దేశద్రోహం కేసు.. కంగనా, రంగోలీకి సమన్లు!
on Oct 21, 2020

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్‌కి కాంట్రవర్సీలు, కేసులు కొత్త కాదు. రైతులను అవమానించేలా ట్వీట్ చేశారని కర్ణాటకలో ఒకరు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసు పెట్టారు. ముంబయ్ మహానగరంలోనూ కంగనా రనౌత్ మీద కొందరు కంప్లయింట్స్ చేశారు. అందులో ఓ కేసు నిమిత్తం విచారణకు హాజరు కావాలని పోలీసులు సమన్లు జారీ చేశారు. అసలు వివరాల్లోకి వెళితే...
ముంబయ్‌లోని బాంద్రా పోలీస్ స్టేషన్‌లో గత వారం కంగనా రనౌత్ సహా ఆమె సోదరి రంగోలీపై దేశద్రోహం కేసు నమోదు అయింది. అక్కా చెల్లెళ్లు ఇద్దరూ మతవిద్వేషాలు చెలరేగేలా, భయాందోళనలు కలిగించేలా వ్యాఖ్యలు చేస్తున్నారని క్యాస్టింగ్ డైరెక్టర్, ఫిట్‌నెస్ ట్రయినర్ మున్నావరలై సయ్యద్ ఫిర్యాదు చేశారు. గత రెండు నెలలుగా హిందీ చలన చిత్ర పరిశ్రమ ప్రతిష్ఠను దిగజార్చేలా వ్యవహరించడంతో పాటు ముంబయ్‌ను పాక్ ఆక్రమిత కాశ్మీర్‌తో కంగనా రనౌత్ పోల్చడాన్ని ఫిర్యాదులో సయ్యద్ పేర్కొన్నారు. ట్విట్టర్‌లో రంగోలీ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఆయన అన్నారు. ఐపీసీ సెక్షన్లు 153ఏ, 295ఏ, 124–ఏ కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ కేసు విచారణలో భాగంగా అక్టోబర్ 26న కంగనా రనౌత్, 27న రంగోలీ ఇన్వెస్టిగేషన్‌కి రావాలని పోలీసులు సమన్లు జారీ చేశారు. గతంలో తనపై ఎఫ్‌ఐఆర్ నమోదు అయినప్పుడు కంగనా రనౌత్ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. సమన్లకు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



