కన్నప్ప మూవీ రివ్యూ
on Jun 27, 2025
తారాగణం: విష్ణు మంచు, ప్రభాస్, మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, ప్రీతి ముకుందన్, ఆర్. శరత్‌కుమార్, బ్రహ్మానందం, సప్తగిరి, శివబాలాజీ, మధుబాల తదితరులు
సంగీతం: స్టీఫెన్ దేవస్సీ, మణిశర్మ
డీఓపీ: షెల్డన్ చౌ
ఎడిటర్: ఆంథోనీ
ప్రొడక్షన్ డిజైనర్: చిన్నా
కథ, కథనం: మంచు విష్ణు
దర్శకత్వం: ముకేశ్ కుమార్ సింగ్
నిర్మాత: మోహన్ బాబు
బ్యానర్స్: ఏవీఏ ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ
విడుదల తేదీ: జూన్ 27, 2025
మంచు విష్ణు, మోహన్ బాబు, ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పాన్ ఇండియా మూవీ 'కన్నప్ప' ఈ రోజు థియేటర్స్ లో అడుగుపెట్టింది. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం. (Kannappa Movie Review)
కథ:
తిన్నడు(మంచు విష్ణు) అడవిలో నివసించే ఒక తెగకి చెందిన వ్యక్తి. చిన్నతనం నుంచి దేవుడు లేడనే నమ్మకాన్ని పెంచుకుంటాడు. మహాదేవ శాస్త్రి(మోహన్ బాబు) స్వర్ణముఖి నది తీరంలో ఎవరకి తెలియని ఒక రహస్య ప్రదేశంలో వాయులింగాన్ని పూజిస్తూ ఉంటాడు. వాయులింగాన్ని దక్కించుకోవాలని కాలముఖ(అర్పిత్ రంక) తన వేలాది మంది సైన్యంతో ప్రయత్నిస్తాడు. వాళ్ళ ప్రయత్నాన్ని తిన్నడు తిప్పికొడతాడు. ఆ తర్వాత కైలాసంలో ఉన్న పరమేశ్వరుడు తన మనిషిగా రుద్ర(ప్రభాస్) ని తిన్నడు వద్దకు పంపించి ఒక రహస్యాన్ని చెప్తాడు. దేవుడు లేడని నమ్మే తిన్నడు ఎందుకు వాయులింగాన్ని కాపాడాడు? అసలు చిన్న వయసులోనే దేవుడు లేడనే నమ్మకాన్ని పెంచుకోవడానికి కారణం ఏంటి? తిన్నడు వద్దకి పరమేశ్వరుడు రుద్రని ఎందుకు పంపించాడు? రుద్ర ఏం చేసాడు? తిన్నడి వ్యక్తి గత జీవితంతో పాటు గత జన్మ రహస్యం ఏంటి? కన్నప్ప గా తిన్నడు ఎందుకు మారాడు? అనేదే ఈ చిత్ర కథ.
