
గోవా బ్యూటీ ఇలియానా తనకు ఏది చెప్పాలనిపిస్తే అది చెప్పేస్తుంటుంది. ముక్కుసూటిగా ఏదైనా చెప్పే ఇలియానా మాటలు.. అప్పుడప్పుడు కాస్త వివాదంగా మారుతాయి. ఇప్పుడు ఇల్లీ బ్యూటీ చెప్పింది కూడా అలాగే అర్ధం చేసుకుంటున్నారు కొంతమంది. అసలు సంగతేంటంటే.... కాశ్మీరీ పండిట్లపై జరిగిన ఉగ్రవాద దాడుల్లో నష్టపోయినవారిని ఆదుకోవడానికి శల్లి కుమార్ అనే వ్యక్తి ఛారిటీ కాన్సెర్ట్ ను ఏర్పాటుచేసారు. అమెరికాలోని న్యూజెర్సీలో ఈనెల 15న జరుగబోయే ఈవెంట్ లో పలువురు బాలీవుడ్, టాలీవుడ్ నుండి ప్రముఖులు హాజరవుతున్నారు. అయితే అమెరికా నుండి మాత్రం ఈకార్యక్రమంలో రిపబ్లికన్ పార్టీ నుండి అమెరికా అధ్యక్షబరిలో నిల్చున్న ట్రంప్ కూడా వస్తున్నారు. దీంతో ఈ కార్యక్రమానికి తాను వెళ్లబోనని, అమెరికా రిపబ్లికన్ పార్టీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు మద్దతివ్వనని ప్రముఖ సినీ నటి ఇలియానా డిక్రూజ్ తేల్చి చెప్పింది. కార్యక్రమంలో పాల్గొంటే ట్రంప్ కి సపోర్ట్ చేయడమే అని ఇలియానా చెప్పింది. ఇంకేముంది ఇప్పుడు ఇల్లీ బేబిపై ఒకటే కామెంట్లు మొదలయ్యాయి.. ఒక మంచి కార్యక్రమం జరిగేటప్పుడు అందులో రకరకాల వ్యక్తులు పాల్గొంటారు. వారిలో చెడ్డ వారు ఉండొచ్చు, మంచి వారు ఉండొచ్చు. అంతే కానీ ట్రంప్ వస్తున్నాడని ఆమె కార్యక్రమానికి దూరం కావడం అర్థం లేని విషయమే అంటున్నారు. మొత్తానికి ట్రంప్ గురించి ఇలియానాకు తెలిసిందంటే.. పొలిటికల్ అప్ డేట్స్ కూడా బాగానే ఫాలోఅవుతుందన్నమాట..






