Ranabaali: విజయ్ 'రణబాలి' మూవీ.. ఆ నవలకు కాపీనా..?
on Jan 27, 2026

'రణబాలి'గా విజయ్ దేవరకొండ
రాయలసీమ నేపథ్యంలో పీరియడ్ డ్రామా
'శప్తభూమి' నవల ఆధారంగా తెరకెక్కుతోందా?
గ్లింప్స్ విడుదలతో సోషల్ మీడియాలో కొత్త చర్చలు!
కొన్నేళ్లుగా ఒక మంచి విజయం కోసం ఎదురుచూస్తున్న విజయ్ దేవరకొండ(Vijay Deverakonda).. 'రణబాలి' అనే ఒక విభిన్న సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. 'టాక్సీవాలా', 'శ్యామ్ సింగరాయ్' వంటి సినిమాలతో ప్రతిభగల దర్శకుడిగా పేరుపొందిన రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వం వహిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా పీరియడ్ డ్రామా.. 'శప్తభూమి' అనే నవలకు ఆధారంగా తెరకెక్కుతోందా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. (Ranabaali)
'రణబాలి' అనేది రాయలసీమ ప్రాంతంలో 19వ శతాబ్దంలో జరిగిన కథతో తెరకెక్కుతోంది. బ్రిటిష్ పాలన కాలంలో కరువుతో అల్లాడుతున్న ప్రాంతంలో.. ప్రాణాలకు తెగించి పోరాడిన యోధుడు 'రణబాలి'గా విజయ్ కనిపిస్తున్నాడు. తాజాగా విడుదలైన గ్లింప్స్ లో గుర్రంపై రౌద్ర రూపంలో విజయ్ కనిపించిన తీరు ఆకట్టుకుంది. అయితే ఇప్పుడు ఈ సినిమాని 'శప్తభూమి' నవలతో పోలుస్తూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. (Saptha Bhoomi)
'శప్తభూమి' అనేది 2017లో ప్రచురితమైన తెలుగు చారిత్రిక నవల. 18వ శతాబ్దపు రాయలసీమ చరిత్ర నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. ఈ నవల 2019లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందటం విశేషం.

రెండూ రాయలసీమ నేపథ్యం కావడం, 'శప్తభూమి' కవర్ ఫోటోని తలపించేలా 'రణబాలి' గ్లింప్స్ లో విజయ్ లుక్ ఉండటంతో.. ఆ నవల ఆధారంగానే ఈ చిత్రం రూపొందుతోందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
'శప్తభూమి' అంటే శాపగ్రస్తమైన భూమి లేదా శపించబడ్డ నేల అని అర్థం. 'రణబాలి' పోస్టర్ లో 'The Legend of the Cursed Land' అని రాసి ఉంది. 'Cursed Land' అంటే శపించబడ్డ నేల అని అర్థం వస్తుంది. దాంతో ఆ నవల ఆధారంగానే 'రణబాలి' తెరకెక్కుతోందని బలంగా వినిపిస్తోంది.
అయితే, 'శప్తభూమి' 18వ శతాబ్దం నాటి కథ కాగా, 'రణబాలి' 19వ శతాబ్దపు కథ. అలాగే 'రణబాలి' గ్లింప్స్ ని గమనిస్తే ఇందులో బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా కథానాయకుడు గర్జించినట్లు కనిపిస్తోంది. 'శప్తభూమి'లో అటువంటి ప్రస్తావన ఉండదు.
మరి 'శప్తభూమి' నవలలోని కొన్ని అంశాలను ప్రేరణగా తీసుకొని 'రణబాలి'ని రూపొందిస్తున్నారా అనే దానిపై.. సినిమా విడుదల తర్వాత కానీ పూర్తి స్పష్టత వచ్చేలా లేదు.
కాగా, 'రణబాలి' సినిమా ఈ ఏడాది సెప్టెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read: అఫీషియల్.. 'దేవర-2' షూటింగ్ కి ముహూర్తం ఖరారు.. రిలీజ్ ఎప్పుడంటే?
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