ఎనాలసిస్:
ఇలాంటి చారిత్రాత్మక కథని నేటి తరం ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన మోహన్ బాబు, విష్ణు లని అభినందించాలి. సినిమా చూస్తున్నంతసేపు శ్రీ కాళహస్తీశ్వరుడి పరమ భక్తుడైన కన్నప్ప చరిత్రని, అయన తిరుగుతున్న కాలంలోకి వెళ్లి చూస్తున్నట్టుగా అనిపించింది. ఫస్ట్ హాఫ్ లో తిన్నడు చిన్నతనంతో పాటు, దేవుడు లేడని బలంగా వాదించడంలో వచ్చిన సీన్స్ అన్ని చాలా బాగా వచ్చాయి. ఇష్టపడిన ప్రేయసి 'నెమలి' తో వచ్చే లవ్ సీన్స్ , గూడెం ప్రజలకి ఆపద వస్తే, వేరే గూడెం వాళ్ళని కూడా కలుపుకొని ఎంత వరకైనా పోరాడే తత్వంతో సినిమా పై ఆసక్తి పెరిగింది. తండ్రికి, తిన్నడు కి మధ్య వచ్చే సీన్స్ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఇంటర్వెల్ సమయానికి ముందు దేవుడు లేడని తిన్నడు పెద్ద గొడవ చెయ్యడం, దీంతో తిన్నడు ని తండ్రి గూడెం నుంచి పంపించెయ్యడంతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. సెకండ్ హాఫ్ లో కథనంలో మరింత వేగం పెరిగింది. అద్భుతమైన స్క్రీన్ ప్లే తో మ్యాజిక్ చేసారు. 'రుద్ర' గా ప్రభాస్ ఎంట్రీ ఇవ్వడంతో సినిమా రూపు రేఖలు మారిపోయాయి. కన్నప్ప కి అదనపు బలాన్ని ఇచ్చాయి.రుద్ర క్యారక్టర్ ఉన్నంత సేపు గూస్ బంప్స్ వచ్చాయి. మహాదేవ శాస్త్రి సీన్స్ కూడా సినిమాకి మంచి హెల్ప్ అవ్వడంతో పాటు, ఆ పాత్ర యొక్క ఔన్నత్యం బాగుంది. యుద్దానికి సంబంధించి వచ్చిన యాక్షన్ సన్నివేశాలు మాత్రం ఇంకాస్త బాగా తెరకెక్కించాల్సింది. శ్రీ కాళ హస్తీశ్వరుడి పై తిన్నడు భక్తి పెంచుకున్న తర్వాత తన భక్తికి సంబంధించి కొన్ని సీన్స్ ని కూడా చూపించాల్సింది. వెంటనే క్లైమాక్స్ కి వచ్చారు. క్లైమాక్స్ మాత్రం ప్రతి ఒక్కరిని కంట తడి పెట్టిస్తుంది.
నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు:
కన్నప్ప క్యారక్టర్ లో మంచు విష్ణు నటించాడు అనే కంటే జీవించాడని చెప్పవచ్చు. చరిత్ర ఆధారాల ప్రకారం కన్నప్ప క్యారక్టర్ కి సంబంధించి ఎన్ని ఎలివేషన్స్ ఉంటాయో, వాటన్నింటిలోను సూపర్ గా నటించాడు. క్లైమాక్స్ లో అయితే విష్ణు నటన నభూతో న భవిష్యతి. రుద్రగా ప్రభాస్ నటన కూడా సూపర్ గా ఉంది. పరమేశ్వరుడు పంపించిన నిజమైన దూత లాగే చేసి కన్నప్ప కి ఒక సరికొత్త లుక్ వచ్చేలా చేసాడు. మహాదేవ శాస్త్రి గా మోహన్ బాబు,శివుడిగా అక్షయ్ కుమార్, కన్నప్ప తండ్రిగా చేసిన శరత్ కుమార్, మధుబాల, కాజల్, హీరోయిన్ పాత్ర దారి ప్రీతి ముకుందన్ ఇలా అందరు తమ తమ పాత్రల్లో జీవించారు. దర్శకత్వం కూడా చాలా బాగుంది.కొన్ని షాట్స్ అయితే మైండ్ బ్లోయింగ్. విజువల్ గా కూడా కన్నప్ప తన రేంజ్ ని పెంచుకుంది. ఆ స్థాయిలో ఫొటోగ్రఫీ ఉంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్, కూడా రిపీట్ గా వినేలా ఉన్నాయి.ప్రతి ఒక్క డైలాగ్ ఆలోచింపచేసే విధంగా ఉండటంతో పాటు కన్నప్ప ని ప్రేక్షకులకి మరింత దగ్గర చేసింది. నిర్మాణ విలువలు చూస్తే కళ్ళు చెదరాల్సిందే. అంత బాగా ఉన్నాయి.
ఫైనల్ గా చెప్పాలంటే.. కథ, కథనాలు, నటీనటుల పెర్ ఫార్మెన్స్, దర్శకత్వం, మాటలు, ఫొటోగ్రఫీ ఇలా అన్ని 'కన్నప్ప' కి చక్కగా కుదిరాయి. నేటి తరానికి కావాల్సిన విధంగా ' కన్నప్ప' తెరకెక్కడం ప్రత్యేకమైన స్పెషాలిటీ.
రేటింగ్: 3/5
- అరుణాచలం

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
