Home

»

Latest News

ఎన్టీఆర్‌ను చూడాలనుకున్న అభిమాని.. తారక్ ఇచ్చిన సర్‌ప్రైజ్ వైరల్!

Sep 30, 2026 4:43PM

జూనియర్ ఎన్టీఆర్ తన అభిమానులపై చూపించే ప్రేమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తనను అభిమానించే వారిని కలిసిన ప్రతిసారీ ఎంతో ఆప్యాయంగా పలకరిస్తుంటారు. తాజాగా ఓ దివ్యాంగ అభిమానిని కలిసిన సమయంలో తారక్ చూపించిన అభిమానం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గతంలో ‘దేవర’ రీ-రిలీజ్ సందర్భంగా థియేటర్ వద్ద కనిపించిన ఈ అభిమాని ఎన్టీఆర్‌ను కలవాలనే తన కోరికతో అందరి దృష్టిని ఆకర్షించాడు. అతడు మాట్లాడలేడు, వినలేడు. ఈ విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా అతడిని ప్రత్యేకంగా తన కారవాన్‌లోకి పిలిపించారు.

అభిమాని కారవాన్‌లోకి రాగానే ఎన్టీఆర్ ఎంతో ఆప్యాయంగా అతడిని పలకరించారు. సైగల ద్వారా అతడి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఫొటో దిగే సమయంలో మరో ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ చేతికి గాయం కావడంతో ఆర్మ్ స్లింగ్ ధరించి ఉన్నారు. అయితే అభిమానికి సరిగ్గా దగ్గరగా నిలబడి ఫొటో దిగేందుకు ఆ స్లింగ్ అడ్డుగా ఉంటుందని భావించిన తారక్, దానిని స్వయంగా తొలగించారు. గాయం ఉన్నప్పటికీ ఏమాత్రం వెనుకాడకుండా ఆ అభిమానిని ఆత్మీయంగా కౌగిలించుకున్నారు.

ఎన్టీఆర్ తనను హత్తుకోవడంతో ఆ అభిమాని కూడా ప్రేమగా తారక్‌ను ముద్దాడాడు. దీంతో అక్కడి వాతావరణం ఒక్కసారిగా భావోద్వేగంగా మారింది. చేతికి గాయం ఉన్న సమయంలో కూడా అభిమానిని కలిసేందుకు ప్రత్యేకంగా సమయం కేటాయించడం, ఫొటో కోసం ఆర్మ్ స్లింగ్‌ను తొలగించి మరీ అతడిని హత్తుకోవడం ఇప్పుడు నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇదిలా ఉంటే ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గాయం కారణంగా కొంతకాలంగా పబ్లిక్ ఈవెంట్లకు దూరంగా ఉన్న తారక్, ఈ కార్యక్రమానికి రావడం అభిమానుల్లోనూ ఉత్సాహాన్ని నింపింది. అయితే ఈ ఈవెంట్‌లో ఆయన ఇచ్చిన స్పీచ్‌తో పాటు, తన అభిమానిపై చూపించిన ఆప్యాయతకు సంబంధించిన వీడియోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రత్యేకంగా చర్చనీయాంశంగా మారాయి.

 

 

[Jr NTR, Jr NTR Fan, Jr NTR Differently Abled Fan, NTR Viral Video, Jr NTR Emotional Moment, NTR Fan Viral, Dont Trouble The Trouble Event, Jr NTR Latest News]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com