
చిత్తూరు నగర వాసులకు సినిమా అంటే గుర్తొచ్చే పేరు 'రాఘవ థియేటర్' (Raghava Theatre). దశాబ్దాలుగా వేలాది మంది ప్రేక్షకులను అలరించిన ఈ ఐకానిక్ థియేటర్, ఇప్పుడు చరిత్ర పుటల్లో కలిసిపోతోంది. మారుతున్న కాలం, ఓటీటీల ప్రభావంతో ఈ థియేటర్ తన ప్రస్థానాన్ని ముగించుకోవడం అక్కడి సినీ ప్రేమికులను కలచివేస్తోంది.
ఎన్టీఆర్ చేతుల మీదుగా ప్రారంభం..
1988లో అప్పటి ముఖ్యమంత్రి, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు (NTR) చేతుల మీదుగా ఈ థియేటర్ ప్రారంభమైంది. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు చిత్తూరులో వినోదానికి ఇది చిరునామాగా నిలిచింది. పెద్ద హీరోల సినిమాలు విడుదలయ్యే రోజుల్లో ఇక్కడ ఫ్యాన్స్ చేసే సందడి, కటౌట్లు, పాలాభిషేకలు ఒక పండుగ వాతావరణాన్ని తలపించేవి.
రికార్డులు సృష్టించిన బ్లాక్ బస్టర్ హిట్లు
రాఘవ థియేటర్ కేవలం ఒక సినిమా హాల్ మాత్రమే కాదు, ఎన్నో సంచలన విజయాలకు వేదిక. ఇక్కడ ప్రదర్శితమైన చిత్రాలు సృష్టించిన రికార్డులు సామాన్యమైనవి కావు. శుభలగ్నం 200 రోజులు ప్రదర్శితమై రికార్డు సృష్టించింది. పోకిరి 175 రోజుల పాటు బాక్సాఫీస్ వద్ద తన ప్రతాపాన్ని చూపింది. సీతారామయ్యగారి మనవరాలు, పెళ్లి చేసుకుందాం, అన్నమయ్య, హలో బ్రదర్ వంటి ఎన్నో సినిమాలు ఇక్కడ లాంగ్ రన్ పూర్తి చేసుకున్నాయి. పాత తరం నుండి నేటి తరం వరకు ప్రతి ఒక్కరికీ ఈ థియేటర్‌తో ఒక తీపి జ్ఞాపకం ముడిపడి ఉంది.

ముగిసిన ప్రస్థానం
ప్రస్తుత కాలంలో ఓటీటీలు, మల్టీప్లెక్స్ ల ప్రభావం పెరగడంతో, సింగిల్ స్క్రీన్ థియేటర్ల మనుగడ కష్టతరంగా మారింది. ఈ క్రమంలోనే రాఘవ థియేటర్ యాజమాన్యం దీనిని మూసివేయాలని నిర్ణయించుకుంది. థియేటర్ స్థలాన్ని ఒక ప్రైవేట్ సంస్థకు లీజుకు ఇచ్చినట్లు సమాచారం.
ప్రస్తుతం థియేటర్ కూల్చివేత పనులు జరుగుతున్నాయి. ఈ థియేటర్‌లో ప్రదర్శితమైన చివరి చిత్రం యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన 'దేవర'. ఎన్టీఆర్ చేతుల మీదుగా ప్రారంభమైన ఈ థియేటర్, ఆయన మనవడి సినిమాతో తన ప్రయాణాన్ని ముగించింది.
అభిమానుల కేకలు, ఈలలు, సంతోషాల మధ్య అలరారిన రాఘవ థియేటర్ ఇప్పుడు శిథిలాల కుప్పగా మారుతుండటం చూసి సినీ ప్రియులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చిత్తూరు వాసుల సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ లు పెడుతూ, ఆ థియేటర్ తో ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు.






