అవును.. వాళ్ళు కాపీ చేశారు.. అజిత్ సినిమాపై కోర్టులో నెగ్గిన ఇళయరాజా!
on Sep 9, 2025
కాపీ రైట్ విషయంలో మొదటి నుంచీ ఇళయరాజా కఠినంగానే వ్యవహరిస్తున్నారు. తను కంపోజ్ చేసిన పాటల్ని వివిధ ప్లాట్‌ఫామ్‌లపై వినియోగించడం పట్ల ఆయనకు అభ్యంతరం ఉంది. అందుకే తన దృష్టికి వచ్చిన దేన్నీ ఆయన ఉపేక్షించడం లేదు. తన పాటలను ఎవరు ఉపయోగించినా వారికి కోర్టు ద్వారా నోటీసులు పంపిస్తున్నారు. ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర వంటి టాప్ సింగర్స్‌ని కూడా ఆయన వదిలిపెట్టలేదు. కాపీరైట్ చట్టంలోని అంశాలను కోర్టు దృష్టికి తీసుకెళ్లడం ద్వారా ఆయన అనేక సందర్భాల్లో విజయం సాధించారు. తాజాగా మరో కేసులో కోర్టు ఇళయరాజాకు అనుకూలంగా తీర్పునిచ్చింది.
వివరాల్లోకి వెళితే.. అజిత్ హీరోగా నటించిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రంపై మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు ఇళయరాజా. తన సంగీతంలో వచ్చిన మూడు పాటలను కాపీ చేసి ఈ సినిమాలో వాడారని ఆయన ఆరోపించారు. ‘నట్టుపుర పట్టు’ చిత్రంలోని ‘ఓథ రుబాయుమ్ థారెన్..’, ‘సకలకళా వల్లవన్’ చిత్రంలోని ‘ఇలమై ఇధో ఇదో..’, ‘విక్రమ్’ చిత్రంలోని ‘ఎన్ జోడి మాంజా కురువి..’ అనే మూడు పాటల్ని ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ కోసం కాపీ చేసారని ఆరోపించారు ఇళయరాజా. విచారణకు స్వీకరించిన హై కోర్టు న్యాయమూర్తి సినిమా ప్రసారాన్ని చట్ట ప్రకారం నిలిపివేయాలని తీర్పునిచ్చారు. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రం ప్రస్తుతం ఓటీటీలో ప్రసారమవుతోంది. తక్షణమే స్ట్రీమింగ్‌ను నిలిపివేయాలని కోర్టు తీర్పునివ్వడంతో నిర్మాతలు షాక్ అవుతున్నారు.
తను క్రియేట్ చేసిన మూడు పాటలతో పాటు ఈ సినిమాను ప్రదర్శించడం, అమ్మడం, పంపిణీ, ప్రచురించడం, ప్రసారం వంటివి చేయకుండా ఆపాలని కోరుతూ పిటిషన్ వేశారు ఇళయరాజా. దీనిపై జడ్జి సెంథిల్‌కుమార్ పైవిధంగా తీర్పునిచ్చారు. ఇళయరాజా ట్యూన్ చేసిన పాటలను వేరొక సినిమాలో వినియోగించడం చట్టాలను ఉల్లంఘించడం కిందికి వస్తుందని జడ్జి వ్యాఖ్యానించారు. ఒక సంగీత దర్శకుడుగా తాను స్వరపరిచిన పాటలను ఏ మాధ్యమంలోనైనా ఉపయోగిస్తే రాయల్టీ పొందే హక్కు ఉంటుందని తనకు ఉంటుందని ఇళయరాజా తన పిటిషన్‌లో పేర్కొన్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



