అల్లూరిగా రామ్‌చరణ్ ఇంట్రో... అదుర్స్ అంతే!
on Mar 27, 2020

మెగాభిమానులకు ఇంతకు మించిన బర్త్ డే గిఫ్ట్ మరొకటి ఉండదని చెబితే అతిశయోక్తి కాదు. ఈ రోజు (మార్చి 27)న రామ్‌చరణ్ పుట్టినరోజు సందర్భంగా ‘ఆర్‌ఆర్‌ఆర్: రౌద్రం, రణం, రుధిరం’లో ఆయన లుక్ రివీల్ చేస్తూ... టీజర్ విడుదల చేశారు. అయితే ఆలస్యం అయింది కానీ... మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ ఇంట్రడక్షన్ అదిరిపోయింది. అంతే! రాజమౌళి మార్క్ ఎలివేషన్ సీన్లు, టేకింగ్‌కి యంగ్‌టైగర్ ఎన్టీఆర్ గాత్రం తోడవడంతో టీజర్‌కి ఆల్రెడీ బంపర్‌హిట్ రిపోర్ట్స్ వస్తున్నాయి. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్, కొమరం భీమ్‌గా ఎన్టీఆర్ నటిస్తున్న నటిస్తున్న సంగతి తెలిసింది. పోలీస్ అధికారిగా అల్లూరి కనిపిస్తాడని టీజర్‌లో రివీల్ చేశారు. అయితే... అల్లూరిని కొమరం పరిచయం చేయడం విశేషం.
‘ఆడు
కనబడితే నిప్పు కణం నిలబడినట్టు ఉంటది.
కలబడితే యేగుసుక్క ఎగబడినట్టు ఉంటది.
ఎదురువడితే సావుకైనా సెమట ధార కడతది.
ప్రాణమైనా... బందూకైనా... వానికి బాంచన్ అయితది.
ఇంటి పేరు అల్లూరి....
సాకింది గోదారి!
నా అన్న...
మన్నెం దొర...
అల్లూరి సీతారామరాజు’
ఈ డైలాగులను ఎన్టీఆర్ చెబుతుంటే... స్కీన్ మీద నిప్పు కణికలా కండలు తిరిగిన దేహంతో రామ్‌చరణ్ రాక రోమాంచితంగా ఉంది. సెంథిల్ కుమార్ ఫొటోగ్రఫీ అప్పటి వాతావరణంలోకి తీసుకువెళితే... కీరవాణి నేపథ్య సంగీతం 70 సెకన్ల టీజర్ ప్రారంభం కాగానే ఎప్పుడు రామ్ చరణ్‌ను చూస్తామా? అనేలా ఉత్కంఠ పెంచింది. మరోసారి తనకు తానే సాటి అని ఈ టీజర్‌తో రాజమౌళి నిరూపించుకున్నారు. అసలే, ‘బాహుబలి’ తర్వాత రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. ఆ అంచనాలకు తోడు టీజర్ మెగా ఫ్యాన్స్‌తో పాటు తెలుగు సినిమా ప్రేక్షకుల్లోనూ సినిమాపై మరింత అంచనాలు పెంచింది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



