చెన్నైలోని ఈవీపీ స్టూడియో.. అక్కడ షూటింగ్ చేస్తే మరణించాల్సిందేనా?
on Feb 20, 2020

మూడేళ్ల క్రితం...
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ 'కాలా' సెట్స్ లో ప్రమాదం కారణంగా మైకేల్ అనే టెక్నీషియన్ మృతి చెందాడు.
రెండేళ్ల క్రితం...
బహుశా సెప్టెంబర్ నెలలో అనుకుంట! లోకనాయకుడు కమల్ హాసన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న తమిళ 'బిగ్ బాస్' రియాలిటీ షో చిత్రీకరణలో గుణశేఖరన్ అనే ఏసీ మెకానిక్ మృతి చెందాడు. స్టూడియోలోని సెకండ్ ఫ్లోర్ నుండి ప్రమాదవశాత్తు కింద పడడంతో మృతి చెందినట్లు వార్తలు వచ్చాయి.
ఏడాది క్రితం...
తమిళ స్టార్ హీరో, ఇళయ దళపతి విజయ్ హీరోగా నటించిన 'బిగిల్' సినిమా షూటింగులో సెల్వరాజ్ అనే ఎలక్ట్రీషియన్ మృతి చెందాడు. వంద అడుగుల ఎత్తున ఉన్న క్రేన్ కి కట్టిన లైట్ కింద పడడంతో అతడిని మృత్యువు కబళించింది.
ఈ ఏడాది...
కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న 'భారతీయుడు 2' సెట్స్ లో ప్రమాదం జరగడంతో ముగ్గురు మృత్యువాత పడ్డారు.
ఈ నాలుగు ప్రమాదాలకు, ఆరుగురి మరణాలకు ఒక లింక్ ఉంది. అది ఏంటో తెలుసా? చెన్నైలోని ఈవీపీ స్టూడియో. ఈ ప్రమాదాలు అన్నీ ఆ స్టూడియోలో జరిగినవే. ఒక ప్రమాదం వెనుక మరొకటి... మరొక ప్రమాదం వెనుక ఇంకొకటి... వరుసగా అదే స్టూడియోలో ప్రమాదాలు జరగడం, పలువురు మృతి చెందడం చర్చనీయాంశమవుతోంది. 'మురారి' చిత్రంలో ఒకే కుటుంబంలోని వ్యక్తులందరూ ప్రమాదాల కారణంగా మృత్యువాత పడినట్లు... ఈవీపీ స్టూడియోలో ప్రతి ఏడాది ఏదో ఒక ప్రమాదం జరగడం, ఎవరో ఒకరు మృత్యువాత పడుతుండటంతో కొత్త అనుమానాలు పుట్టుకొస్తున్నాయి. స్టూడియో వాస్తు బాలేదని కొందరు, ఏమై ఉంటుందని మరికొందరు తమకు తోచిన విధంగా మాట్లాడుతున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



