ENGLISH | TELUGU  

‘జైలర్’ మూవీ రివ్యూ

on Aug 10, 2023

సినిమా పేరు: జైలర్
తారాగణం: రజినీకాంత్, రమ్యకృష్ణ, తమన్నా, వసంత్ రవి, మిర్నా మీనన్, యోగిబాబు, సునీల్, అతిథి పాత్రల్లో శివరాజ్‌కుమార్‌, మోహన్ లాల్, జాకీష్రాఫ్‌, నాగబాబు
సంగీతం: అనిరుధ్ రవిచందర్
సినిమాటోగ్రాఫర్: విజయ్ కార్తీక్ కన్నన్
ఎడిటర్: ఆర్. నిర్మల్
రచన, దర్శకత్వం: నెల్సన్ దిలీప్ కుమార్‌
నిర్మాత: కళానిధి మారన్‌
బ్యానర్: సన్ పిక్చర్స్
విడుదల తేదీ: ఆగస్టు 10, 2023 

భాషతో సంబంధం లేకుండా దేశవిదేశాల్లో అభిమానులను సొంతం చేసుకున్న అతి కొద్దిమంది హీరోలలో సూపర్ స్టార్ రజినీకాంత్ ఒకరు. అయితే కొంతకాలంగా ఆయనకు తన స్థాయికి తగ్గ విజయం దక్కలేదు. నెల్సన్ దిలీప్ కుమార్‌ దర్శకత్వంలో రజినీ నటించిన తాజా చిత్రం 'జైలర్'. విడుదలకు ముందు ఈ సినిమాపై అంచనాలు అమాంతం పెరుగుతూ వచ్చాయి. మరి ఈ సినిమా ఆ అంచనాలను అందుకునేలా ఉందా? దీంతోనైనా రజినీకి ఆయన స్థాయి విజయం దక్కుతుందా?..

కథ:
జైలర్ గా రిటైర్ అయిన ముత్తు(రజినీకాంత్) కుటుంబంతో కలిసి సాధారణ జీవితం గడుపుతుంటాడు. అతని కొడుకు అర్జున్(వసంత్ రవి) నిజాయితీగల పోలీస్ అధికారి. తన దూకుడు స్వభావంతో తక్కువ సమయంలోనే డిపార్ట్మెంట్ లో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ ప్రాంతంలో వర్మ(వినాయకన్) అనే ఒక స్మగ్లర్ ఉంటాడు. అతను కొందరు పోలీసుల సహకారంతో పురాతన దేవాలయాల్లోని దేవతా విగ్రహాలు, విలువైన వస్తువులను చోరీ చేసి కోట్ల రూపాయలకు అమ్మేస్తుంటాడు. అలాంటి వర్మని పట్టుకోవడం కోసం అర్జున్ రంగంలోకి దిగుతాడు. ఈ క్రమంలో అర్జున్ కనిపించకుండా పోతాడు. అతను చనిపోయాడని తెలుస్తుంది కానీ కనీసం శవం కూడా దొరకదు. అర్జున్ మరణంతో ముత్తు కుటుంబం ఎంతో బాధలో ఉంటుంది. అప్పటివరకు మృదుస్వభావిలా కనిపించిన ముత్తు.. కొడుకు మరణంతో ఒక్కసారిగా జూలు విదిలిస్తాడు. తన కొడుకు మరణానికి కారణమైన వారిని ఒక్కొక్కరిని వేటాడి చంపుతుంటాడు. ఈ క్రమంలో ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి? అతని కుటుంబం ఎలాంటి సమస్యలు ఎదుర్కొంది? వర్మ సామ్రాజ్యాన్ని ముత్తు అంతం చేయగలిగాడా? ఈ ప్రయాణంలో అతనికి అండగా నిలిచింది ఎవరు? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.

విశ్లేషణ:
సూపర్ స్టార్ ఇమేజ్ ని నమ్ముకొని దర్శకుడు నెల్సన్ తీసిన సినిమా ఇది. పురాతన దేవాలయాల్లోని విగ్రహాల చోరీ సన్నివేశాలతో సినిమా ఎంతో ఆసక్తికరంగా ప్రారంభమైంది. అదే సమయంలో ముత్తు(రజినీకాంత్) కుటుంబాన్ని పరిచయం చేసిన సన్నివేశాలు మెప్పించాయి. ఓ వైపు ముత్తు ఇంట్లో మనవడితో సహా బయట అందరికీ భయపడుతూ ఉంటే.. మరోవైపు అతని కొడుకు అర్జున్ మాత్రం ఎవరికీ భయపడకుండా ఏసీపీగా దూకుడు స్వభావం చూపుతాడు. రజినీకాంత్ పాత్రని మలిచిన తీరు ఆకట్టుకుంది. ప్రధమార్థంలో యాక్షన్ సన్నివేశాలు, రజినీ-యోగి మధ్య కామెడీ ట్రాక్ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్ కట్టిపడేసింది. మొత్తానికి యాక్షన్, ఎంటర్టైన్మెంట్ కలగలిసి ప్రధమార్థం మెప్పించింది.

