అసలైన దొంగలను వదిలేశారు, రవిని అరెస్ట్ చేశారు.. ప్రశ్నిస్తున్న మూవీ లవర్స్!
on Nov 19, 2025
ప్రస్తుతం దేశంలో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఒక విషయం గురించి తీవ్రమైన చర్చ జరుగుతోంది. మీడియాలో, సోషల్ మీడియాలో, ఫిలిం ఇండస్ట్రీలో, సామాన్య ప్రజల్లో.. ఇలా ప్రతి ఒక్కరి నోట ఒకటే మాట.. ఐ బొమ్మ రవి అరెస్ట్. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ టాపిక్ గురించే మాట్లాడుతున్నారు. గత కొంతకాలంగా సినీ పరిశ్రమకు చుక్కలు చూపిస్తున్న రవిని ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు.
రవి భార్య ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారా లేక పోలీసుల కృషి ఫలితంగానే అతను పట్టుబడ్డాడా అనే విషయాలు పక్కన పెట్టేస్తే.. రవి అరెస్టును 90 శాతం ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. అతనికి ప్రజల నుంచి అంత మద్దతు ఎలా లభించింది అనే విషయం చాలా మందికి తెలుసు. కొత్త సినిమాలను అందుబాటులోకి తీసుకు రావడం ద్వారా ప్రేక్షకులకు ఎంతో డబ్బు ఆదా చేశాడని, అతను ఓ రాబిన్‌హుడ్ లాంటి వాడని, పేద ప్రజల పాలిట ఓ వరం లాంటివాడని.. ఇలా రకరకాలుగా అతన్ని అభినందిస్తున్నారు.
వివిధ మాధ్యమాల్లో రవి అరెస్టుపై వెల్లువెత్తిన నిరసనలు, వారు వెలిబుచ్చిన అభిప్రాయాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం. రవిని ప్రజలు ఇలా ఆకాశానికి ఎత్తెయ్యడానికి ప్రధాన కారణం సినీ పరిశ్రమేనని వేల సంఖ్యలో కామెంట్స్ వస్తున్నాయి. సాధారణంగా ఒక క్రిమినల్‌ని అరెస్ట్ చేస్తే ప్రజల నుంచి పోలీసులకు అభినందనలు లభిస్తాయి. కానీ, రవి అరెస్టును మాత్రం దాదాపు అందరూ వ్యతిరేకిస్తున్నారు. సోషల్ మీడియాలో పలువురు చేసిన కామెంట్స్ ప్రకారం.. అసలైన దొంగలను వదిలేసి రవిని అరెస్ట్ చెయ్యడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు.
ఎవరు అసలైన దొంగలు.. అంటే చిత్ర పరిశ్రమలోని వారే అని సమాధానం వస్తోంది. చిత్ర పరిశ్రమ రెండు నాల్కల ధోరణే దీనికి కారణం అని వాదిస్తున్నారు. అయితే వారి మాటల్లోనూ నిజం లేకపోలేదు. ఒక పక్క చిత్ర నిర్మాణం భారంగా మారింది అని చిత్ర నిర్మాతలు తమ బాధను వ్యక్తం చేస్తుంటారు. మరో పక్క హీరోలకు వందల కోట్ల రెమ్యునరేషన్స్ ఇస్తూ బడ్జెట్‌ను అసాధారణ స్థాయికి తీసుకెళ్లిపోతారు. ఆ తర్వాత సినిమా రిలీజ్‌కి వచ్చే సమయానికి ప్రభుత్వాల దగ్గరకు వెళ్ళి టికెట్ రేట్లు పెంచమని ప్రాధేయపడతారు.
నిర్మాతల కన్నీళ్ళకు కరిగిపోయిన ప్రభుత్వాలు టికెట్ రేట్లను అసాధారణ స్థాయిలో పెంచుకునేందుకు అనుమతులిస్తాయి. తద్వారా తాము పెట్టిన పెట్టుబడిని ఒకటి, రెండు వారాల్లోనే దండుకునే పనిలో పడతారు నిర్మాతలు. సినిమాకి ఎంత బడ్జెట్ పెట్టినా దాన్ని తక్షణమే వెనక్కి తెచ్చుకోవాలని చూసే నిర్మాతల ధనదాహానికి సామాన్య ప్రజలు బలైపోతున్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మరోపక్క సింగిల్ థియేటర్స్‌ను ఒక్కొక్కటిగా తగ్గిస్తూ వస్తున్నారు. మల్టీప్లెక్స్ కల్చర్‌ను బాగా పెంచేస్తున్నారు.
