ENGLISH | TELUGU  

'ఖైదీ' మూవీ రివ్యూ

on Oct 25, 2019

 

తారాగణం: కార్తీ, నరైన్, జార్జి మరియన్, రమణ

బేనర్: డ్రీమ్ వారియర్ పిక్చర్స్

తెలుగు విడుదల: కె.కె. రాధామోహన్ (శ్రీ సత్యసాయి ఆర్ట్స్)

సంగీతం: శ్యామ్ సి.ఎస్.

సినిమాటోగ్రఫీ: సత్యన్ సూర్యన్

ఎడిటింగ్: ఫిలోమిన్ రాజ్

ఫైట్స్: అన్బరివ్

నిర్మాతలు: ఎస్.ఆర్. ప్రకాశ్‌బాబు, ఎస్.ఆర్. ప్రభు, తిరుప్పూర్ వివేక్

దర్శకత్వం: లోకేశ్ కనకరాజ్

విడుదల తేదీ: 25 అక్టోబర్ 2019

 

కొన్ని రోజులుగా 'ఖైదీ' సినిమా గురించిన ప్రచారం తెలుగునాట నడుస్తూ వచ్చింది. హీరోయిన్, పాటలు లేకుండా ఒక భిన్న తరహా సినిమా అనీ, అంత దాకా కూతురి ముఖం చూడని ఖైదీ, ఆమెను చూడ్డానికి పడే తపన ఈ సినిమాలో కనిపిస్తుందనీ చెప్పుకుంటూ రావడంతో సీరియస్ సినిమాల్ని ఇష్టపడే ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడింది. కార్తీకి కొంత కాలంగా సక్సెస్ ముఖం చాటేయడంతో, ఈ సినిమాతోనైనా అతను మళ్లీ ప్రేక్షకుల ఆదరణ పొందుతాడా అనే సందేహం నేపథ్యంలో వచ్చిన 'ఖైదీ' ఎలా ఉందంటే...

కథ

యావజ్జీవ శిక్ష పడిన ఢిల్లీ (కార్తీ) అనే ఒక ఖైదీ తన సత్ప్రవర్తన కారణంగా పదేళ్ల జైలు జీవితం తర్వాత విడుదల అవుతాడు. వెళ్లే ముందు అతని భార్య నిండు చూలాలు. ఆడపిల్లను ప్రసవించి ఆమె చనిపోయిందనే సమాచారం అతనికి అందుతుంది. జైలు నుంచి బయటకు రాగానే కూతుర్ని చూడాలని ఆరాటపడతాడు ఢిల్లీ. కానీ అతను రాత్రివేళ అనుమానాస్పద వ్యక్తిగా కనిపించేసరికి పోలీసులు అదుపులోకి తీసుకుంటారు. అప్పుడే ఎస్పీ అరుణ్‌కుమార్ (నరైన్) తన టీంతో 900 కిలోల డ్రగ్స్‌ను పట్టుకుని ఎస్పీ ఆఫీసు కాంపౌండులో ఎవరికీ తెలీని చోట దాచిపెడతాడు. దాంతో ఆ డ్రగ్స్‌ను స్మగుల్ చేస్తున్న కిరాతక ముఠా రంగంలోకి దిగి, పోలీసుల్ని చంపైనా దాన్ని చేజిక్కించుకోవాలనుకుంటుంది. తమ కోవర్టు అయిన ఒక పోలీసాఫీసర్‌తో పార్టీ చేసుకుంటున్న పోలీసులు తాగే మందులో, తిండిలో ప్రమాదకర డ్రగ్‌ను కలిపేలా చేస్తుంది. అవి సేవించిన ఐజీ సహా పోలీసాఫీసర్లంతా ప్రాణాపాయ స్థితిలో పడిపోతారు. బయటి ప్రపంచానికి తెలీకుండా తన సహ పోలీసుల్ని రక్షించుకోవడానికి ఎస్పీకి ఒక లారీ డ్రైవర్ కావాల్సి వస్తాడు. అప్పుడతనికి ఢిల్లీయే దిక్కవుతాడు. మొదట ఢిల్లీ దీనికి ఒప్పుకోడు. తాను తన కూతుర్ని చూడ్డానికి పోతుంటే పట్టుకున్నారని బెట్టు చేస్తాడు. ఈ సహాయం చేస్తే, అతని కూతురికి మంచి భవిష్యత్తు ఉండేలా ఏర్పాటు చేస్తానని ఢిల్లీకి హామీ ఇస్తాడు అరుణ్. అప్పుడు ఒప్పుకుంటాడు ఢిల్లీ. అతను తన పనిని ఎలా నిర్వర్తించాడు? ఈ క్రమంలో తను ప్రాణాల మీదికి ఎలా తెచ్చుకున్నాడు? కూతుర్ని చూడాలనే అతని ఆరాటం తీరిందా?.. అనేది మిగతా కథ.