రజినీకాంత్ పాత్ర, యాక్షన్, ఎంటర్టైన్మెంట్ తో ఫస్టాఫ్ ని ఎంతో చక్కగా నడిపించిన దర్శకుడు నెల్సన్ సెకండాఫ్ లో తడబడ్డాడు. సెకండాఫ్ లో  కూడా యాక్షన్ సన్నివేశాలు వర్కౌట్ అయినప్పటికీ.. అనవసరమైన సన్నివేశాలతో నిడివిని పెంచి అక్కడక్కడా బోర్ కొట్టించాడు. ముఖ్యంగా సునీల్-తమన్నా ట్రాక్ మెప్పించలేకపోయింది. అప్పటివరకు సినిమా ఎంతో ఆసక్తికరంగా నడిచినట్లు అనిపించగా.. ఆ ట్రాక్ తో సినిమా పూర్తిగా గాడి తప్పింది. కామెడీ కూడా ఫస్టాఫ్ స్థాయిలో సెకండాఫ్ లో వర్కౌట్ కాలేదు. అలాగే విలన్ పాత్రని మరింత పవర్ ఫుల్ గా డిజైన్ చేసి ఉండాల్సింది. రజినీకాంత్ లాంటి ఓ సూపర్ స్టార్.. మరో ఇద్దరు సూపర్ స్టార్ల సహకారంతో ఒక విలన్ ని ఢీ కొట్టాలంటే ఆ పాత్ర ఎంత పవర్ ఫుల్ గా ఉండాలి. పైగా ఆ పాత్రని వినాయకన్ పోషించడంతో సూపర్ స్టార్ ముందు తేలిపోయాడు.  సినిమాని ముగించిన తీరు మాత్రం బాగుంది. పతాక సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. ప్రధమార్థం, పతాక సన్నివేశాలు బాగున్నప్పటికీ.. ద్వితీయార్థం గాడి తప్పడంతో సినిమా పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయింది. 

సినిమాకి అనిరుధ్ నేపథ్య సంగీతం ప్రధాన బలంగా నిలిచింది. రజినీకాంత్ స్క్రీన్ ప్రజెన్స్ కి అనిరుధ్ బీజీఎం తోడై సన్నివేశాలు బాగా ఎలివేట్ అయ్యాయి. అయితే అనిరుధ్ స్వరపరిచిన పాటలు మాత్రం పెద్దగా మ్యాజిక్ చేయలేకపోయాయి. విడుదలకు ముందు సోషల్ మీడియాలో ఒక ఊపు ఊపిన కావాలా సాంగ్.. విజువల్ గా స్క్రీన్ మీద పెద్దగా మెప్పించలేకపోయింది. విజయ్ కార్తీక్ కన్నన్ కెమెరా పనితనం ఆకట్టుకుంది. ఎడిటర్ ఆర్. నిర్మల్ సెకండాఫ్ లో కత్తెరకు పని చెప్పి ఉండాల్సింది. సెకండాఫ్ లో కొన్ని సన్నివేశాలను ట్రిమ్ చేసినట్లయితే అవుట్ పుట్ కాస్త బెటర్ గా ఉండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

నటీనటుల పనితీరు:
రజినీకాంత్ ఎప్పటిలాగే తన స్క్రీన్ ప్రజెన్స్, మ్యానరిజమ్స్ తో కట్టిపడేసారు. ముత్తు పాత్రలో ఉన్న వైవిధ్యాన్ని ఆయన చక్కగా ప్రదర్శించారు. సెటిల్డ్ పర్ఫామెన్స్ తో మ్యాజిక్ చేశారు. ముత్తు భార్యగా రమ్యకృష్ణ, కొడుకుగా వసంత్ రవి, కోడలుగా మిర్నా మీనన్ ఆకట్టుకున్నారు. యోగిబాబు ఉన్నంతలో బాగా నవ్వించాడు. అతిథి పాత్రల్లో శివరాజ్‌కుమార్‌, మోహన్ లాల్, జాకీష్రాఫ్‌, నాగబాబు మెప్పించారు. ఈ సినిమాలో తమన్నా ది కూడా అతిథి పాత్ర అన్నట్లే. ఒక పాటకి, రెండు సన్నివేశాలకి పరిమితమైంది. సునీల్ కాస్త కొత్తగా కనిపించాడు కానీ, పెద్దగా నవ్వించలేకపోయాడు.

తెలుగువన్ పర్‌స్పెక్టివ్:
ప్రధమార్థం, పతాక సన్నివేశాలు బాగున్నప్పటికీ.. ద్వితీయార్థం గాడి తప్పడంతో సినిమా పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయింది. ద్వితీయార్థం మీద మరింత శ్రద్ధ పెట్టినట్లయితే సూపర్ స్టార్ కెరీర్ లో ఓ మంచి యాక్షన్ ఎంటర్టైనర్ గా నిలిచేది. అయితే సూపర్ స్టార్ అభిమానులకు మాత్రం ఈ సినిమా నచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

రేటింగ్: 2.75/5

-గంగసాని

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.