
'కేడీ' ఫేమ్ కిరణ్ కుమార్ (KK) దర్శకత్వం వహించిన పీరియడ్ క్రైమ్ యాక్షన్ డ్రామా 'KJQ' (కింగ్ జాకీ క్వీన్) ఆగస్టు 7న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 1990ల కాలంలో స్నేహం, ప్రేమ, ప్రతీకారాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం కేవలం ఒక సినిమా మాత్రమే కాదు, ఒక భావోద్వేగ ప్రయాణం. ఈ సినిమా దర్శకుడు కిరణ్ కుమార్ (కేకే) చిత్రీకరణ పూర్తయ్యాక అకాల మరణం చెందడంతో, చిత్ర యూనిట్ అంతా ఆయన జ్ఞాపకార్థం ఈ సినిమాను ఘనంగా అంకితం చేస్తోంది. దర్శకుడు లేని లోటు బృందాన్ని తీవ్రంగా కలిచివేస్తున్నప్పటికీ, ఆయన కన్న కలను వెండితెరపై ఆవిష్కరించి బిగ్ హిట్ సాధించడమే ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని చిత్ర బృందం భావిస్తోంది.
'దసరా', 'ది గర్ల్‌ఫ్రెండ్' చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ దీక్షిత్ శెట్టి ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించారు. ఆయనతో పాటు ఈ చిత్రం ద్వారా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల సోదరుడు శశి ఓదెల నటుడిగా అరంగేట్రం చేస్తుండగా, యుక్తి తరేజ హీరోయిన్ గా నటించింది.
ఈ మూడు పాత్రల చుట్టూ తిరిగే ప్రేమ, స్నేహం, నమ్మకద్రోహం అనే కోణాలు ప్రేక్షకులకు ఒక అద్భుతమైన థ్రిల్‌ను అందించనున్నాయి. సెన్సార్ బోర్డ్ నుంచి ఈ చిత్రానికి 'A' సర్టిఫికేట్ లభించింది. 1 గంట 50 నిమిషాల వ్యవధితో వేగంగా సాగే కథనం, రా అండ్ రస్టిక్ యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను సీట్ల అంచులపై కూర్చోబెడతాయని చిత్రబృందం ధీమా వ్యక్తం చేస్తోంది.
ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ ఎస్‌ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మించారు. 'కేడీ' సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన సందీప్ రెడ్డి వంగా.. దర్శకుడు KK కోసం ఈ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొనడం విశేషం.
ట్రైలర్ ఆకట్టుకోవడంతో యాక్షన్ లవర్స్ లో 'KJQ'పై మంచి బజ్ క్రియేట్ అయింది. 1990ల క్రైమ్ ప్రపంచంలోకి ప్రేక్షకులను తీసుకెళ్లే ఈ భావోద్వేగ యాక్షన్ థ్రిల్లర్ థియేటర్లలో ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
KJQ Movie, Director Kiran Kumar, King Jackie Queen






