
ఇచ్చట అన్ని రిపేర్లూ చేయబడును అనే ట్యాగ్ లైన్‌తో వచ్చింది... జనతా గ్యారేజ్. ఈ సినిమా చూశాక మాత్రం.. జనతా గ్యారేజ్‌కే రిపేర్లు అవసరం అనిపించింది సామాన్య ప్రేక్షకులకు. కథ, కథనం, పాత్రల చిత్రణ ఇవేం కొరటాల శివ గత సినిమాల స్థాయిలో లేవు. అయినా సరే..మా సినిమా సూపర్ హిట్టండీ అని చెప్పుకొంటోంది చిత్రబృందం. అక్కడితో ఆగితే ఫర్వాలేదు. కానీ శ్రీమంతుడుని మించిన సినిమా అంటూ కోతలు కోస్తోంది. స్వయంగా దర్శకుడు కొరటాల శివ కూడా అదే మాట అంటున్నాడు. శ్రీమంతుడు కంటే మించిన హిట్టు అంటూ మీడియా ముందు డబ్బా కొడుతున్నాడు. శ్రీమంతుడుతో ఈసినిమాకి పోలికేంటి?? అంటూ మహేష్ ఫ్యాన్స్ నవ్వుకొంటున్నారు. కొరటాల స్వతహాగా రచయిత. ఓ రచయితగా.. శ్రీమంతుడు లోని పాత్రల్లో ఉన్న బలం ఎంతో.. జనతా గ్యారేజ్‌లో ఉన్న బలమెంతో తనకు తెలుసు. వసూళ్ల మాట పక్కన పెడితే.. శ్రీమంతుడు ముందు జనతా తేలిపోవడం ఖాయం. ఇవి తెలిసి కూడా ఆత్మవంచన చేసుకోవడం ఎందుకో అర్థం కాదు. మిర్చి, శ్రీమంతుడు సినిమాల్లో హీరోయిన్ల పాత్రలు బలంగా ఉంటాయి. కానీ జనతాలో అది కనిపించలేదు. ఇద్దరు హీరోయిన్లు ఉన్నా.. వాళ్లు చేసింది సున్నా. ఎన్టీఆర్, మోహన్‌లాల్ మధ్య బలమైన భావోద్వేగాలు పండలేదు. కొత్తగా ఉందిరా... అనిపించుకొన్న సీన్ ఒక్కటీ లేదు. డైలాగ్ రైటర్ గా కూడా కొరటాల ఫ్లాపే. అలాంటప్పుడు ఈ ఆత్మవంచన ఎందుకో మరి.






