హెచ్ఎంవి మంగపతి ఇకలేరు.. కొవిడ్‌తో కన్నుమూత!
on May 13, 2021
ప్రఖ్యాత గ్రామ్‌ఫోన్ రికార్డుల సంస్థ హెచ్.ఎమ్.వి.కి సౌత్ అడ్వైజర్‌గా పనిచేసిన పుట్టా మంగపతి కరోనాతో బాధపడుతూ కన్నుమూశారు. ఆయన వయసు 96 సంవత్సరాలు. కొంత కాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయనకు ఇటీవల కొవిడ్-19గా నిర్ధారణ అయ్యింది. చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన ఎంతోమంది గొప్ప గొప్ప వారి వాయిస్ లను హెచ్.ఎమ్.వి కోసం రికార్డ్ చేశారు. ఘంటసాలతో 'భగవద్గీత'ను రికార్డ్ చేయించిందీ, ఎం.ఎస్. సుబ్బలక్ష్మితో 'అన్నమయ్య కీర్తనలు' పాడించిందీ కూడా మంగపతే.
పుట్టా మంగపతి స్వస్థలం తిరుపతి. టీటీడీలో కొంతకాలం, రైల్వే శాఖలో కొంత కాలం పనిచేశారు. సంగీతం అంటే ఆయనకు ప్రాణం. అదే ఆయనను హెచ్.ఎం.వి. సంస్థలో చేరేలా చేసింది. తన పాటల రికార్డంగ్ అనుభవాలను 'స్వరసేవ' పేరిట పుస్తక రూపంలో ప్రచురించారు. హెచ్.ఎం. రెడ్డి తీసిన తొలినాటి సినిమాలు 'తెనాలి రామకృష్ణ' (1941), 'ఘరానా దొంగ' (1942), 'నిర్దోషి' (1951) తదితర కొన్ని చిత్రాల్లో మంగపతి నటించారు కూడా. ఆయన మృతి పట్ల పలువురు సంగీతకారులు సంతాపం వ్యక్తం చేశారు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
