ప్రముఖ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ తన వ్యక్తిత్వ, ప్రచార హక్కుల పరిరక్షణ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన పేరు, ఫొటో, గొంతును అనుమతి లేకుండా ఉపయోగించడంతో పాటు ఫేక్ న్యూస్, ఏఐ సాయంతో రూపొందిస్తున్న కంటెంట్ వల్ల తన ప్రతిష్ఠకు భంగం కలుగుతోందని ఆమె పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు ప్రతివాదులకు సమన్లు జారీ చేసింది.
కంగనా తరఫున న్యాయవాది సాకేత్ సిక్రీ కోర్టులో వాదనలు వినిపిస్తూ.. ఆమెకు సంబంధించిన అభ్యంతరకరమైన పలు వెబ్ లింకులను న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. వీటిలో కొన్ని యానిమేటెడ్ వీడియోలు, మీమ్స్ కూడా ఉన్నాయని కోర్టు గుర్తించింది. అయితే ప్రస్తుతం ఆ కంటెంట్‌ను తొలగించాలని తాము పట్టుబట్టడం లేదని కంగనా తరఫు న్యాయవాది స్పష్టం చేశారు. ఇప్పటికే కోర్టు నోటీసులు అందుకున్న కొందరు ప్రతివాదులు అభ్యంతరకరమైన కంటెంట్‌ను తొలగించినట్లు కూడా తెలిపారు.
ఇరువైపుల వాదనలు విన్న కోర్టు కంగనా పిటిషన్‌పై ప్రతివాదులకు సమన్లు జారీ చేసింది. మధ్యంతర ఉత్తర్వుల కోసం దాఖలు చేసిన దరఖాస్తుపై కూడా నోటీసులు ఇచ్చింది. పిటిషన్ నుంచి కొందరు ప్రతివాదుల పేర్లను తొలగించిన నేపథ్యంలో సవరించిన జాబితాను దాఖలు చేయాలని కంగనా న్యాయవాదిని ఆదేశించింది. ఈ కేసులో తదుపరి విచారణను 2027 ఫిబ్రవరి 3కు వాయిదా వేసింది.
ఇటీవల కాలంలో సెలబ్రిటీలు తమ వ్యక్తిత్వ హక్కుల పరిరక్షణ కోసం కోర్టులను ఆశ్రయించడం పెరుగుతోంది. అమితాబ్ బచ్చన్, అనిల్ కపూర్, రజనీకాంత్, జాకీ ష్రాఫ్ తదితర ప్రముఖుల విషయంలోనూ ఢిల్లీ హైకోర్టు గతంలో కీలక ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఫేక్ న్యూస్, డీప్‌ఫేక్‌లు, ఏఐతో తయారవుతున్న నకిలీ కంటెంట్‌కు వ్యతిరేకంగా కంగనా దాఖలు చేసిన పిటిషన్ ప్రాధాన్యం సంతరించుకుంది.
[Kangana Ranaut, Kangana Ranaut News, Kangana Ranaut Delhi High Court, Kangana Ranaut AI Content, Kangana Ranaut Fake News, Kangana Ranaut Personality Rights, Kangana Ranaut AI Generated Content, Delhi High Court, Kangana Ranaut Lawsuit, Kangana Ranaut Latest News, AI Generated Content, Fake News, Celebrity Personality Rights, Bollywood News, Kangana Ranaut Legal Case]





