కన్నప్ప దెబ్బకు కుబేర కుదేలు!
on Jun 27, 2025
హిట్ టాక్ తెచ్చుకొని కూడా కొన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్యూర్ గా మిలిగిపోతాయి. తాజాగా ఆ లిస్టులో 'కుబేర' కూడా చేరేలా ఉంది. ఓ రకంగా దానికి కారణం 'కన్నప్ప' అని చెప్పవచ్చు.
నాగార్జున, ధనుష్, రష్మిక ప్రధాన పాత్రల్లో శేఖర్ కమ్ముల రూపొందించిన చిత్రం 'కుబేర'. జూన్ 20న విడుదలైన ఈ మూవీ మొదటి షో నుంచే పాజిటివ్ సొంతం చేసుకుంది. మొదటి వారంలోనే రూ.100 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరింది. అలాంటిది ఇప్పుడు ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధిస్తుందా లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కుబేర రూ.65 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసింది. బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రూ.66 కోట్లకు పైగా షేర్ రాబట్టాల్సి ఉంది. కానీ, ఇప్పటిదాకా రూ.54 కోట్లకు పైగా షేర్ రాబట్టింది. హిట్ స్టేటస్ దక్కించుకోవాలంటే మరో రూ.12 కోట్ల దాకా షేర్ కలెక్ట్ చేయాలి. ఈ సినిమాకి వచ్చిన పాజిటివ్ టాక్ కి.. సెకండ్ వీకెండ్ ఆ మొత్తం రాబట్టడం పెద్ద కష్టం కాదు. కానీ, ఇప్పుడు కన్నప్ప రూపంలో బిగ్ షాక్ తగిలింది.
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా రూపొందిన 'కన్నప్ప' నేడు(జూన్ 27) థియేటర్లలో అడుగుపెట్టింది. ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ వంటి స్టార్స్ భాగమైన ఈ మూవీ.. పాజిటివ్ టాక్ తెచ్చుకొంది. తెలుగునాట బుకింగ్స్ ఓ రేంజ్ లో ఉన్నాయి. ఈ వీకెండ్ లో కన్నప్ప బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తుంది అనడంలో సందేహం లేదు. అదే ఇప్పుడు కుబేర పాలిట శాపంగా మారేలా ఉంది.
తమిళ హీరో ధనుష్ నటించినప్పటికీ.. కుబేరకు తమిళనాట పెద్దగా ఆదరణ లేదు. మెజారిటీ కలెక్షన్స్ తెలుగు వెర్షన్ నుంచే వస్తున్నాయి. తెలుగు వసూళ్లే ఈ సినిమాని గెట్టెక్కిస్తాయి అనుకుంటున్న సమయంలో కన్నప్ప ఎంట్రీ వచ్చింది. పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ వేట సాలిడ్ గా స్టార్ట్ చేసింది. ఇది కుబేర కలెక్షన్స్ పై తీవ్ర ప్రభావం చూపే అవకాశముంది. అదే జరిగితే ఇక కుబేర బ్రేక్ ఈవెన్ సాధించడం కష్టమే.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