ఒక మధ్య తరగతి ప్రేక్షకుడు ఫ్యామిలీతో కలిసి సినిమాకి వెళ్ళలేని పరిస్థితి తీసుకొచ్చాయి మల్టీప్లెక్స్‌లు. టికెట్ ధరకు ఎన్నో అధికంగా అక్కడి స్నాక్స్ రేట్లు ఉండడంతో అక్కడికి వెళ్లాలంటే సగటు ప్రేక్షకులు వణికిపోతున్నారు. నిర్మాతల అవసరానికి టికెట్ రేట్లను పెంచే ప్రభుత్వం.. ప్రజలను పట్టి పీడిస్తున్న మల్టీప్లెక్స్‌లలోని ఫుడ్‌కోర్టుల గురించి, అక్కడి రేట్ల గురించి పట్టించుకోదు. ప్రభుత్వాల సహకారంతో చిత్ర నిర్మాతలు, మల్టీప్లెక్స్‌ల యాజమాన్యాలు సామాన్య ప్రేక్షకులను నిలువునా దోచుకుంటున్నారు.
ఇదీ ఐబొమ్మ రవి ఆవేదన. దాన్నుంచి పుట్టుకొచ్చిందే సినిమా పైరసీ అనే ఆలోచన. అయితే అది చట్టబద్దం కాదు. ఐబొమ్మ వెబ్‌సైట్‌లో చూసే పైరసీ సినిమా మధ్యలో వచ్చే బెట్టింగ్ యాప్స్‌కి సంబంధించిన యాడ్స్, ఇతర అసాంఘిక చర్యలకు సంబంధించిన యాడ్స్ వల్ల ప్రజలకు చేటు జరుగుతుంది. అయినప్పటికీ ప్రజలు దానికే మద్దతు తెలపడానికి ఇన్ని రకాల కారణాలు ఉన్నాయి.
ఐబొమ్మ రవి అరెస్ట్ వ్యవహారంలో.. సినిమా అభిమానులు, సగటు ప్రేక్షకులు చెబుతున్న ఒకే ఒక్క మాట.. అసలైన దొంగలను వదిలేసి రవిని అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? అని. అక్రమంగా సినిమాను ప్రజలకు చూపిస్తున్న రవి వల్ల ఇండస్ట్రీకి కోట్లలో నష్టం వచ్చిందని చెబుతున్నారు. మరి.. అదే అక్రమ మార్గంలో టికెట్ల రేట్లు పెంపు, మల్టీప్లెక్స్‌లలో దోపిడీ చేస్తూ కోట్లలో డబ్బును దండుకుంటున్న నిర్మాతలు, థియేటర్ల యాజమాన్యాలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? వారిని కూడా అరెస్ట్ చేసి విచారణ జరపాల్సిన అవసరం ఉంది కదా? అనేది ప్రజల నుంచి వినిపిస్తున్న మాట.
థియేటర్లకు ప్రేక్షకులు రావడం లేదు అని నిర్మాతలు వాపోతుంటారు. ప్రేక్షకులకు తక్కువ ధరలో సినిమా చూపిస్తే చూసేందుకు వారు సిద్ధంగానే ఉన్నారన్న విషయాన్ని నిర్మాతలు గుర్తించాలి. సగటు ప్రేక్షకులకు సినిమా అనేది అందుబాటులో లేకపోవడం వల్లే ఐబొమ్మ వంటి వెబ్‌సైట్స్‌ను ఆశ్రయిస్తున్నారు. ఈ విషయంలో చిత్ర పరిశ్రమ, ప్రభుత్వాలు సరైన నిర్ణయం తీసుకుంటే మునుపటిలాగే థియేటర్లు ప్రేక్షకులతో కళకళలాడతాయనే కామెంట్స్ సోషల్ మీడియాలో వేలల్లో కనిపిస్తున్నాయి. మరి మూవీ లవర్స్, ప్రజలు ఆశిస్తున్న ఈ మార్పును తీసుకురావడంలో చిత్ర పరిశ్రమ, ప్రభుత్వాలు ఎలాంటి చొరవ చూపిస్తాయో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