విశ్లేషణ

'ఖైదీ' అనేది ఒక రాత్రివేళ 4 గంటల వ్యవధిలో నడిచే కథ. ఈ కథలో ఒకటికి మించిన ప్రధానాంశాలు ఉన్నాయి. అంతదాకా తాను చూడని కూతుర్ని చూసుకోవాలని ఢిల్లీ పడే తపన, ప్రాణాపాయ స్థితిలో ఉన్న తోటి పోలీసు అధికారుల్ని బయటి ప్రపంచానికి తెలీకుండా 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న హాస్పిటల్‌కు చేరవేసి, వాళ్లను రక్షించుకోవాలనే ఎస్పీ అరుణ్‌కుమార్ ఆరాటం, అదే సమయంలో తాము పట్టుకున్న డ్రగ్స్‌ను స్మగ్లర్లకు అందకుండా చేయాలనే పట్టుదల కనిపిస్తాయి. ఇది పూర్తిగా కథనం మీద ఆధారపడిన సినిమా. సినిమా మొదలైన 5వ నిమిషానికల్లా.. ఆ తర్వాత ఏం జరగబోతోందనే టెన్షన్ మనలో మొదలైపోతుంది. అంత గ్రిప్పింగ్‌గా కథను నడిపాడు డైరెక్టర్ లోకేశ్ కనకరాజ్. ఢిల్లీ క్యారెక్టరైజేషన్‌ను అతను చాలా బాగా చిత్రించాడు. సినిమాలో మనకు పాటలు లేని లోటు కలగలేదంటే, అది స్క్రీన్‌ప్లే మహిమే! కథకు కూతురి సెంటిమెంట్‌ను అతడు జోడించిన విధానం, అనాథ శరణాలయంలో పెరుగుతున్న పదేళ్ల ఆ పిల్ల.. తనను చూసుకోడానికి మరుసటి రోజు ఉదయం ఒక వ్యక్తి వస్తున్నాడని తెలిసి, కంటిమీద కునుకులేకుండా ఎదురుచూసే తీరు.. హృదయాల్ని స్పృశిస్తుంది. ఢిల్లీ, అరుణ్‌కుమార్‌తో పాటు తాము వెళ్లాల్సిన రూటు చెప్పడానికి లారీ క్యాబిన్‌లో ప్రయాణించే యువకుడి పాత్రతో ఎంటర్‌టైన్‌మెంట్ పుట్టించాడు దర్శకుడు. ఆ వినోదం కూడా కథలో భాగంగా మిళితమైపోయింది. ఆద్యంతం రియలిస్టిక్ అప్రోచ్‌తోటే కథ నడవడం ముచ్చటేస్తుంది. ఎస్పీ ఆఫీసులో డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ నలుగురు కుర్రాళ్లు, వాళ్లను విడిపించడానికి వచ్చిన వాళ్ల స్నేహితురాలిని కిరాతకులైన స్మగ్లర్ల నుంచి కాపాడ్డానికి నెపోలియన్ (జార్జి మరియన్) అనే అత్యంత నిజాయితీపరుడైన పోలీసు తన ప్రాణాల్ని అడ్డుపెట్టే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ప్రి క్లైమాక్స్ ముందు కథ రొటీన్ క్లైమాక్స్‌లోకి వెళ్తుందా.. అనే సందేహం వస్తుంది.. మన ఊహ తప్పని దర్శకుడు నిరూపించాడు. సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ, శ్యామ్ సి.ఎస్. బ్యాగ్రౌండ్ స్కోర్ దర్శకుడి విజన్‌కు బలమైన సపోర్టునిచ్చాయి. అన్బరివ్ సమకూర్చిన యాక్షన్ సీన్లు గగుర్పాటు కలిగిస్తాయి. అలాంటి యాక్షన్ సీన్‌కు సంబంధించిన ఒక కీలక పాయింట్‌ను ఉపేక్షించడం స్క్రీన్‌ప్లేలో దొర్లిన ఒక లోపం. 

