'బింబిసార'.. రూ.45 కోట్లతో కళ్యాణ్ రామ్ పెద్ద రిస్క్!
on Jul 6, 2022
జయాపజయాలతో సంబంధం లేకుండా ప్రయోగాలకు పెద్ద పీట వేస్తుంటాడు నందమూరి కళ్యాణ్ రామ్. నటుడిగా వైవిద్యం చూపించడానికి ఇష్టపడే ఆయన.. ప్రయోగం చేయాలనుకున్న ప్రతిసారి తానే నిర్మాతగా మారి రిస్క్ చేస్తుంటాడు. అలా రిస్క్ చేసి పలుసార్లు చేతులు కాల్చుకున్న కళ్యాణ్ రామ్.. ఇప్పుడు 'బింబిసార'తో మరో పెద్ద రిస్క్ చేస్తున్నాడు.
కళ్యాణ్ రామ్ టైటిల్ రోల్ పోషిస్తున్న మూవీ 'బింబిసార'. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై రూపొందుతోన్న ఈ సినిమాకి మల్లిడి వశిష్ఠ్ దర్శకుడు. ఆగష్టు 5న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ మూవీ ట్రైలర్ ఇటీవల విడుదలై సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. టైం ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సోషియో ఫాంటసీ ఫిల్మ్ రిజల్ట్ పై మూవీ టీమ్ చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. అయితే ఈ మూవీ బడ్జెట్ మాత్రం ఆందోళన కలిగిస్తోంది.
ఇప్పటిదాకా కళ్యాణ్ రామ్ కెరీర్ లో బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ 'పటాస్'. ఈ సినిమా దాదాపు రూ.20 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. అలాంటిది ఇప్పుడు 'బింబిసార' కోసం ఏకంగా రూ.45 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. అంత భారీ బడ్జెట్ కాబట్టే ఇతర ప్రొడ్యూసర్స్ ముందుకు రారని భావించి.. సినిమాపై నమ్మకంతో తన బావమరిదితో కలిసి కళ్యాణ్ రామే సొంతంగా నిర్మించి రిస్క్ చేస్తున్నట్లు సమాచారం. అంటే కళ్యాణ్ రామ్ సేఫ్ అవ్వాలంటే థియేట్రికల్, శాటిలైట్, డిజిటల్ రైట్స్ కలిపి రూ.50 కోట్లు రావాలట.
గతంలో కూడా తాను నటించి, నిర్మించిన 'ఓం'(2013) మూవీ కోసం పెద్ద రిస్క్ చేశాడు కళ్యాణ్ రామ్. ఫస్ట్ ఇండియన్ 3D యాక్షన్ ఫిల్మ్ గా కళ్యాణ్ రామ్ కెరీర్ లో అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఘోర పరాజయం పాలైంది. దీంతో మరోసారి అంత పెద్ద రిస్క్ చేసి కళ్యాణ్ రామ్ తప్పు చేస్తున్నాడా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే 'బింబిసార' విషయంలో కొన్ని పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. 'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్'తో ఇంటర్నేషనల్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్న మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం.కీరవాణి ప్రస్తుతం సెలెక్టెడ్ మూవీస్ చేస్తున్నారు. అలాంటి కీరవాణి ఈ సినిమాకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించడం విశేషం. మొదట ఈ సినిమా చేయడానికి ఆసక్తి చూపని కీరవాణి.. రషెస్ చూసిన వెంటనే చేస్తానని చెప్పారట. అంతేకాదు ఎంతో ఇష్టంగా పనిచేసి తక్కువ రోజుల్లోనే మంచి అవుట్ పుట్ ఇచ్చారట. మరోవైపు మూవీ అవుట్ పుట్ చూసుకొని కళ్యాణ్ రామ్ తో పాటు మూవీ టీమ్ అంతా చాలా కాన్ఫిడెంట్ గా ఉందట. ఇది కళ్యాణ్ రామ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ కావడం ఖాయమని నమ్మకంగా ఉన్నారట.
అలాగే ప్రస్తుతం ఓటీటీ బిసినెస్ కూడా ఉండటం బింబిసారకు కలిసొచ్చే అంశం. ఇటీవల ఓటీటీ సంస్థలు కోట్లకు కోట్లు పెట్టి డిజిటల్ రైట్స్ దక్కించుకుంటున్నాయి. ఆ లెక్కన చూస్తే శాటిలైట్, డిజిటల్ రైట్స్ ద్వారానే రూ.20-25 కోట్లు వచ్చే అవకాశముంది. వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ 25 కోట్లకు అమ్ముడైతే కళ్యాణ్ రామ్ సేఫ్ అయ్యే ఛాన్స్ ఉంది.