అది కళ్యాణ్‌రామ్ చేయి దాటిపోయిందా? అసలు సమస్య ఏంటి?
on Sep 15, 2023
ఒక సినిమా సక్సెస్‌ఫుల్‌గా పూర్తి కావాలంటే టీమ్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఏ ఒక్కరి వల్ల అయ్యేది కాదు. కాకపోతే ఈ విషయంలో హీరో, దర్శకనిర్మాతల మధ్య సఖ్యత ఉంటేనే అది సాధ్యమవుతుంది. కానీ, కొన్ని సినిమాలకు అది సాధ్యం కాదు. యూనిట్ సభ్యుల్లో విభేదాలు రావడం, సినిమా ఆలస్యం కావడం, లేదా మరో విధంగా వార్తల్లోకి ఎక్కడం జరుగుతుంది.
తాజాగా కళ్యాణ్ రామ్ లేటెస్ట్ మూవీ ‘డెవిల్’కి ఆ పరిస్థితే వచ్చింది. నిర్మాత అభిషేక్ నామా, దర్శకుడు నవీన్ మేడారం మధ్య విభేదాలు ఉన్నాయి. ఆ కారణంగానే ఆ సినిమా నుంచి బయటికి వచ్చేశాడు దర్శకుడు నవీన్. ఈ సినిమాను నవంబర్ 24 రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేశారు. ఆమధ్య డైరెక్టర్ పేరు లేకుండా ఓ పోస్టర్‌ని విడుదల చేశాడు నిర్మాత అభిషేక్ నామ. లేటెస్ట్‌గా విడుదలైన పోస్టర్‌లో నిర్మాత, దర్శకుడు అభిషేక్ నామ అని ఉంది. దీంతో ఆగ్రహించిన దర్శకుడు నరేష్ మేడారం ‘వినాశకాలే విపరీత బుద్ధి’ అంటూ ట్వీట్ చేశాడు. అది నిర్మాత అభిషేక్ నామను ఉద్దేశించే చేశాడని అర్థమవుతోంది. అభిషేక్ నామ చేసిన నిర్వాకం పట్ల నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. సినిమాకి సంబంధించిన షూటింగ్ అంతా పూర్తి చేసిన తర్వాత బయటికి వచ్చిన నవీన్ పేరును పూర్తిగా తొలగించడంపై పలు విమర్శలు వస్తున్నాయి.
నందమూరి కళ్యాణ్‌రామ్‌కి దర్శకుల హీరో అనే పేరు ఉంది. మరి ఈ వివాదంలో కళ్యాణ్‌రామ్ జోక్యం చేసుకోలేదా? పరిష్కరించడానికి ప్రయత్నించలేదా? లేక అప్పటికే పరిస్థితి కళ్యాణ్‌రామ్ చేయి దాటిపోయిందా?.. వీటిపై ఒక క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. కళ్యాణ్ రామ్ కెరీర్‌లో ఎంతో మంది డైరెక్టర్లకు మొదటి అవకాశం ఇచ్చాడు. సురేందర్‌రెడ్డి, అనిల్ రావిపూడి, శ్రీవశిష్ట్...ఇలా కళ్యాణ్‌రామ్ పరిచయం చేసిన డైరెక్టర్లంతా టాప్ పొజిషన్‌కి వెళ్ళారు. కొత్త డైరెక్టర్ శ్రీవశిష్ట్ కూడా ఇప్పుడు చిరంజీవి సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. డైరెక్టర్లను అంత బాగా చూసుకునే కళ్యాణ్‌రామ్ సినిమాకే ఈ సమస్య వచ్చిందంటే అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ విషయంలో కళ్యాణ్‌రామ్ కలగజేసుకొని పరిష్కరిస్తే బాగుంటుందని నెటిజన్లు కోరుతున్నారు.
ఇక విజయ్ దేవరకొండ అభిమానులు కూడా అభిషేక్ నామపై గుర్రుగా ఉన్నారు. ఎందుకంటే ఇటీవల విజయ్ దేవరకొండ అభిమానుల కోసం కోటి రూపాయలు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటన రాగానే అభిషేక్ పిక్చర్స్ ఓ ట్వీట్ చేసింది. విజయ్ దేవరకొండ హీరోగా వచ్చి ఫ్లాప్ అయిన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేసిన అభిషేక్ పిక్చర్స్.. అందులో తమకు రూ.7 కోట్లు నష్టం వచ్చిందని, మాకు కూడా సాయం చేసి ఆదుకోవాలి అన్నది ఆ ట్వీట్ సారాంశం. ఈ ట్వీట్ చూసిన విజయ్ అభిమానులు అభిషేక్‌పై విమర్శల వర్షం కురిపించారు. ఇప్పుడు డైరెక్టర్ నవీన్ మేడారం విషయంలో అతను చేసిన పనికి విజయ్ అభిమానులు, నెటిజన్లు అభిషేక్‌పై విరుచుకుపడుతున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



