శ్రీలీల గాలి తీసేసిన నితిన్.. ఎందుకలా?
on Nov 28, 2023
ఈమధ్యకాలంలో ఎక్కువ బిజీగా ఉన్న హీరోయిన్‌గా శ్రీలీలకు మంచి పేరుంది. పెళ్లిసందడి సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన శ్రీలీల ఆ తర్వాత చేసిన ధమాకా సూపర్‌హిట్ కావడంతో ఆమెకు ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ ఇమేజ్ వచ్చేసింది. అవకాశాలు వెల్లువలా వచ్చి పడ్డాయి. చేతినిండా సినిమాలతో క్షణం తీరిక లేని హీరోయిన్ అయిపోయింది. ఆమె హీరోయిన్‌గా నటించిన సినిమాలు ఇప్పుడు వరసగా రిలీజ్ అవుతున్నాయి. అయితే మొదటి రెండు సినిమాల్లో వచ్చినంత పేరు ఇప్పుడు రిలీజ్ అవుతున్న సినిమాలకు రావడం లేదన్నది వాస్తవం. మొదటి దెబ్బ స్కందతో తగిలింది. ఈ సినిమా రామ్, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన భారీ సినిమా అనే పేరే తప్ప శ్రీలీలకు ఏమాత్రం ఇంపార్టెన్స్ ఉండదు. ఒక కమర్షియల్ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటే వారికి ఎలాంటి ఇంపార్టెన్స్ ఉంటుందో ఇందులోనూ అంతే ఉంది. రెండు సూపర్‌హిట్ సినిమాల తర్వాత వచ్చిన స్కంద శ్రీలీలకు తగిలిన మొదటి షాక్. ఆ తర్వాత వచ్చిన భగవంత్ కేసరి కమర్షియల్ సినిమా అయినప్పటికి అందులో హీరోయిన్‌గా కాకుండా తండ్రి ఆశయాన్ని నెరవేర్చే కూతురి పాత్ర కావడంతో శ్రీలీలకు అంత హైప్ రాలేదు. ఆ సినిమాలో బాలకృష్ణదే హవా కావడంతో శ్రీలీలకు ప్రత్యేకమైన గుర్తింపు రాలేదు. అయితే క్లైమాక్స్‌లో ఆమె చేసిన రిస్కీ ఫైట్స్ మాత్రం అందర్నీ థ్రిల్ చేశాయి. తాజాగా విడుదలైన ఆదికేశవ ఆమెకు మంచి విజయాన్ని అందిస్తుందని ఆశించింది. అయితే ఈ సినిమా కూడా పరాజయాన్ని చవిచూడడంతో వచ్చేనెల 8న రిలీజ్ అవుతున్న నితిన్ కొత్త సినిమా ‘ఎక్స్‌ట్రా’ పైనే ఆశలు పెట్టుకుంది. ఈ సినిమాలో తన టాలెంట్‌ని పూర్తిగా చూపించే స్కోప్ ఉండడంతో తనకు తప్పకుండా ప్లస్ అవుతుందని భావించింది. ఈ సినిమాలో తను వేసిన స్టెప్పులకు మంచి పేరు వస్తుందన్న నమ్మకంతో ఉంది.
‘ఎక్స్‌ట్రా’పై అన్ని ఆశలు పెట్టుకున్న శ్రీలీలకు మరో షాక్ తగిలింది. ఈ సినిమాలో హీరోగా నటించిన నితిన్ ఒక్కసారిగా ఆమె గాలి తీసేశాడు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సినిమాలోని అన్ని క్యారెక్టర్ల గురించి చెబుతూ శ్రీలీల క్యారెక్టర్ గురించి అడిగినపుడు.. ఆమెది చాలా రొటీన్ క్యారెక్టర్ అనీ, ఒక కమర్షియల్ సినిమాలో హీరోయిన్‌కి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో ఈ సినిమాలోనూ అంతే ఉంటుందని చెప్పడంతో రాబోయే సినిమాలో శ్రీలీల క్యారెక్టర్ ఏమిటి అనేది అందరికీ అర్థమైపోయింది. అంటే నెక్స్‌ట్ రాబోయే సినిమా శ్రీలీల కెరీర్‌కి ఎంతమాత్రం ఉపయోగపడదని నితిన్ చెప్పకనే చెప్పినట్టు అనిపిస్తోంది. మొదటి రెండు సినిమాలు సూపర్‌హిట్ అవడం, దాంతో లెక్కకు మించిన అవకాశాలు రావడంతో మరో రెండు మూడు సినిమాలతో హీరోయిన్‌గా టాప్ పొజిషన్‌కి వెళ్లిపోతుందని భావించిన వారందరూ రిలీజ్ అవుతున్న సినిమాలను చూసి ఇలా అయితే కష్టమే అనుకుంటున్నారు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
