నయన్‌కి విలన్‌గా సుదీప్
on Jun 23, 2021
ఒకవైపు స్టార్ హీరోల చిత్రాల్లో నటిస్తూనే.. మరోవైపు ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్స్ తో ఎంటర్టైన్ చేస్తోంది లేడీ సూపర్ స్టార్ నయనతార. ప్రస్తుతం సూపర్ స్టార్ రజినీకాంత్ కి జంటగా `అణ్ణాత్తే`లోనూ, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతికి జోడీగా `కాత్తువాక్కుల రెండు కాదల్` చిత్రంలోనూ నటిస్తోంది నయన్. ఈ రెండు కూడా తమిళ సినిమాలే కావడం విశేషం. మరోవైపు ఆమె ప్రధాన పాత్రలో నటించిన హారర్ థ్రిల్లర్ `నెట్రిక్కన్` త్వరలోనే ఓటీటీలో సందడి చేయడానికి సిద్ధమవుతోంది.
ఇదిలా ఉంటే.. నయన్ తాజాగా పేషన్ స్టూడియోస్ తో రెండు సినిమాలకు ఒప్పందం కుదుర్చుకుందట. ఈ రెండు చిత్రాల్లోనూ అభిషేక్ పిక్చర్స్ భాగస్వామ్యం కూడా ఉందని సమాచారం. కాగా, ఇందులో ఒక సినిమాని నూతన దర్శకుడు టేకప్ చేయనున్నాడట. అంతేకాదు.. ఇందులో నయన్ తో పాటు మరో రెండు ప్రధాన పాత్రలు కూడా ఉంటాయని బజ్. పురుష పాత్రలైన ఈ వేషాల్లో ప్రముఖ నటులే కనిపిస్తారని వినికిడి. అందులో ఒకరిగా, విలన్ పాత్రలో కన్నడ నటుడు కిచ్చా సుదీప్ కనిపించబోతున్నాడని టాక్. `ఈగ`తో పాటు పలు కన్నడేతర చిత్రాల్లో ప్రతినాయకుడిగా నటించిన సుదీప్.. కథ నచ్చడంతో ఈ ప్రాజెక్ట్ కి వెంటనే ఓకే చెప్పాడని అంటున్నారు. మరి.. ఈ ప్రచారంలో నిజమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.