"ఖైదీ నెం" 150 టీజర్ రివ్యూ..
on Aug 22, 2016

బాస్ ఈజ్ బ్యాక్... అవును, బిగ్ బాస్ వచ్చేశాడు! 2007 తరువాత తొమ్మిదేళ్ల వన వాసం ముగించుకుని పదో ఏట మరోసారి తమ్ముళ్ల ముందుకు వచ్చేశాడు! తన 37 ఏళ్ల కెరీర్లో ఎప్పుడూ పది నెలలు కూడా గ్యాప్ తీసుకోని చిరు పది సంవత్సరాలు అభిమానులకి దూరంగా వున్నాడు. అయితే, రాజకీయంగా ఆయన పర్ఫామెన్స్ ఎలా వున్నా అన్నయ్య తిరిగి సిల్వర్ స్క్రీన్ ని రఫ్పాడించాలని తమ్ముళ్లు మాత్రం కోరుకుంటూనే వున్నారు. అంతే కాదు, చిరంజీవి 150వ సినిమా కావాలని అమితాబ్ బచ్చన్, రజినీకాంత్ లే మనసు విప్పారు. అందుకే, ఖైదీ ఈజ్ బ్యాక్... కాని, ఈసారి నెంబర్ మారింది! 786 బదులు 150 అయిపోయాడు! ఖైదీ నెంబర్ 150 టీజర్ అదిరిపోయిందనే చెప్పాలి...
జనం, మీడియా అంతా ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిరు 150వ సినిమా టీజర్ తొలి సారి కొణిదెల ఇంటిపేరుని తెర కెక్కించింది. రామ్ చరణ్ తన కొత్త బ్యానర్ కొణిదెల ప్రొడక్షన్ కంపెనీకి తమ ఆరాధ్య దైవం హనుమంతుడ్నే లోగోలో ఎంచుకున్నాడు! కొణిదెల సురేఖ సమర్పించు అంటూ రామ్ చరణ్ తల్లి పేరు కూడా తెరపైకి తెచ్చారు. అయితే, ఈ టీజర్ అసలు హైలైట్ చిరుని నూటాయాభయ్యవ సినిమా చేయమని బిగ్ బి కోరటం! అలాగే, తలైవ రజినీకాంత్ కూడా చిరంజీవిని సినిమా చేయమనటం టీజర్లో కలిపారు!
149 చిత్రాల పోరాట యోధుడు, 37 ఏళ్ల పాటూ కొనసాగుతూ వస్తోన్న చక్రవర్తి, లక్షలాది గుండెల్ని గెలుచుకున్నవాడు అంటూ భారీ ఇంట్రో ఇచ్చిన ఖైదీ నెంబర్ 150 మూవీ టీజర్ చివర్లో మెగాస్టార్ లుక్ రివీల్ చేసింది...
మగధీర, బ్రూస్ లీ సినిమాల్లో ఇలా కనిపించి అలా మాయమైపోయిన చిరు ఫుల్ లెంగ్త్ లో రెండున్నర గంటల సేపు ఎప్పుడు కనిపిస్తాడా అని ఎదురు చూస్తున్న అభిమానులకి ఈ నిమిషం కంటే తక్కువ సేపున్న టీజర్ మంచి బర్త్ డే గిఫ్టే! కాకపోతే, మెగా ఫ్యాన్స్ కాని వారికి మాత్రం ఇందులో పెద్దగా ఏం లేదనే చెప్పాలి! చిరంజీవి సినిమాలో ఎలా కనిపిస్తారన్న ఫస్ట్ లుక్ లాంటిదేం ఇందులో చూపించలేదు. అది తెలియాలంటే పూర్తి స్తాయి ట్రైలర్ వచ్చేదాకా ఓపిక పట్టాల్సిందే...
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



