బుల్లితెరపై మరో కొత్త షోకి హోస్ట్ గా ఎన్టీఆర్!
on May 4, 2023

ఈ జనరేషన్ లో ఆల్ రౌండర్ గా పేరు తెచ్చుకున్న స్టార్స్ లో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. ఆయన వెండితెరపై విభిన్న పాత్రలు పోషించి మెప్పించగలరు. పాటలు, డ్యాన్స్ లతో అలరించగలరు. అలాగే బుల్లితెరపైనా హోస్ట్ గా తనదైన శైలిలో సత్తా చాటగలరు. తెలుగులో బిగ్ బాస్ షో మొదటి సీజన్ కి ఆయనే హోస్ట్ గా వ్యవహరించారు. ఆ షోలో ఆయన హోస్టింగ్ స్టైల్ కి, ఎనర్జీకి అందరూ ఫిదా అయ్యారు. అలాగే 'ఎవరు మీలో కోటీశ్వరులు' షోని కూడా హోస్ట్ చేసి తన మార్క్ చూపించారు. అయితే ఇప్పుడు ఆయన మరో కొత్త షోతో అలరించడానికి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది.
ఇటీవల పలువురు స్టార్స్ టాక్ షోలతో అలరిస్తున్నారు. ఇప్పుడు ఈటీవీ కూడా ఎన్టీఆర్ హోస్ట్ గా ఓ సరికొత్త టాక్ షోని ప్లాన్ చేస్తుందట. ఎన్టీఆర్ సైతం ఈ షో చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తన 30 వ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ తో పాటు, 'వార్-2' లైన్ లో ఉన్నాయి. 'ఎన్టీఆర్ 30' షూటింగ్ పూర్తయిన తర్వాత వెంటనే మరో సినిమా షూట్ లో జాయిన్ అవ్వకుండా.. కాస్త మూడ్ చేంజ్ కోసం అన్నట్టుగా.. ఈ టాక్ షో కోసం ఎన్టీఆర్ కొన్ని రోజులు కేటాయిస్తాడట. ఈ టాక్ షో మిగతా షోలకు భిన్నంగా కొత్తగా ఉంటుందట. అక్టోబర్-నవంబర్ సమయంలో ఈ షోని షూట్ చేయనున్నారని, ఈ షో కోసం ఎన్టీఆర్ కి భారీ మొత్తం ఆఫర్ చేసినట్లు వినికిడి. మొత్తానికి ఎన్టీఆర్ మళ్ళీ బుల్లితెరపై సందడి చేయనున్నాడనే వార్త ప్రస్తుతం వైరల్ గా మారింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



