడరా సులేమాను మియ్యా' అని చదివారు వేటూరి.
'ఇది ఏం తాళం?' అని మహదేవన్ అడిగితే చతురస్రంలో రాశానన్నారు. తను పాడి వినిపించి 'ఇది చతురస్రమా?' అనడిగారు మహదేవన్. కాదన్నారు వేటూరి. తాళం మార్చి రాయమని ఆయనడిగితే ఎలా మార్చాలో వెంటనే వేటూరికి తెలియలేదు. ఇది గమనించిన మహదేవన్ ఇంకో రెండు 'చూడరా'లు తగిలిస్తే సరిపోతుందని చెప్పారు. దాంతో 'చూడర చూడర చూడర చూడర ఒక చూపూ సులేమాన్ మియా' అని తిరిగి రాశారు వేటూరి. అప్పుడది అవలీలగా చతురస్రంలో వచ్చింది. అందరూ విని ఊగిపోయారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