ప్లస్ పాయింట్స్
గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే
కార్తీ పోషించిన ఢిల్లీ క్యారెక్టరైజేషన్
కూతురి సెంటిమెంట్
యాక్షన్ ఎపిసోడ్స్
సినిమాటోగ్రఫీ, బ్యాగ్రౌండ్ స్కోర్
క్లైమాక్స్ 

మైనస్ పాయింట్స్
ఎక్కువమంది ప్రేక్షకులు ఆశించే రొమాంటిక్ యాంగిల్ మిస్సవడం
డైలాగ్స్‌లో తప్పితే ఎంటర్‌టైన్‌మెంట్ సీన్లు లేకపోవడం
కాస్త బలహీనంగా అనిపించే ప్రి క్లైమాక్స్

నటీనటుల అభినయం
ఢిల్లీ పాత్రలో కార్తీ పర్ఫెక్ట్ క్యాస్టింగ్ అనిపించుకున్నాడు. అల్లరి ఆవారా పాత్రలే కాదు.. ఒక కూతురికి తండ్రిగా సీరియస్ రోల్స్ కూడా చెయ్యగలనని నిరూపించుకున్నాడు. పలు సన్నివేశాల్లో అతని హావభావాల్లో ఎంతో పరిణతి కనిపిస్తుంది. సెంటిమెంట్ సీన్లతో హృదయాల్ని తడి చేశాడు. ఎస్పీ అరుణ్‌కుమార్‌గా కీలకమైన పాత్రలో నరైన్ ఒదిగిపోయాడు. కథకు సపోర్టుగా నిలిచాడు. అమాయకంగా డైలాగ్స్ చెబుతూ నవ్వించే కుర్రాడి పాత్ర చేసిన నటుడు ఆ కేరెక్టర్‌కు సరిపోయాడు. ఎస్సై నెపోలియన్‌గా జార్జి మరియన్ నటనకు చప్పట్లు పడతాయి. ఢిల్లీ పదేళ్ల కూతురిగా చేసిన పాప తన అమాయకంపు చూపులు, మాటలతో ఆకట్టుకుంది. డ్రగ్ మాఫియాలో కీలక వ్యక్తులుగా చేసినవాళ్లంతా క్రూరత్వాన్ని పరిధుల మేరకు ప్రదర్శించారు.

తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్
ప్రాణాపాయ స్థితిలో ఉన్న పోలీసాఫీసర్లను రక్షించడమనే మానవీయ కోణం, కన్న కూతురి మొహం చూసుకోవాలని తపించే తండ్రి సెంటిమెంట్ కోణం, డ్రగ్స్‌ను స్మగ్లర్లకు అందకుండా చెయ్యాలనే సామాజిక కోణం.. కలిపి రంగరించి ఒక చక్కని వీక్షణానుభవాన్ని అందించే సినిమా 'ఖైదీ'.

రేటింగ్: 3.5/5

- బుద్ధి యజ్ఞమూర్తి

 


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.