Home

»

Latest News

స్వామీజీపై మైనర్ బాలిక సంచలన ఆరోపణలు.. ‘హుంకార్’ వెబ్ సిరీస్ ఎలా ఉందంటే.?

Sep 29, 2026 8:11PM

ప్రస్తుతం ఓటీటీలో కోర్ట్‌రూమ్ డ్రామాలకు మంచి ఆదరణ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో థ్రిల్లర్ అంశాలను కూడా జోడిస్తూ తెరకెక్కిన హిందీ వెబ్ సిరీస్ ‘హుంకార్: ది రోర్’. అనీత్ పడ్డా, ఫాతిమా సనా షేక్, రఘువీర్ యాదవ్, మహ్మద్ జీషాన్ అయ్యూబ్, అర్జున్ మాథుర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. కరణ్ డీ కపాడియా, నిత్య మెహ్రా దర్శకత్వం వహించిన ఈ ఆరు ఎపిసోడ్ల సిరీస్ సెప్టెంబర్ 25 నుంచి జియో హాట్‌స్టార్‌లో హిందీతో పాటు తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది.

‘శబరీ ఫోర్ట్’ అనే ఆశ్రమాన్ని నిర్వహించే బాప్జీ (రఘువీర్ యాదవ్)కు ఆ ప్రాంతంలో మంచి పలుకుబడి ఉంటుంది. ఆయన ఆధ్వర్యంలో నడిచే స్కూల్‌లో చదువుకునే మీనూ రావత్ (అనీత్ పడ్డా) ఓ రోజు తన తల్లిదండ్రులతో కలిసి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి బాప్జీపై తీవ్రమైన ఆరోపణలు చేస్తుంది. ఈ కేసును ఏసీపీ జస్లీన్ (ఫాతిమా సనా షేక్) దర్యాప్తు చేయడం మొదలుపెడుతుంది. అయితే బాప్జీకి ఉన్న రాజకీయ, సామాజిక ప్రభావం కారణంగా కేసు ముందుకు వెళ్లే కొద్దీ పోలీసులకు, బాధితురాలి కుటుంబానికి ఒత్తిళ్లు మొదలవుతాయి. బాప్జీ అరెస్టు తర్వాత ఆయన కుమారుడు రంగంలోకి దిగి మీనూ కుటుంబాన్ని ఇబ్బందుల్లోకి నెట్టేందుకు ప్రయత్నిస్తాడు. అసలు ఈ కేసులో నిజమేంటి? బాప్జీకి శిక్ష పడుతుందా? జస్లీన్ ఎదుర్కొంటున్న వ్యక్తిగత సమస్య ఏంటి? అనేది మిగతా కథ.

మొదటి ఎపిసోడ్ నుంచే బాప్జీపై మీనూ చేసే ఫిర్యాదు ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఆ తర్వాత అరెస్ట్, దర్యాప్తు, కోర్టులో వాదనలు, మీడియా కథనం ఇలా కథ విస్తరిస్తుంది. బాధితురాలితో పాటు దర్యాప్తు చేసే పోలీస్ అధికారి కూడా మహిళ కావడం ఈ కథలో కొంత కొత్తదనాన్ని తీసుకొచ్చింది. అయితే కథ ముందుకు వెళ్లే కొద్దీ వేగం తగ్గిపోతుంది. కోర్ట్‌రూమ్ సన్నివేశాలు, ఆధారాల సేకరణ, నరబలి, ఆత్మహత్యలకు సంబంధించిన అంశాలు వచ్చినప్పటికీ అవి ఆశించిన స్థాయిలో ఉత్కంఠను కలిగించవు. బాప్జీ, ఆయన కుమారుడు, ఆశ్రమాన్ని చూసుకునే శివానీ పాత్రలను మరింత బలంగా తీర్చిదిద్దితే కథకు ఇంకాస్త ప్రభావం వచ్చేది. ఫాతిమా సనా షేక్, అనీత్ పడ్డా సహా ప్రధాన నటీనటులంతా తమ పాత్రలకు న్యాయం చేశారు. నిర్మాణ విలువలు, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, నేపథ్య సంగీతం ఫర్వాలేదనిపిస్తాయి. అయితే బలమైన పాయింట్ ఉన్నప్పటికీ నెమ్మదైన కథనం, రొటీన్ ట్రీట్‌మెంట్ కారణంగా ‘హుంకార్: ది రోర్’ పూర్తిస్థాయిలో ఆకట్టుకోలేకపోయిందని చెప్పొచ్చు.

 

 

[Hunkkaar The Roar Review, Hunkkaar Review Telugu, Hunkkaar Web Series, Hunkkaar JioHotstar, Aneet Padda, Fatima Sana Shaikh, Raghubir Yadav, Hunkkaar Series Review, JioHotstar Web Series, Hunkkaar Telugu Review]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com